బైబిల్లో అతి ప్రధానంగా అతి ప్రాముక్యంగా తెలియజేయబడిన అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రేమే. ప్రేమను గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈ లోకములో మనకు ఎన్నో రకాల ప్రేమలు కనిపిస్తాయి. తల్లి దండ్రుల ప్రేమ భార్య భర్తల మధ్య ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ సహోదరుల మధ్య ప్రేమ ఇలా ఏ బంధాన్ని తీసుకున్న దానికి మూలాధారం ఏదైనా ఉంది అంటే అది ప్రేమే.
ప్రేమే మనుషుల్ని ఐక్యపరచేది ప్రేమే మనుషుల్ని నడిపించేది ప్రేమే మనుషుల్ని బ్రతికించేది
కానీ దానిని పరిశీలనగా చూస్తే దాని వెనకాల కూడా స్వార్ధం లాభం మోసం లాంటివి కనిపిస్తాయి
ఈరోజు మనిషి ఆశించేది స్వచ్ఛమైన ప్రేమ
మనిషి కోరుకునేది నిజమైన ప్రేమ
కానీ మనిషికి అది దొరకట్లేదు
వస్తువుల్లో లేక పదార్థాల్లో కల్తీ ఉన్నట్లుగా ఈరోజు మనుషుల ప్రేమల్లో కుడా కల్తీ ఉండడం చూస్తున్నాం
ప్రేమించాను అని చెప్తూనే వంచించే వారు ఎందరో ఉన్నారు. అయితే నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మనిషికి ఎక్కడ దొరుకుతుంది ఆ ప్రేమను పొందుకోవాలంటే ఆ ప్రేమను కలిగి జీవించాలంటే ఏం చెయాలి. ప్రేమకు నిజమైన అర్థం ఏంటి ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈరోజు జవాబులు చూద్దాం
మొదటిగా ప్రేమను గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే మనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదని ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడని ఈ లోకములో ఎన్ని ఆస్థి పాస్తులు సంపాదించుకున్న ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిన ఎన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమేనని బైబిల్ సెలవిస్తోంది
ఒక వ్యక్తిలో ప్రేముంటే అతనిలో కనిపించే లక్షణాలెంటో
ఒక వ్యక్తిలో ప్రేముంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుందో
బైబిల్ లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది
నిజమైన ప్రేమలో ఉండే పదిహేను లక్షణాల గురించి
ఈ రోజు మనము చూద్దాం
మొదటిగా ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది
ఇతరులు మనపట్ల చేసిన తప్పులను, గాయాలను, ద్రోహాలను, కఠినమైన మాటలను చర్యలను చూసి ఎలాంటి ద్వేష భావం లేకుండా ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనసును, సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది ఇది యేసుక్రీస్తు జీవితమంతటా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయనకు విధించిన తీర్పు, ఆయన పొందిన శ్రమలు ఆయన మరణ సమయములో ఇది మరింత స్పష్టంగా వెల్లడయింది
ఆయన్ను వెంబడించే ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసిన లక్షణం ఇదే
మనిషి తనకు తానుగా ఇలా ఉండడం కష్టమే అనిపించవచ్చు కానీ దేవుని సహాయముతో ఇలా ఉండడం సాధ్యమే అనే విషయాన్ని మనము గ్రహించాలి
నిజమైన ప్రేమలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే అది దయ చూపిస్తుంది
మన చుట్టు ఉన్నవారు మనము చేసే సహాయానికి
యోగ్యులు కాకపోయినా క్రియాశీలంగా వారికి సహాయం చేసే గుణాన్ని ఇది సూచిస్తుంది.
ఈ లక్షణం మనల్ని ప్రయోజనకరమైన సేవతో నిండిన జీవితాన్ని జీవించుటకు ప్రోత్సాహపరుస్తుంది. క్రీస్తు జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించిన మరొక గొప్ప లక్షణం ఇది.
