Breaking

Thursday, 14 November 2019

Bible story of jonah | bible stories in telugu | యోనా


బైబిలులోని చిన్న ప్రవక్తలలో యోనా ఒకడు. యోనా దేవుని యందు భయభక్తులు గలవాడు.
దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. దేవుని మాటలను
ప్రజలకు ఉపదేశిస్తూ వుండేవాడు. యోనా తండ్రి పేరు అమిత్తయి. ఒకసారి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై "నినెవె పట్టణంలో వుండే ప్రజలు నన్ను మరచిపోయి, నాకు వ్యతిరేకంగా, తమ యిష్టం వచ్చిన విధంగా జీవిస్తున్నారు.
వారిపై నాకు చాల కోపం వచ్చింది. నీవు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని ప్రకటించు” అని ఆజ్ఞాపించింది. నినెవె ఒక మహానగరము. దాని జనాభా ఒక లక్ష యిరవై వేలు దానిని చుట్టి రావాలంటే మూడు దినాలు పడుతుంది. ఆ నగరంలోని ప్రజలు చాల ధనవంతులు. చాల తెలివి గలవారు. అయితే చాల దుర్మార్గులు కాబట్టి యోనా ఆ పట్టణానికి వెళ్లడానికి జంకాడు వాళ్లు తన మాట వినరనీ, తనను చంపుతారని భయపడ్డాడు. అందువల్ల నినెవె పట్టణానికి పోకుండా, మరో చోటికి
పోవాలని తలంచాడు. యెప్పే అనే రేవు పట్టణానికి వెళ్ళి, డబ్బు చెల్లించి తర్ణీషు వెళ్లే ఓడ ఎక్కాడు. ఓడ క్రింది భాగానికి వెళ్ళి హాయిగా నిపోతున్నాడు.

యోనా చేసిన పనికి యెహోవా దేవునికి చాల కోపం వచ్చింది. ఆయన సముద్రంలో గొప్ప తుఫాను పుట్టించాడు. పెద్ద గాలి అటు ఇటు వీస్తోంది.
గాలికి పెద్ద పెద్ద అలలు లేచాయి. అలల తాకిడికి ఓడబద్దలై పోతుందేమో అనిపిస్తోంది. ప్రయాణీకులు ఎంతో భయపడసాగారు. నావికులు, ఓడను అదుపు
చేయలేకపోతున్నారు. చాల సరుకులు సముద్రంలో వేసి, ఓడను తేలిక చేశారు. అందరూ తమ తమ దేవతలను ప్రార్ధింపసాగారు. అయినా తుఫాను తగ్గలేదు. కొందరు వెళ్ళి యోనాను నిద్ర లేపారు. “నిద్రపోతా! నీకు కొంచెమైనా భయం లేదు. లేచి దేవుని ప్రార్ధించు. ఆయన దయ చూపిస్తే ఈ తుఫాను
తగ్గిపోతుంది.” అని చెప్పారు.
ఓడలో వున్నవారు ఒక పని చేయాలనుకొన్నారు. “మనం చిటిలు వేద్దాము. ఈ తుఫాను ఎవరి మూలంగా వచ్చిందో తెలిసిపోతుంది” అనుకొన్నారు. చీట్లు వేశారు. చీటి యోనా పేరుతో వచ్చింది. అందరూ అతని వైపు అనుమానంగా చూశారు. "ఓయీ! నీవెవ్వరు? ఎక్కడికి పోతున్నావు? ఏమి పనిమీద పోతున్నావు? దేవునికి కోపం తెప్పించే పని ఏమి చేశావు?" అని అడిగారు. అప్పుడు యోనా "అయ్యా! నేను హెబ్రీయుడను. ఆకాశనివాసి, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా దేవుని భక్తుడిని. కాని ఆయన నినెవె పట్టణానికి పొమ్మంటే, తన్టీషుకు పారిపోతున్నాను. నా మూలంగానే
ఈ తుఫాను వచ్చింది. కనుక నన్ను సముద్రంలో పారవేస్తే తుఫాను తగ్గిపోతుంది.” అని చెప్పాడు. వాళ్లు వెంటనే దేవుని ప్రార్థించారు. "యెహోవా
దేవా! మేము ఈ మనుష్యుణ్ణి చంపినాము, అన్న అపరాధం మా మీదికి రానియ్యవద్దు" తర్వాత వాళ్లు యోనాను సముద్రంలో పారవేశారు. వెంటనే
సముద్రం శాంతించింది. ఈ సంగతి గమనించిన ప్రయాణీకులు యెహోవా నిజమైన దేవుడని నమ్మారు. దేవునికి మిక్కిలి భయపడ్డారు. ఆయనకు బలులు అర్పించారు. ఆయనే నిజమైన దేవుడని నమ్మారు


