యెరూషలేము పట్టణంలో గొర్రెల ద్వారము దగ్గర ఒక పెద్ద కోనేరు వున్నది. హెబ్రీ బాషలో దాని పేరు బేతెస్ధ. దానిలో అయిదు మంటపాలువున్నవి. ఆ కోనేరుకు ఒక ప్రత్యేకత వుంది. ఆయా సమయాల్లో ఒక దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్ళు కదిలిస్తుంది. దేవదూత నీళ్ళు కదిలించిన తర్వాత మొదటగా ఎవరైతే నీళ్ళలో దిగుతారో వారికి వున్న రోగాలు నయమవుతాయి. వాళ్ళు పూర్తిగా ఆరోగ్య వంతులవుతారు. ఈ కారణం వలన ఆ కోనేటి
చుట్టూ రకరకాల రోగాలతో బాధపడుతున్న వందలకొలది రోగులు అవకాశం కోసం ఎదురుచూస్తూ వేచి వుంటారు. కొందరు కొన్ని సంవత్సరాల నుండి వేచి
వున్నారు. అక్కడ వున్న రోగులలో పైకి కనిపించని దీర్ఘరోగాలతో బాధపడుతున్నవారు, కుంటివారు, గుడ్డివారు, ఊచ చేతులు కాళ్ళు గలవారు,
పక్షవాయువు గలవారు యిలా ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారున్నారు. దేవదూత వచ్చి నీళ్ళు కదిలించగానే నీళ్ళలో దిగి, ఆరోగ్యవంతు
లుగా మారాలని నిరీక్షిస్తూ వున్నారు. అక్కడ ఉన్నవారిలో ముప్పది ఎనిమిది యేండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడు వున్నాడు. యేసు అతని రోగాన్ని అతని దీన పరిస్థితిని గ్రహించాడు. అతని పై ఎంతో జాలి పడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళి “నీవు
స్వస్థపడుగోరుచున్నావా?” అని అడిగాడు. అందుకు ఆ వ్యాధి గ్రస్థుడు "అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను నీళ్ళలో దించడానికి నాకు సహాయకుడు ఎవరూలేరు. కాబట్టి వేరొకడు ముందుగా దిగి ఆరోగ్యవంతుడై వెళ్లిపోతున్నాడు.
నేను మాత్రం ఆ సదవకాశాన్ని పొందలేక పోతున్నాను" అని దీనంగా చెప్పాడు.
అతడు చెప్పడం పూర్తికాగానే యేసు : “నీవు లేచి నీ పరు పెత్తుకొని నడువు" అని చెప్పాడు. వెంటనే అతడు లేచి తన పరు పెత్తుకొని నడిచాడు.
యేసు చేసిన ఈ అద్భుత కార్యం ఆ దీర్ఘరోగికి అధిక సంతోషాన్ని కలిగించింది. అక్కడవున్న రోగులందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే యూదులకు మాత్రం అసూయను కలిగించింది. వారు ఆ రోగి దగ్గరకి వచ్చి "ఈ రోజు విశ్రాంతి దినము కదా. నీవు నీ పరుపు ఎత్తడం ధర్మశాస్త్రానికి విరుద్ధమైనపని, నీవు తగని పని చేశావు" అన్నారు. అందుకు వాడు - 'అదంతా నాకేమి తెలియదు. నన్ను స్వస్థపరచినవాడు
నాతో నా పరు పెత్తుకొని నడువు" అన్నాడు. నేను ఆయన చెప్పినట్లు చేశాను. నాలోవున్న రోగం, శక్తిహీనత మాయమైపోయాయి. యిప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో వున్నాను" అన్నాడు. తనను బాగు పరచిన వాడు యేసు అని అతనికి తెలియదు.
తర్వాత దేవాలయములో యేసు అతన్ని చూశాడు "యిప్పుడు నీవు స్వస్థపడినావు. నీకు మరి ఎక్కువ కీడు కలుగ కుండా వుండునట్లు యికపై
పాపము చేయవద్దు. జాగ్రత్తగా వుండు” అని చెప్పాడు. అప్పుడు రోగి తనను స్వస్థపరచిన వాడు యేసు అని గ్రహించాడు. ఆ విషయం యూదులకు చెప్పాడు. యేసు విశ్రాంతి దినమున ఒక రోగిని బాగుచేశాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు అని యూదులు ఆయనను హింసించారు. అప్పుడు యేసు "నా తండ్రి (యెహోవా దేవుడు) యిదివరకు పని చేయుచున్నాడు. (దీనులను రోగులను కష్టాలలో వున్న వారిని ఆదరించుట) నేను కూడ ఆయన చేసిన పనులే చేస్తున్నాను” అని సమాధానం ఇచ్చాడు. అందుకు యూదులు ఇతడు విశ్రాంతి దినాచారము అతిక్రమించాడు. పైగా దేవుడు తన తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసికొన్నాడు. ఇతడు రెండు ఘోరమైన తప్పులు చేశాడు. కనుక యితడు మరణ శిక్షకు పాత్రుడు అని నిర్ణయించారు. ఆయనను ఎలాగైనా చంపాలని ఎక్కువగా ప్రయత్నం చేయసాగారు.
యేసు యూదులతో యిలా అన్నాడు. “తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. మృతులను లేపు అధికారం తండ్రికి వున్నది. అలాగే కుమారుడు
కూడ తన కిష్టము వచ్చిన వారిని బ్రతికించే అధికారం కలిగి వున్నాడు. తండ్రి తీర్పు తీర్చే అధికారం సహితము కుమారునికి అప్పగించి యున్నాడు.
కుమారుని ఘనపరచనివాడు, ఆయనను పంపిన తండ్రిని కూడ ఘనపరచడు. ఈ మర్మము మీరందరు తెలిసికొనవలసి వుంది.”
ధ్యానాంశములు:
1.మనము కూడ బేతెస్ధ కోనేరు వద్ద ఉన్న రోగి వంటివారమే. మన సమస్యల పరిష్కారానికి, రోగాలు బాగు కావడానికి మన స్వంత ప్రయత్నాలు
చేస్తుంటాము. యేసు అన్ని సమస్యలను తీరుస్తారని, రోగాలను నయం చేస్తాడని గ్రహించాలి. ఆయనపై సంపూర్ణ విశ్వాసం వుంచాలి. 38 సం||ల నుండి పడివున్న రోగిని ఒక్క మాటతో బాగుపరచడం ఒక మంచి ఉదాహరణ?
2.దేవునికి మన సమస్యలు. అవసరాలు బాగా తెలుసు. ఆయన దయగల ప్రభువు. ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు.
3.యేసు ధర్మశాస్త్రముకంటే గొప్పవాడు. అందుకే విశ్రాంతి దినములో మంచిపని చేయడం తప్పుకాదని చెప్పాడు. మంచి పనిని చేసి చూపించాడు.
బంగారు వాక్యము :
యెహోవా నాదేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలును, మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. కీర్తనలు 40:5
No comments:
Post a Comment