ఇది క్రిస్మస్ సమయం. క్రీస్తు జన్మదిన సందేశాన్ని,
సంతోషంగా ఆయా రీతులుగా వెల్లడి చేసే సమయం. క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటికి సున్నాలు, క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ కేకులు, మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్టు వివిధ పేర్లతో క్రిస్మస్ జరుపుకుంటాము. క్రిస్మస్లో భాగంగా ఇంటిపై రంగురంగుల నక్షత్రం, ఇంటి లోపలక్రిస్మస్ ట్రీ ఎంతో అందంగా మనం అలంకరిస్తాము. ఆ క్రిస్మస్ ట్రీకి మనం తగిలించిన మెరుపులతో కూడిన నక్షత్రాలే అసలు అందాన్ని తెస్తాయి.
ఏళ్ళ తరబడి మనం క్రిస్మస్ ట్రీకి నక్షత్రాలను
తగిలిస్తున్నాము. కొన్నిసార్లు నక్షత్రాల్లాంటి కరెంటు బల్బులను కూడా తగిలించి ఆ చెట్టును అలంకరిస్తున్నాము. ఇంతకీ ఆ చెట్టుకు నక్షత్రాలకు ఉన్న సంబంధం ఏమిటో ఎప్పుడైనా
ఆలోచించారా? ఆ నక్షత్రాల వెనుక ఒక విచిత్రమైన కథ ఉన్నదట. అది ఏమనగా “ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమ్మీద కన్యయైన మరియ ద్వారా పశువులపాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతా ఆ
మహిమా స్వరూపి, సృష్టంతటికీ ఆధారసంభూతుడైన దేవుడు భూమిమీద జన్మించినప్పుడు, భూమిమీద ఉన్న చెట్లన్నీ బహుగా ఫలించి, తమ ఫలములతో తమ్మును తాము అలంకరించుకొని యేసయ్య చుట్టూ సంబరముతో తిరుగుచుండెనట. అలానే పక్షులు, పుష్పించే ప్రతి మొక్క తమతమ పుష్పాలతో చక్కగా అలంకరించుకొని క్రీస్తు చుట్టూ తిరుగుచూ బహుగా సంతోషించుచూ వుండగా ఆకాశ నక్షత్రాలు కూడా దివి నుండి భువికి దిగివచ్చి తమ తేజస్సుతో ఆ ప్రాంతమంతా వెలుగుతో నింపెనట. కానీ (Fir Tree) ఫర్ ట్రీ అనగా నేడు మనం పిలుస్తున్న క్రిస్మస్ ట్రీ మాత్రం ఎటువంటి సంతోషం, ఆనందం
లేక ఒకమూల దిగులుతో ఆ పూలచెట్లు, ఆ పండ్ల చెట్లు బహుగా ఫలించి తమ పువ్వులతో, పండ్లతో తమ్మునుతాము అలంకరించుకొని ఆనందిస్తూ వుండగా ఏ పండ్లు, ఎటువంటి పువ్వులు లేని క్రిస్మస్ ట్రీ దూరముగా నిలబడి పుష్పాలను, ఫలాలను, నక్షత్రాలతేజస్సును దిగులుతో చూస్తూ వుండెనట.
అది గమనించిన నక్షత్రాలు ఆ క్రిస్మస్ ట్రీ (Fir Tree)
దగ్గరకు వెళ్ళి ఎందుకని నీవు దిగులుగా ఉన్నావు, ఎందుకని ఈ పండుగలో నీవు పాలుపంచుకొనకుండా దీనంగా, దూరంగా నిలబడిపోయావు అని అడిగెనట. అప్పుడు ఆ ట్రీ మరీ... మరీ... ఆ చెట్లకేమో ఫలములు ఉన్నాయి, ఈ మొక్కలకేమో చక్కని పూవులున్నాయి. అవి వాటి ఫలములచేత, పువ్వులచేత చక్కగా
అలంకరించుకొని అందంగా తయారయ్యాయి. మరి నేనేమో ఏ ఫలములకు, పుష్పాలకు నోచుకోని అభాగ్యురాలిని. అందుకే దిగులుతో ఓ మూలవుండి వారి ఆనందాన్ని చూడగలుగుతున్నానే
గాని వాటితో పాలు పంచుకోలేకపోతున్నాను అని అంటుండగా, ఆ నక్షత్రాలు తమ ఆనందాన్ని సంతోషాన్ని మరచి ఎటువంటి ఫలములు, పుష్పములు లేక గుర్తింపునకు నోచుకోలేక ఉన్న ఆ
చెట్టు పట్ల జాలిపడి, ఆ నక్షత్రాలన్నీ ఏ ప్రత్యేకత లేని ఆ చెట్టును తమ అందముతో, తేజస్సుతో నింపి యేసయ్య ముందుకు తీసుకొని రాగా అక్కడ ఉన్న చెట్లు, మొక్కలు, నక్షత్రాలమధ్య ఆ క్రిస్మస్ ట్రీ ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందట.
ఈ కథను ఆధారం చేసుకొని అప్పటినుండి క్రిస్మస్ ట్రీని
నక్షత్రాలతో అలంకరించడం ఆచారంగా మారిందట.
కానీ ఈ కథలో ఓ గొప్ప క్రిస్మస్ సందేశం ఉంది సుమా! అదేమనగా, ఏ రీతిగా నక్షత్రములు తమ్మునుతాము తగ్గించుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని మరచి ఫలములు, పుష్పములు లేని ఆ చెట్టును అలంకరించి ఆకర్షణను, అందాన్ని అందించినవో అలాగే పాపములచేత, అపరాధములచేత చచ్చిన మనము మన పాపములవలన శాంతి, సమాధానములు, సుఖ సంతోషములు నోచుకోక దిక్కుమాలిన వారిగా దిగులుతో జీవిస్తున్న మనలను తన నీతితో రక్షణ వస్త్రముతో అలంకరించవలెనని రెండువేల
సం||ల క్రితం మన కొరకు ఉదయించిన ఆ రక్షణ చుక్క మన ప్రభువైన యేసు. ఆయన ఏరీతిగా తన జన్మ ద్వారా దేవుని ప్రేమను పంచి పెట్టాడో, ఆ నక్షత్రములు ఏ రీతిని తమ్మును తాము మరచి సంతోషమునకు నోచుకోని ఆ ఫర్ ట్రీ ని అలంకరించినవో అదే రీతిగా ఈ క్రిస్మస్ నందు నీ ప్రేమను, నీ సంతోషాన్ని దీనులతో, పేదవారితో పంచుకొని నిజ క్రిస్మస్ ను జరుపుకోవాలి అంతేకాకుండా ఈ క్రిస్మస్ నాడైనా ఎవరో ఒక అన్యున్ని వారి కుటుంబాన్ని క్రీస్తు సంఘమునకు నడిపించి క్రీస్తు ప్రేమను వారు
తెలుసుకొనులాగున ఎందుకు ప్రయత్నించకూడదూ
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను
పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించేదరు దాని 12:3
No comments:
Post a Comment