దేవుడు పంపిన ఒక పెద్ద చేప యోనాను మ్రింగింది. యోనా చేప కడుపులో మూడు రోజులున్నాడు. తాను చేసిన తప్పుకు క్షమాపణ వేడాడు.
"దేవా! నీవు నన్ను కాపాడితే నేను నీ మందిరానికి వస్తాను. బలులు అర్పిస్తాను. మొక్కుబడులు చెల్లిస్తాను. నీవే నాకు దిక్కు, రక్షణాధారము, నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు” అని దీనంగా ప్రార్థించాడు. యెహోవా దేవుడు యోనా ప్రార్థన ఆలకించాడు. ఆయన చేపకు ఆజ్ఞ ఇవ్వగానే, అది యోనాకు నినెవె పట్టణ ప్రాంతంలో సముద్రపు ఒడ్డున కక్కివేసింది." -

దేవుని వాక్కు ననుసరించి, యోనా నినెవె మహా పట్టణానికి వెళ్లాడు. నగరంలో ఒక రోజంతా తిరిగాడు. నగరంలోని ప్రజలకు కలుగబోయే గొప్ప
ఆపదను గురించి ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న నినెవె పట్టణస్థులు గడగడ వణికారు. దేవుని మాటలు విశ్వసించారు. నగరమంతా ఉపవాస దినం
ప్రకటించారు. గొప్పవారు, పేదవారు అనే బేధం లేకుండా అందరూ దీనులై గొనెపట్టలు కట్టుకొని దేవుని ప్రార్థింపసాగారు. ఈ విషయం తెలిసికొన్న
రాజు కూడ దీనుడై, గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజు, మంత్రులు ప్రకటన చేయించారు. ప్రజలందరు ఉపవాసం వున్నారు. పశువులు కూడ మేత మేయలేదు. ప్రజలందరు దీనులై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించారు. దేవునికి ఆ నగర వాసులపై దయకలిగింది. ఆయన నినెవె పట్టణాన్ని నాశనం చేయడం మానుకొన్నాడు.

నినెవె పట్టణం నాశనం కాలేదని యోనా తెలిసికొన్నాడు. అతడు యెహోవా దేవునితో అన్నాడు - ప్రభువా ! నీవు నినెవె వాసులపై జాలి
చూపుతావనీ, వారిని క్షమిస్తావనీ నాకు తెలుసు. అందుకే నేను తరీషు పట్టణానికి పారిపోయాను” అన్నాడు.

యోనా నినెవె పట్టణానికి దూరంగా తూర్పు వైపున ఒక పందిరి వేసికొన్నాడు. దాని క్రింద వుంటున్నాడు. ఏమి జరుగుతుందో చూడాలనుకొన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఒక సొరచెట్టును మొలపించాడు. అది పెరిగి పెద్దదై మంచి నీడ యిచ్చింది. ఆ చెట్టును చూసి యోనా సంతోషించాడు.

మరునాడు యెహోవా ఒక పురుగును పంపాడు. అది సొరచెట్టును పూర్తిగా తినివేసింది. యోనా మీద ఎండ పడింది. అందువల్ల యోనా విసుక్కొన్నాడు. చావడం మంచిది అనుకొన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు
యోనాతో "నీవు కష్టపడకుండా, పెంచకుండా, తనకు తానే పెరిగి చచ్చిపోయిన సొర చెట్టువాడిపోయినందుకు యింతగా బాధపడుతున్నావే! లక్షా యిరవైవేల
జనాభాతో వేల పశువులతో నిండివున్న నినెవె మహా పట్టణం నాశనమైపోతే నాకు బాధ వుండదా?” అన్నాడు.
అప్పుడు యోనా దేవుని దయా గుణాన్ని,
తన తొందర పాటును తెలిసికొన్నాడు.


ధ్యానాంశములు :

1. యోనా ఒక మంచి ప్రవక్త. దేవుని యెడల భయభక్తులు వున్నవాడు.

2. యోనా భయస్తుడు. కాబట్టి నినెవె పట్టణస్థులకు భయపడి, దేవుని ఆదేశానికి వ్యతిరేకంగా తగ్గిషు ఓడ ఎక్కాడు.

3. మనం కూడ స్వంత యిష్టాలు నెరవేరాలని ప్రయత్నాలు చేస్తాము. అయితే చివరకు దేవుని చిత్తమే నెరవేరుతుంది.

4. దేవుడు తన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణాసంపన్నుడు

5. యోనా మూడు దినములు చేప కడుపులో వుండి బయటికి వచ్చాడు. యేసుక్రీస్తు మూడు దినములు సమాధిలో వున్నాడు. మరణాన్ని జయించి
తిరిగి లేచాడు.


బంగారు వాక్యము:

ఇదిగో, యోనా కంటె గొప్పవాడు ఇక్కడ వున్నాడు. మత్తయి 12:41

No comments:

Post a Comment