* జీవితం అనేది సమస్యల సుడిగుండం సమస్యలు లేని వారు ఎవరు లేరు ఎవరిని కదిలించిన ఏదో ఒక సమస్య గుండా ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నామని చెప్తారు. చాలా సార్లు మన జీవితంలో శ్రమల గుండా ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఎందుకని నా జీవితంలో ఈ శ్రమను అనుమతించాడు ఈ శ్రమ వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి అనే ప్రశ్న మనకు కలుగుతుంది
అయితే మనము ఎదుర్కునే ప్రతీ సమస్య వెనకాల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయనే విషయాన్నీ మనము గ్రహించాలి.
దేవుడు మనము బాధపడుతుంటే సంతోషించే వాడు కాదు గాని మనము బాగుపడాలని ఆశించేవాడు
మన బాధల్ని తొలగించేవాడు. ఏ తండ్రి కూడా తన కుమారుడు బాధ పడుతుంటే సంతోషించడు అలాగే ఏ తండ్రి కూడా తన కుమారుడు పాడవుతుంటే చూస్తూ ఊరుకోడు. కొన్నిసార్లు కుమారుని క్షేమం కొరకు తండ్రి కుమారుణ్ణి శిక్షించడానికి కుడా సిద్ధపడతాడు. అలాగే మన పరమ తండ్రి కూడా మనల్ని శ్రమల గుండా ఇరుకు ఇబ్బందుల గుండా తీసుకు వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిలో ఐదు ప్రాముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం
మొదటిగా దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి కారణమేంటంటే
మనల్ని సరిచేయడానికి
అన్ని బాగున్నప్పుడు సాధారణంగా ఎవరికి దేవుడు గుర్తుకు రాడు కానీ ఒక సమస్య రాగానే వెంటనే దేవుణ్ణి ప్రశ్నించడానికి దేవుణ్ణి నిందించడానికి దేవుడు గుర్తుకు వస్తాడు
సమస్యను బట్టి దేవుని మీద సనగాడనికి సిద్ధపడతారు కానీ నా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా దేవుడు ఆశించిన రీతిగా నేను జీవిస్తున్నానా అని పరిశీలించుకోరు
సాధారణంగా మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు మనమే కారణం మనము తీసుకునే తప్పుడు నిర్ణయాలు మనము వేసే తప్పటడుగులు మనకు శ్రమల్ని తెచ్చిపెడతాయి
మనము ఆ శ్రమల్లో మ్రగ్గి పోవాలని ఆ శ్రమల్లో కూరుకుపోవాలని దేవుడు ఆశించట్లేదు గాని
మన జీవితాన్ని మార్చుకొని ఆయన వైపు తిరగాలని
ఆయన మార్గములో నడవాలని ఆయన ఆశిస్తున్నాడు
ఎప్పుడైతే దేవునికాయసకరమైనవి మన నుండి తొలగించుకుంటామో అప్పుడే దేవుని కార్యాలు
మన జీవితంలో జరగడం ప్రారంబమౌతాయి
గనుక ఇకనైనా మన జీవితాల్ని సరి చేసుకొని
దేవుని మార్గములో నడుస్తూ దేవుని సహాయముతో ప్రతీ సమస్య నుండి విడిపించబడదాం
దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి రెండవ కారణమేంటంటే
మనల్ని పరీక్షించడానికి
కొన్ని సార్లు మనము నీతిగా న్యాయంగా యధార్థంగా జీవిస్తున్నప్పుడు కూడా శ్రమల గుండా వెళుతుంటాము
చేయని తప్పుకు నిందలు భరిస్తూ ఉంటాము
ఇలాంటి సమయములో సైతాను మనతో చెప్పే మాటేంటంటే నీవు నీతిగా న్యాయంగా యధార్థంగా
జీవించడం వల్ల ఏమైన ఉపయోగం ఉందా
దేవుని నమ్ముకోవడం వల్ల నీకేమి జరిగింది దేవుడు నీకు ఏ మేలు చేసాడు దేవుణ్ణి దూషించి ఆయన్ను విడిచిపెట్టు నీ సమస్య నుండి నీవు బయట పడలేవు గనుక నిన్ను నీవు చంపుకుని తనువు చాలించమని
పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటాడు
ఇలాంటి సమయములో మనము నీతిని యథార్థతను విడిచిపెడతా చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటామా అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు
దేవుడు మనల్ని పరీక్షించేది ఏమి లేనివారినిగా ఎందుకు పనికిరాని వారిగా చేయడానికి కాదు గాని
ఉన్నతమైన వ్యక్తులుగా మార్చి ఉన్నతమైన స్థానములో నిలబెట్టడానికే.