ఆయనను వెంబడించే వారమైన మనము కుడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు
నిజమైన ప్రేమలో ఉండే మూడవ లక్షణం ఏంటంటే దానిలో మత్సరం ఉండదు
మత్సరం అనగా అసూయ అనగా ఇతరుల విజయాలు, పేరుప్రతిష్ఠలు, ఆస్తిపాస్తులను చూచి బాధపడటం నిరాశ చెందడం లాంటిది. ఇది ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం
ఇది భయంకరమైన పాపం కూడా
దేవునికి నచ్చని ఈ లక్షణం దేవున్ని ప్రేమించే ఆయనను వెంబడించే వారిలో కూడా ఉండడానికి వీలులేదు
మత్సరముతో చేసే అనర్థాల గురించి మత్సరము వల్ల కలిగే నష్టాల గురించి బైబిల్ లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది గనుక మన చుట్టు ఉన్న వారి పైన
ఎలాంటి మత్సరం లేకుండా ఎలాంటి ఈర్ష్య లేకుండా నిజమైన దేవుని ప్రేమ కలిగి ఈ లోకములో మనము జీవించవలసిన వారమై యున్నాము
నిజమైన ప్రేమలో ఉండే నాల్గవ లక్షణం ఏంటంటే అది డంబముగా ప్రవర్తింపదు;
డంబము అనగా అహంకారం
ప్రేమ ఇతరుల పొగడ్తలను ఎన్నడూ ఆశించదు. దానికి దురహంకారం ఉండదు. వినయంగా తగ్గి ఉంటుంది. దీన్ని క్రీస్తు జీవితంలో పరిపూర్ణంగా చూడవచ్చు. ఆయన విశ్వాసులమైన మనము కూడా ఈ విషయములో ఆయనను అనుసరించవలసిన వారమై యున్నాము
నిజమైన ప్రేమ తనను తాను త్యాగం చేసుకుంటుందే గాని హక్కుల కోసం ఎన్నడూ పోరాడదు
నిజమైన ప్రేమలో ఉండే ఐదవ లక్షణం ఏంటంటే అది ఉప్పొంగదు;
ఉప్పొంగడం అనగా అతిశయపడటం
ఉన్నదాని కంటే ఎక్కువగా చెప్పుకోవడం
గాల్లో మేడలు కంటి ఊహల్లో ఊయల ఊగడం లాంటిది
నిజమైన ప్రేమ ఎప్పుడు అణిగి మణిగి ఉంటుంది
ఆర్భాటాలకు అతిశయాలకు దూరంగా ఉంటుంది
ప్రతి చిన్న విషయానికి ఉప్పొంగుతూ అహంకారానికి
అవకాశమివ్వకుండా నిజమైన ప్రేమ కలిగి జీవిద్దాం
నిజమైన ప్రేమలో ఉండే ఆరవ లక్షణం ఏంటంటే అమర్యాదగా నడువదు
అమర్యాదగా అనగా సిగ్గుకరంగా అని కూడా అనువదించవచ్చు. ప్రేమ ఎవరికీ అవమానం, అమర్యాద కలిగే విధంగా ఎన్నడూ ప్రవర్తించదు. తనకు సిగ్గు కలిగే విధంగా కూడా ఎప్పుడూ ప్రవర్తించదు.
నిజమైన ప్రేమ కలిగిన వారు గౌరవ ప్రదంగా జీవిస్తారు
ఎదుటి వారి భావాలకు ఎంతగానో విలువనిస్తారు
వారి మాటలో వారి చేతల్లో వినయం విధేయత స్పష్టంగా కనిపిస్తాయి
నిజమైన ప్రేమలో ఉండే ఏడవ లక్షణం ఏంటంటే స్వప్రయోజనమును విచారించుకొనదు
ఈ లోకం దృష్టిలో విలువైన వాటిని, అనగా డబ్బు, ఆస్తులు, ప్రఖ్యాతి, పదవి, పొగడ్త, లేక అధికారం లాంటివాటిని ప్రేమ ఎప్పుడూ కోరుకోదు. దానికి పేరాశ లేదు. అది ఇతరుల మేలును మాత్రమే కోరుకుంటుంది క్రీస్తులో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన్ను అనుసరించేవారమైన మనలో కూడా ఇది కనిపించాలి
నిజమైన ప్రేమలో ఉండే ఎనిమిదవ లక్షణం ఏంటంటే త్వరగా కోపపడదు;
అనగా తొందరపడి తనకు అవమానం జరిగినట్టు ఇతరులపై కోపగించుకోదు. దానికి ముక్కోపం లేదు. అనగా పాపానికి వ్యతిరేకంగా కోపం ఉండడం ప్రేమకు విరుద్ధమని అర్థం కాదు దేవుడు మనుషుల చెడుతనంపై ఎప్పుడూ కోపం చూపుతూనే ఉంటాడు
నిజానికి దేవునికి కోపం వచ్చేది కుడా ఆయన ప్రేమ మూలంగానే, మానవాళి అంతటినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందువల్ల వారిని పాడు చేసే పాపమంటే ఆయనకు కోపమే. నీతి న్యాయాలనే ఆయన ఇష్టపడతాడు అందుకనే దానికి వ్యతిరేకమైన దానంతటినీ ఆయన ఉగ్రతతో చూస్తాడు.
