నెహెమ్యా యెరూషలేము పట్టణ కాపురస్థుడు. అతడు యెరూషలేము పట్టణాన్ని ప్రాణాధికంగా ప్రేమించాడు. అతడు బాబేలు దేశపు రాజైన
అర్తహషస్తకు ద్రాక్షారసపు గిన్నెను అందించు ఉద్యోగం చేస్తున్నాడు. నెహెమ్యా షూషను కోటలో వుండగా కొందరు యూదులు అతని దగ్గరికి వచ్చిదుఃఖకరమైన
కొన్ని విషయాలు చెప్పారు. “యెరూషలేము శత్రురాజుల వశమైంది. ప్రజలంతా శత్రురాజు చేతిలో చెరపట్టబడినారు. మిగిలిన వారు చాలా శ్రమలు
అనుభవిస్తున్నారు. యెరూషలేము నగర ప్రాకారము కూలద్రోయబడింది. దాని గుమ్మములు, తలుపులు కాల్చివేయబడ్డాయి." ఈ విషయాలు తెలిసికొన్న నెహెమ్యా చాల బాధపడ్డాడు. కొన్ని దినములు ఉపవాసముండి సృష్టి కర్తయైన దేవుణ్ణి దీనంగా ప్రార్థించాడు. - "దేవా! నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలను అనుసరించే వారిని ప్రేమించే వాడివి, ఇశ్రాయేలు
ప్రజల దోషములు క్షమించేవాడివి. మిమ్ములను ఆశీర్వదించి కనాను దేశానికి రప్పిస్తానని ఇశ్రాయేలీయులతో, నీ దాసుడైన మోషేతో నిబంధన చేసినవాడివి, చెదరిపోయి, బెదరిపోయి, ఎంతోదీన పరిస్థితిలో వున్న ఇశ్రాయేలీయులు మరల యెరూషలేముకు వచ్చి, నిన్ను స్తుతించే భాగ్యము కలిగించు." నెహెమ్యారాజు అనుమతి పొంది
నెహెమ్యా ఎంతో విచారవదనంతో వున్నాడు. రాజు ఈ సంగతి గమనించాడు. కారణము అడిగాడు. అప్పుడు నెహెమ్యా యెరూషలేము యొక్క దుస్థితి అంతా రాజుకు వివరించాడు. 'నేను వెళ్ళినా పితరుల సమాధులుండే యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టించాలనుకొంటున్నాను. దయచేసి నాకు అనుమతి యివ్వండి. నేను యెరూషలేము చేరు వరకు నన్ను దాటించునట్లు నది అవతల వున్న అధికారులకు తాకీదులు యివ్వండి. పట్టణ ప్రాకారమునకు, దేవాలయమునకు, యిండకు అవసరమైన కలపను, దూలములను యివ్వమని అడవులను కాయు అధికారికి తాకీదులు యివ్వండి.” అని విన్నవించాడు.
రాజు నెహెమ్యా కోరిన ప్రకారం ఆదేశాలు యిచ్చాడు. అతని వెంట కొందరు సేనాపతులను, గుర్రపు రౌతులను కూడ పంపించాడు.
నెహెమ్యా చాలా మంది స్నేహితులను, అనుచరులను వెంట పెట్టుకొని యెరూషలేము వచ్చాడు.
రాత్రుల్లో రహస్యంగా నగరమంతా సంచరించి, దాని
దీనస్థితిని చూశాడు. కూలద్రోయబడిన పట్టణ ప్రాకారములు, కాల్చివేయబడిన గుమ్మములు చూసి ఎంతో బాధపడ్డాడు. ఒక దినము యూదులను,
యాజకులను, అధికారులను ఒకచోట సమకూర్చి “మనకు కలిగిన శ్రమ మీకందరకి తెలియును.
మన పట్టణం యొక్క దయనీయ స్థితిని మీరంతా
చూస్తున్నారు. మనమందరం కలిసి యెరూషలేము యొక్క ప్రాకారము తిరిగి కట్టుదము రండి. యెహోవా కృప వలన రాజు మనకు అనుమతి కూడ యిచ్చి
యున్నాడు.” అని వివరించాడు. కూడిన ప్రజలందరు తమ అంగీకారం తెలిపారు. అయితే యిరుగు పొరుగురాజులు అసూయతో నెహెమ్యాను,
ఇశ్రాయేలు వారిని హేళన చేయసాగారు. నెహెమ్యా మాత్రం శత్రువుల మాటలు లెక్కచేయలేదు.
యూదా ప్రజలు కుటుంబములు, గోత్రములు వారీగా అందరూ తమ తమ యిండ్లకు ఎదురుగా వున్న ప్రాకారాన్ని తిరిగి నిర్మించారు. గుమ్మములు
నిలిపారు. వాటికి తలుపులు, గొళ్ళెములు బిగించారు. ప్రాకారము త్వరత్వరగా కట్టబడుతోంది. సగం వరకు కట్టబడింది.