ఎప్పుడైతే మనము ఆ పరీక్షలో పాస్ అవుతామో ఓర్పుతో మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో అప్పుడే దేవుణ్ణి ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరగడాన్ని దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడాన్ని చూస్తాం
ఉదాహరణకు యోబు జీవితాన్ని చూస్తే మనకర్థమవుతుంది యోబు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు అయినప్పటికీ తన విశ్వాసాన్ని తన యధార్థతను మాత్రం విడిచిపెట్టలేదు చివరికి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు
గనుక ఇక నుంచి మన జీవితంలో ఎన్ని శ్రమలోచిన ఎన్ని ఇబ్బందులొచ్చిన మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ యదార్థంగా జీవిస్తూ ఓర్పుతో ముందుకు సాగువారమై యుంధాం
దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి మూడవ కారణమేంటంటే
మనకు నేర్పించడానికి
సాధారణంగా అన్ని బాగున్నపుడు చాలా మంది దేవుని మాట వినడానికి ఇష్టపడరు కానీ ఏదో ఒక శ్రమ రాగానే వెంటనే దేవుని వైపు తిరుగుతారు
దేవుని మాటలు వింటారు
ఇలాంటి సమయములోనే మన జీవితానికి కావాల్సిన
అనేక గొప్ప పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు
మన జీవితం మారడానికి దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి దేవుని ఆశీర్వాదాలు మనము చూడడానికి విదయతే అతి ప్రాముక్యమై యున్నది
ఎప్పుడైతే మనము దేవుని మాటలు వింటామో అప్పుడే విధేయత చూపడం నేర్చుకుంటాము
ఎప్పుడైతే విధేయత చూపడం నేర్చుకుంటామొ
అప్పుడే దేవుడు మన జీవితంలో పని చేయడం ప్రారంభిస్తాడు ఇప్పటి వరకు దేవుని మాట విని ఆశీర్వదించబడిన వారే గాని నష్టపోయిన వారు ఎవరు లేరు
దేవుని మాటలు విని ఆ మాటలకు విధేయత చూపి
ఆశీర్వదించబడదామా లేక మన ఇష్టానుసారంగా జీవించి కష్టాలను నష్టాలను కొనితెచ్చుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంది
మనం తీసుకునే నిర్ణయం మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్నీ మనము గ్రహించాలి
దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి నాల్గవ కారణమేంటంటే
మనకు మేలు చేయడానికి
కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలకు నష్టాలకు కారణాలేంటో మనకు అర్థం కావు
మనకు జరిగే కీడులను చూసి భయపడుతూ ఉంటాము కానీ ఆ కష్టం వెనకాల ఆ కీడు వెనకాల
కూడా దేవుడొక గొప్ప మేలును దాచి ఉంచాడనే విషయాన్నీ మనము గ్రహించాలి
ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూసినట్లయితే తన సొంత అన్నలే అతన్ని అమ్మివేసారు చిన్న వయసులోనే ఒక బానిసగా బ్రతకాల్సి వచ్చింది చేయని తప్పుకు నిందలు భరించి
చెరసాలలో వేయబడ్డాడు అయినా ఇవన్నీ యోసేపుకు ప్రతికూలంగా జరిగినప్పటికీ అవన్నీ దేవుడతని మేలుకే ఉద్దేశించాడు బానిసగా బ్రతికిన దేశంలోనే దేవుడు యోసేపును ప్రధాన మంత్రిగా నియమించాడు