గనుక చెడును అసహ్యించుకుంటు దేవుని ప్రేమ కలిగి ఈ లోకములో మనము జీవించవలసిన వారమై యున్నాము
నిజమైన ప్రేమలో ఉండే తొమ్మిదవ లక్షణం ఏంటంటే అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
ప్రేమ తప్పులను కప్పుతుంది, క్షమిస్తుంది. పగ సాధించేందుకు కుట్ర పన్నదు
సాధ్యమైతే వారికి ఎటువంటి అపకారం కలుగకుండా ఉండాలని కోరుకుంటుంది
ప్రేమించవలసిన రీతిగా ప్రేమించే క్రైస్తవులు ఇతరుల్ని తమకంటే యోగ్యులుగా ఎంచుతూ ఉంటారు.
ఎవరికీ తీర్పు తీర్చడం, నేరం మోపడం వారికి ఇష్టం ఉండదు
తమకివ్వ బడిన పనులను నమ్మకముగా చేస్తూ
ఎదుటి వారి శ్రేయస్సు కోసం ప్రయాసపడుతూ ఉంటారు
నిజమైన ప్రేమలో ఉండే పదవ లక్షణం ఏంటంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
ప్రేమ వెన్నెముక లేనిది కాదు. అది ఇటు అటు కొట్టుకుపోయేది కాదు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఊహాలోకాల్లో తేలియాడేది కాదు. భావోద్రేకాలకు లోనయ్యేది కాదు. దుష్టత్వంతో అది రాజీపడదు.
దుర్నీతి కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదు.
అనగా దుర్నీతి విషయమంతటిలో ప్రేమకు ఎప్పుడు విచారం ఉంటుంది. సత్యం గెలిచినప్పుడు అది బహుగా సంతోషిస్తుంది
ప్రేమ, సత్యం ఇవి రెండు ప్రాణ స్నేహితుల్లాంటివి . సత్యం ఎప్పుడు దుర్నీతికి వ్యతిరేకంగా ఉంటుంది దుర్నీతికి చీకటి, అబద్ధాలు, మోసం దేవుని సత్యాన్ని అణచివేయడంతో సంబంధం ఉంది
నిజమైన ప్రేమలో ఉండే పదకొండవ లక్షణం ఏంటంటే అన్ని టికి తాళుకొనును
ప్రేమ ఎప్పుడు సహిస్తుంది
ఇతరులను నొప్పించగల ఎలాంటి పనులైన వదులుకునేందుకు సిద్ధపడుతుంది
తాళుకొనును అనే ఈ పదానికి గ్రీకులో సంరక్షించును అనే మరో అర్థం కుడా వస్తుంది
తాళుకునేది కలిసి ఉండడానికి
కలిగి ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికి అనే విషయాన్నీ మనము గ్రహించాలి
నిజమైన ప్రేమ కలిగి అన్నిటికి తాళుకోవాలని
దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు
నిజమైన ప్రేమలో ఉండే పన్నెండవ లక్షణం ఏంటంటే అన్నిటిని నమ్మును