యెరూషలేము పట్టణము, ప్రాకారము తిరిగి కట్టబడుతున్నవని తెలిసిన శతృరాజులు చాలా కోపపడ్డారు. అసూయతో నిర్మాణపు పనిని
ఆటంకపరచాలని వచ్చారు. నెహెమ్యా మాత్రం తన పనిని కొనసాగించాడు. ప్రాకారానికి కట్టుదిట్టమైన కాపలా ఏర్పాట్లు చేశాడు. శతృవులు రహస్యంగా
ఇశ్రాయేలీయుల మధ్య ప్రవేశించి, వారిని చంపి, నిర్మాణపు పనిని ఆటంక పరచాలని కుట్ర చేశారు. ఈ విషయం నెహెమ్యాకు తెలిసింది. అతడు ప్రజలందర్నీ ప్రాకారం దగ్గర కత్తులతో, ఈటెలతో విల్లులతో సిద్ధంగా
వుంచాడు. “మీరేమీ భయపడకండి, మహాశక్తి మంతుడగు యెహోవాను స్మరించి మీ యింటివారి కొరకు, మీ నివాసములకొరకు ధైర్యంతో పోరాడండి” అని ధైర్యపరచాడు. అప్పటి నుండి పనివాళ్లలో సగం మంది ఆయుధములతో, కవచములు ధరించి యుద్ధానికి సిద్ధంగా వుండే వారు. గోడకట్టేవారు,
బరువులుమో సేవారు కూడ నడుములకు కత్తులు బిగించుకొని పనిచేయసాగారు. “బూర ధ్వని వినిపించగానే అందరూ ఆనోటికి రావాలనీ, యెహోవాయే తమ పక్షంగా యుద్ధం చేస్తాడనీ” చెప్పాడు. ఒకడు పనిచేయుచుండగా, అతని పనివాడు దినమంతా ఈటెను పట్టుకొని
యుద్ధసన్నద్ధుడై వుండేవాడు. ఈ విధంగా నెహెమ్యా చురుకుదనము, యెరూషలేము వాసుల ఐకమత్యము వలన శత్సరాజుల కుట్ర ఫలించలేదు.
ప్రాకారము పూర్తి అయింది. కాని గుమ్మములు యింకా నిలబెట్టవలసి వుంది. “నీతో అవసరంగా మాట్లాడాలి, ఓనో మైదానముదగ్గర వున్న ఒక గ్రామంలో కలిసి మాట్లాడుకుందాము రమ్మని శతృరాజులు నాలుగు సార్లు నెహెమ్యాకు వార్త పంపారు. కాని నెహెమ్యా మాత్రం 'నేను చేస్తున్న పనిని మానుకొని రాను” అని చెప్పి పంపాడు. అయిదవసారి శతృవులు పంపిన
లేఖలో ఈ విధంగా వ్రాయబడివుంది. “నీవు చేస్తున్న పని రాజుకు బొత్తిగా యిష్టం లేదు. నీవు అయనమీద తిరుగుబాటు చేస్తున్నావు. నీవే రాజువు కావాలనుకొంటున్నావు. ప్రచారం చేయమని ప్రవక్తలను నియమించావు.”
ఆ పత్రిక చదివిన నెహెమ్యా "మేము రాజుకు వ్యతిరేకమైన పనులు ఏవీ చేయడం లేదు" అని చెప్పి పంపించాడు 52 దినములలో యెరూషలేము ప్రాకారము, గుమ్మములు బాగుచేయబడ్డాయి. యెహోవా దేవుని ఆజ్ఞ పాటించి నెహెమ్యా యెరూషలేములోని అన్ని వంశముల, గోత్రముల, కటుంబములలోని జన సంఖ్యను లెక్కించాడు. నెహెమ్యా కోరగా ఎజ్రా అను శాస్త్రి ప్రజలందరికి
మోషే ధర్మశాస్త్రమును వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలందరు దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. యెరూషలేము ప్రాకారము
ప్రతిష్ఠింపబడినప్పుడు ప్రజలకు అంతులేని సంతోషం కలిగింది. లేవీయులు మంగళ వాద్యములతో దేవుని స్తుతించారు. ప్రజలు బలులు అర్పించి దేవునికి
కృతజ్ఞత చెల్లించారు.
తర్వాత కొన్ని సం||లకు నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గరికి వెళ్లాడు. ఆస్థానంలో కొంత కాలం గడిపాడు. రాజు అనుమతి తీసికొని, తిరిగి యెరూషలేముకు వచ్చాడు. నెహెమ్యా యెరూషలేములో వుంటూ, వారికి ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొనుటకు అవసరమైన సూచనలిస్తూ దేవుని మందిరములో సేవ సక్రమంగా జరుగుటకు సహాయపడ్డాడు. తన జీవితాన్ని దేవుని పట్టణంలో, స్వంత ప్రజల మధ్య గడిపాడు.
ధ్యానాంశములు :
1. నెహెమ్యా ఒక సాధారణ పౌరుడు, ధనము, అధికారము లేనివాడు. అయినా ఎంతో పట్టుదలతో యెరూషలేము ప్రాకారాన్ని పునర్నిర్మించాడు. భక్తులకు ఆదర్శం అయ్యాడు.
2. నెహెమ్యా యదార్ధమైన ప్రవర్తన గలవాడు, భక్తిపరుడు, ధైర్యశాలి. శతృవుల బెదిరింపులకు, కుట్రలకు భయపడలేదు.
3. నెహెమ్యా యెరూషలేము యొక్క దీనస్థితిని గురించి విని చాల బాధపడ్డాడు. దాన్ని బాగుచేయాలని దీక్ష బూనాడు. విశ్వాసులు కూడ
సంఘము పట్ల, సంఘ క్షేమం పట్ల ఆసక్తి, పట్టుదల చూపాలి.
4. నెహెమ్యా జీవితము విశ్వాసులకు ఒక ఆదర్శము.
బంగారు వాక్యము :
అందుకు వారు - మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.
నెహెమ్యా 2:18.
Praise the Lord tq for this wonderfull article it makes me stronger
ReplyDelete