Breaking

Friday, 7 May 2021

Bible Quiz In telugu




1.ప్రకటన గ్రంధాన్ని  వ్రాసింది ఎవరు? 
A.పౌలు
B.పేతురు
C.యోహాను 
D.యాకోబు 

Ans : C.యోహాను

యోహాను ఈ గ్రంథంలోని చిహ్నాలు, సూచనలు, సంకేతాలు, మాటలు వేటినీ మరే ఇతర సాహిత్యంలోనుంచి తీసుకోలేదు. యేసుప్రభువే  దీనంతటినీ యోహాను కు వెల్లడి చేశాడు.
దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చింది భవిష్యత్తును వెల్లడి చేయడం కోసమే గాని దాన్ని మరుగు చేయడం కోసం కాదు. మనం దీన్ని గ్రహించాలనే గానీ దీన్ని చదివి కలవరపడాలని కాదు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళిలో దాని అంతాన్ని గూర్చిన కలవరాన్ని భయాన్ని కలిగిస్తున్నాయి అయితే బైబిల్ లోని చివరి పుస్తకమైనా ప్రకటన గ్రంధాన్ని చదువుతున్నప్పుడు 
లోక స్థితి గతులు, దాని భవిష్యత్తు అర్థమవడమే కాకుండా అన్ని సవ్యంగానే జరుగుతున్నాయనే నమ్మకాన్ని కలిగిస్తుంది 
ప్రకటన గ్రంధం బైబిల్ లో 66 వ పుస్తకం మరియు చివరి పుస్తకం దానిని అర్థం చేసుకోవాలంటే 
దానికి ముందున్న 65 పుస్తకాలను గూర్చి 
తెలుసుకొని ఉండాలి 
ప్రకటన గ్రంధం ప్రవచన ధారులన్నింటిని కలిపే 
ఒక గొప్ప కూడలి అని చెప్పవచ్చు 




2.యెహోవా నిస్సీ అనే పేరుకు అర్థం ఏమిటి? 
A.ధ్వజము 
B.జయము 
C.అపజయము 
D.బలము 

Ans : A.ధ్వజము

అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయడానికి వచ్చినప్పుడు మోషే యెహోషువతో మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయమని ; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలబడి ఉంటానని చెప్పాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధము చేసాడు ; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు 
మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.
అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అప్పుడు యెహోవా మోషేతో  నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థ ముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుమనెను. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
అమాలేకీ యులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధ ముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
ప్రియులారా 
తన ప్రజలకు వారి శత్రువులపై విజయాన్నిచ్చేది  దేవుడే . క్రైస్తవ జీవితం ఆత్మసంబంధమైన శత్రువులకు విరోధంగా జరిగే పోరాటం లాంటిది  దేవుని శక్తిమీద ఆధారపడితే తప్ప ఈ పోరాటములో మనము విజయాన్ని సాధించలేము. గెలవాలంటే పోరాడాలి. కానీ గెలుపు మాత్రం దేవునియొక్క  ఉచితమైన  బహుమతే. అంతేగాని మన ప్రయత్నంవల్ల గాని, బలంవల్ల గాని రావని గ్రహించాలి 



3.నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతితో 
రాజు నగరునందు నిలువదగిన బాలురను ఎన్ని సంవత్సరములు పోషించమని చెప్పెను? 
A.రెండు 
B.మూడు 
C.ఐదు 
D.పది 

B.మూడు

నెబుకద్నెజరు రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,
తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.
మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.



4.నపుంసకుల యధిపతి దానియేలు మాటకు సమ్మతించి ఎన్ని దినములు వారిని పరీక్షించెను? 
A.మూడు దినములు 
B.ఐదు దినములు 
C.పది దినములు 
D.ఇరువది దినములు 

Ans : C.పది దినములు

నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.
రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా ​దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను
​మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.
నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామ కునితో దానియేలు ఇట్లనెను.
భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.
పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుమనెను  అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను. ​పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యాదుల నిచ్చెను.
ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివే చనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.


5.దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు ఏమి అనుగ్రహించును? 
A.జ్ఞానమును
B.తెలివిని 
C.ఆనందమును
D.పైవన్నీ 

Ans : D.పైవన్నీ

ప్రియులారా జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు 
మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.
ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.
నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.అని 
ప్రియులారా 
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చునని వ్రాయబడి ఉంది 


6.లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, ------ ను  జరిగించువాడు నిరంతరమును నిలుచును? 
A.దేవుని సేవను 
B.దేవుని చిత్తమును
C.దేవుని అద్భుతములను 
D.దేవుని సూచక క్రియలను 

B.దేవుని చిత్తమును

ప్రియులారా ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
మనము దేవుని సంబంధులమనియు,లోకమంతయు దుష్టునియందున్నదనియు ఎరుగుదుము 
మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము.
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.


7.నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
అని అన్నది ఎవరు? 
A.పౌలు 
B.పేతురు 
C.యోబు 
D.యోహాను 

Ans : A.పౌలు

పౌలు తన జీవం ద్వారా గాక తనలోని క్రీస్తు జీవం మూలంగానే జీవిస్తున్నాడు. తన శక్తివల్ల గాక క్రీస్తు శక్తి మూలంగానే ఆయన్ను సేవిస్తున్నాడు. అతని గురి క్రీస్తుకే గానీ తనకు ఘనత కలగాలని కాదు.
పౌలుకు చావంటే  భయం లేదు తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని అతనికి బాగా తెలుసు 
ప్రియులారా 
భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము.
ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు.
పౌలు ఈ విధంగా అంటున్నాడు 
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము అని 
సహోదరి సహోదరులారా   
మనము మృతిపొందితిమి మన  జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము

No comments:

Post a Comment