యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో జెకర్యా అను పేరుగల ఒక యాజకుడుండేవాడు. ఆయన భార్య పేరు ఎలీసబెతు, వాళ్ళిద్దరు ఏండ్లు మీరిన వృద్ధులు. వారికి సంతానము లేదు. వాళ్లు ప్రభువు ఆజ్ఞ ప్రకారం యాజక ధర్మం నెరవేరుస్తూ నిరపరాధులుగా,దేవుని దృష్టికి నీతి మంతులుగా
జీవితం గడుపుతున్నారు.
ఒక రోజు జెకర్యా యాజక ధర్మము ప్రకారం ఆలయంలో ధూపం వేస్తున్నాడు. ప్రజలంతా బయట ప్రార్ధన చేస్తున్నారు. అప్పుడు జెకర్యాకు గబ్రియేలను దేవదూత కనిపించి యిలా చెప్పాడు :
జెకర్యా ! భయపడకుము ! నీ ప్రార్ధన దేవునికి వినిపించింది. నీ భార్య ఎలీసబెతు ఒక కుమారుని
కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. అతడు మద్యము, క్షారసము ముట్టడు. తల్లి గర్భంలో
పుట్టినది మొదలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వుంటాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలలో అనేకులను దేవుని వైపు త్రిప్పుతాడు. అతడు ఏలియా యొక్క
ఆత్మయు, శక్తియు, గలవాడై వుంటాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈ శుభ వర్తమానము తెలుపడానికే నేను పంపబడ్డాను. నేను
చెప్పినవన్నీ తగిన కాలమందు నెరవేరతాయి" అని చెప్పాడు. దేవదూతను చూసిన జెకర్యా మొదట ఆశ్చర్యపోయాడు. అతని మాటలు వినిన తర్వాత కూడా నమ్మలేదు. కాబట్టి దేవదూత "నీవు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరుగు వరకు నీవు మూగవానివై వుంటావు" అని చెప్పి
వెళ్ళిపోయాడు. జెకర్యా మాటలాడలేకపోవడం చూసిన ప్రజలు ఆయనకు దర్శనం కలిగిందని గ్రహించారు.
గలిలయలోని నజరేతను ఊరిలో వున్న మరియ (యేసు తల్లి) పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఆమెయూదా ప్రదేశంలో వున్న ఎలీసబెతును చూడటానికి వెళ్ళింది. మరియ వందనములు తెలుపగానే ఎలీసబెతు గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేసింది. అప్పుడు ఎలీసబెతు పరమానంద భరితురాలై అన్నది -
స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు గర్భ ఫలము ఆశీర్వదింపబడును. నీ శుభ వచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రసవ దినములు సమీపించగానే ఎలీసబెతు మగబిడ్డను ప్రసవించింది. అందరూ ఆ బిడ్డకు జెకర్యా అని పేరు పెట్టాలనుకొన్నారు. కాని జెకర్యా పలకపై వ్రాసి చూపించిన విధంగా "యోహాను" అని పేరు పెట్టారు. వెంటనే జెకర్యాకు వున్న మూగతనం పోయింది. అతడు దేవుని స్తుతింపసాగాడు. ఈ సంగతులన్నీ తెలిసికొన్న యూదా ప్రాంతపు ప్రజలు భయపడ్డారు. ఈ బిడ్డ ఎలాంటివాడవుతాడో అని చెప్పుకోసాగారు. జెకర్యా తన కుమారుని గురించి యిలా ప్రవచించాడు. “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు."
యోహాను బాప్తిస్మములు యిచ్చుట :
యోహాను యేసుక్రీస్తుకంటే 6 నెలలు పెద్దవాడు. అతడు ముప్పది సం||ల వయస్సు వచ్చే వరకు అడవులలో సంచరిస్తూ వున్నాడు. అతనికి
బాప్తిస్మమిచ్చు యోహాను (నీళ్ళల్లో) ముంచే యోహాను అను పేర్లు వున్నవి. అతడు ఒంటె రోమముల వస్త్రమును, మొల చుట్టు తొలు దట్టి ధరించే
వాడు. మిడుతలు, అడవి తేనె అతని ఆహారము. ఆ సమయంలో యెరూషలేము యూదా, యోర్దాను నదీ ప్రాంతపు ప్రజలంతా అతని దగ్గరికి వచ్చి అతని
బోధలు విని, అతని చేత బాప్తిస్మము పొందుతున్నారు. యోహాను ప్రజలను వారి వారి పాపముల విషయమై హెచ్చరించేవాడు మారు మనస్సు విషయమై బాప్తిస్మము పొందమని ప్రకటించేవాడు. "సర్పసంతానమా! రాబోవు వుగ్రతను
తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వుంచబడి వున్నది. గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును" అని చెప్పేవాడు
యెరూషలేమునుండి యూదులు కొంతమంది యాజకులను లేవీయులను యోహాను దగ్గరికి పంపారు. వాళ్లు యోహానుతో "నీవు క్రీస్తువా
ఏలియావా, ప్రవక్తవా, మాకు వివరించ"మని అడిగారు. అందుకు జవాబుగా యోహాను తనను గురించి యిలా చెప్పాడు "నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కూడ కాను. నేను క్రీస్తుకంటె ముందుగా పంపబడిన వాడను
అని మీతో యింతకు పూర్వమే చెప్పియుంటిని. అందుకు మీరే సాక్షులు ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు నేను - ప్రభువు త్రోవ సరాళము చేయుడి
అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము" (యెషయా 40:3,4) అని
చెప్పాడు
యేసును గురించి యోహాను సాక్ష్యము :
యోహానును చూసి ఆయన బోధలు వింటున్న ప్రజలు “ఈయన క్రీస్తు అయివుండవచ్చును" అని తమలో తాము అనుకొంటున్నారు. అది గమించిన యోహాను "నేను మీకు నీళ్ళతో బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే
నా కంటె శక్తిమంతుడు ఒకడు రాబోతున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడ నేను యోగ్యుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నిలోను
బాప్తిస్మమిస్తాడు. ఆయన తీర్పు తీర్చు అధికారము కలిగివున్నాడు. రైతు చేటతో గోధుమలను, పొట్టును వేరు చేస్తాడు. గోధుమలు ధాన్యపు కొట్టులో
దాచి, పొట్టును కాల్చివేస్తాడు. అలాగే ఆయన నీతి మంతులను పరదైసుకు, పాపులను పాతాళానికి పంపుటకు శక్తి గలవాడు” అని చెప్పాడు.