అన్నిటిని నమ్ముతుంది అంటే మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్నీ, కట్టు కథనూ నమ్ముతుందని కాదు. కపటంతో వ్యవహరించే వారిని ప్రేమ ఎప్పుడు నమ్మదు.. ప్రేమ సత్యం విషయంలోనే సంతోషిస్తుంది కాబట్టి సత్యాన్ని గుర్తించగలుగుతుంది అది తెలివిలేనిది కాదు. అమాయకమైనది కాదు, గుడ్డిది అసలే కాదు. అయితే ప్రేమకు ఇతరులను నమ్మే స్వభావం ఉంది అనుమానాలు పెట్టుకుని విరక్తిగా ఎప్పుడూ కీడును ఎంచే స్వభావం కాదు. ఇతరులు చెప్పినది నిజమో కాదో సందేహించే అవకాశం ఉంటే అది నిజమేనని నమ్మేందుకు ప్రేమ సిద్ధమే. చెప్పే వ్యక్తి అబద్ధికుడని అనవసరంగా అనుకోవడం దానికి ఇష్టం ఉండదు
నిజమైన ప్రేమలో ఉండే పదమూడవ లక్షణం ఏంటంటే అన్నిటిని నిరీక్షించును
అనగా ప్రతీదానిని నిరీక్షన భావంతో చూస్తుంది
ప్రేమ తేలికగా నిరుత్సాహపడదు. వైఫల్యం దాన్ని అణగదొక్కదు. నిరీక్షనకు ఆధారం లేనప్పుడు కూడా అది నిరీక్షణ కలిగి ఉంటుంది
దేవుని కృప దేవుని ప్రేమ ఏ వ్యక్తికైనా చేరగలదనీ ఎలాంటి పరిస్థితినైనా మార్చివెయ్యగలదనీ అది నమ్ముతుంది
నిజమైన ప్రేమ కలిగిన వారు అన్నిటిని నిరీక్షిస్తారనే విషయాన్ని మనము గ్రహించాలి
నిజమైన ప్రేమలో ఉండే పద్నాల్గవ లక్షణం ఏంటంటే అన్నిటిని ఓర్చును
ఓర్చును అనే ఈ గ్రీకు పదాన్ని సైనిక పదజాలంలో నుండి తీసుకున్నారు. అనగా శత్రు దాడులన్నిటినీ ఓర్చుకుని నిలవడమనీ దీనికి అర్థం దేవునిపట్ల, మనిషిపట్ల ఉన్న ఈ స్వార్థం లేని ప్రేమ
అన్ని కష్టాలనూ బాధలనూ హింసలనూ సైతాను, మనుషులు చేసే దాడులనూ ఎదుర్కొని ముందుకు సాగిపోతుంది. అది విశ్వాసులకు అత్యధిక విజయాన్ని ఇస్తుంది.కాబట్టి ఓర్చుకునే మనసును మనము కలిగి ఉండడం నేర్చుకొనవలసిన వారమై యున్నాము
నిజమైన ప్రేమలో ఉండే పదిహేనవ లక్షణం ఏంటంటే అది శాశ్వతకాలముండును.
దేవుని ప్రేమ అగాపే ప్రేమ అనగా షరతులు లేని ప్రేమ ఎన్నటికీ గతించని ప్రేమ
ఈ లోకములో మన కంటికి కనిపించే
మనకు ప్రయోజన కరంగా ఉండే ఎన్నో విషయాలు ఒక రోజు గతించిపోతాయి
కానీ ప్రేమ ఎన్నటికిని గతించదు
అది ఎప్పటికిని నిలిచి ఉంటుంది
మనము దేవుని ప్రేమ కలిగి జీవించాలని ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు
శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుని ప్రేమ కలిగి మన చుట్టు ఉన్నవారిని మనము ప్రేమించవలసినవారమై యున్నాము
నిజమైన ప్రేమలో ఉండే పదిహేను లక్షణాల గురించిన ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని ప్రేమ కలిగి మీ చుట్టు ఉన్నవారిని
ప్రేమించేలా మిమ్మల్ని ప్రోత్సహపరుస్తుందని
ఆశిస్తున్నాను
No comments:
Post a Comment