అనేకులకు ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని మార్చాడు
మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనకు అర్థం కాక పోయిన అవి దేవుడు మేలుకే ఉద్దేశించాడని విశ్వసించాలి ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసముంచి దైర్యంగా ముందుకు సాగడం నేర్చుకుంటామో అప్పుడే ఆయన మన కొరకు దాచి ఉంచిన గొప్ప మేలులను మన జీవితంలో చూడగలము
దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతించడానికి ఐదవ కారణమేంటంటే
మనల్ని పరిపూర్ణతలోకి తీసుకు రావడానికి
బంగారము కొలిమిలో వేస్తే ఏ విధంగా అయితే శుద్ధీకరించబడుతుందో అదే విధంగా మనిషిని శ్రమలు అనే కొలిమిలో వేసినప్పుడే శుద్ధీకరించబడుతాడు
శ్రమలు మనిషిని ఉన్నతునిగా చేస్తాయి
శ్రమల్లోనే మనిషి దేవుని యొక్క ప్రేమను
జీవితం యొక్క విలువను స్పష్టంగా గ్రహించగల్గుతాడు
ఈ లోకములో ఉన్నదంతయు వ్యర్థమేనని
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే
శ్రేష్ఠమని తన నోటితో ఒప్పుకుంటాడు
భూ సంబంధమైన వాటి మీది నుండి తన మనసును పర సంబంధమైన వాటి వైపుకు తిప్పుకుంటాడు
దేవుడు మనము విలువైన వాటి కోసం ప్రయాసపడాలని విలువైన వాటి వెంట పరిగెత్తాలని విలువైన వాటిని సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడు
శ్రమలు మనము విలువైన జీవితాన్ని జీవించేలా చేస్తాయి గనుక శ్రమల్లో మనము కృంగిపోక దేవుని వైపు చూస్తూ దేవుని చేత శుద్ధీకరించబడుతూ పరిపూర్ణతలోకి రావడానికి ప్రయత్నిద్దాం
భూ సంబంధమైన వాటి మీది నుండి మన మనసును పర సంబంధమైన వాటి వైపుకు తిప్పుకుందాం
దేవుడు ఎందుకని మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తాడు? అనే ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లైతే నాతో పాటు ప్రార్ధనలో ఏకీభవించండి
పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి
శ్రమలు మాకెందుకొస్తాయనే ఈ అంశం మీద
నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు
తండ్రి నీవు మమ్మల్ని బాగుచేయడానికి పరీక్షించడానికి మాకు శ్రమలు అనుమతిస్తావని ఆ శ్రమల్లో అనేక పాఠాలు నేర్పిస్తావని
కొన్నిసార్లు మాకొచ్చే శ్రమలకు కారణాలు మాకు అర్థం కాకపోయినా వాటి వెనకాల గొప్ప మేలును నీవు దాచి ఉంచావని మేము పరిపూర్ణత లోకి రావడానికి
శ్రమలు మాకు తోడ్పడతాయని నీవు సెలవిచ్చావు
తండ్రి నీకు స్తోత్రములు
దేవా మేము శ్రమల్లో క్రుంగిపోక విశ్వాసాన్ని కాపాడుకుంటూ అన్ని విషయాల్లో నీకు విధేయత చూపుతూ నీవు మా కొరకు దాచి ఉంచిన గొప్ప మేలులను మేము పొందుకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని
భూ సంబంధమైన వాటి మీది నుండి మా మనసును పర సంబంధమైన వాటి వైపుకు తిప్పుకుని పరిపూర్ణతలోకి మేము చేరుటకు కృపచూపమని
యేసుక్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రి ఆమెన్
No comments:
Post a Comment