యెహాను యేసుకు బాప్తిస్మము యిచ్చుట :
యేసుక్రీస్తు బాప్తిస్మము పొందడానికై యోహాను దగ్గరికి వచ్చాడు. అప్పుడు యోహాను - "యిదిగో, లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన నాకంటె ప్రముఖుడు, కనుక నా కంటె ముందటి
వాడయ్యాడు” అన్నాడు. యోహాను లోక రక్షకుడైన యేసుకు బాప్తిస్మం యివ్వడానికి సందేహించాడు. అయితే యేసు గట్టిగా కోరిన తర్వాత ఆయనకు
యోర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. యేసు నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడింది. పరిశుద్ధాత్మ పావురము
వలె దిగి వచ్చింది. “ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అని ఒక శబ్దము ఆకాశము నుండి వినిపించింది. యోహానుకు దేవుని ద్వారా ముందుగానే తెలియజేయబడిన సంగతులు నెరవేరాయి. అతడు యేసు నిజంగానే దేవుని కుమారుడని తెలిసికొన్నాడు.
యోహాను చెరసాలలో వేయబడుట : మరణము :
యోహాను జీవించిన కాలంలో హేరోదు చతుర్ధాధిపతిగా వున్నాడు. అతడు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను పెండ్లి చేసికొన్నాడు. యోహాను ఈ పని మంచిది కాదని హేరోదును గద్దించాడు. తమ్ముని భార్యను సంతోషపరచడానికి హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు. ప్రజలంతా యోహాను ఒక ప్రవక్త అనుకొంటున్నారు. కనుక వారికి భయపడి యోహానును చంపలేదు. అయితే హేరోదు జన్మదినం రోజు హేరోదియ కుమార్తె బాగా నాట్యం చేసి హేరోదును సంతోషపెట్టింది. ఆమె ఏమి కోరినా యిస్తానని హేరోదు ప్రమాణం చేశాడు. తల్లి మాట విని ఆమె యోహాను తల కావాలని కోరింది. హేరోదు మనసులో ఎంతో దు:ఖపడ్డాడు. కాని చేసిన ప్రమాణానికి బద్ధుడై యోహాను తల నరికించాడు. సేవకులు యోహాను తలను నరికి ఒక పళ్లెంలో పెట్టి తెచ్చారు. వారు తెచ్చిన తలను ఆ అమ్మాయి తన తల్లికి యిచ్చింది. యోహాను శిష్యులు వచ్చి ఆయన శవాన్ని తీసికొని వెళ్ళి పాతిపెట్టారు.
"స్త్రీలు కన్న వారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు" - అని యేసు క్రీస్తు చెప్పాడు.
యోహాను యేసుకు ముందుగా పంపబడిన దూత. ప్రభువు మార్గమును సిద్ధపరచిన వాడు అని దేవుని వాక్యములో వ్రాయబడింది.
ధ్యానాంశములు :
1.యోహాను యేసుకంటె ఆరు నెలలు ముందు జన్మించాడు. అతడు యేసును గురించి ప్రచారం చేశాడు. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చాటి చెప్పాడు. తనను తాను తగ్గించుకొన్నాడు.
2. యేసుకు బాప్తిస్మం యివ్వడం యోహాను జీవితంలోని ప్రత్యేకత.
3.యేసు దేవుని కుమారుడని, లోక పాపములు మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని తెలిసికొన్నాడు.
4. ప్రజలకు మంచి సంగతులు బోధించాడు. (లూకా 3:10 నుండి 14)
5.యోహాను హేరోదుకు భయపడలేదు. నీవు అన్యాయం చేశావు అని హెచ్చరించాడు.
బంగారు వాక్యము :
ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి 3:17.
No comments:
Post a Comment