Breaking

Tuesday, 2 June 2020

Bible story samson | bible stories in telugu | సమ్సోను

మహా బలశాలి సమ్సోను 

ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుణ్ణి, ఆయన వారికి చేసిన మేళ్లను మరచారు. అన్యుల దేవతలను పూజింపసాగారు. అక్రమజీవితం గడపసాగారు.
అందువలన యెహోవాకు కోపం తెప్పించారు. యెహోవా వారిని 40 సం॥ల పాటు వారి శతృవులైన  ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ సమయంలో
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడి వారి తరపున యుద్ధం చేయడానికి మహా బలశాలి, పరాక్రమశాలి అయిన సమ్సోనును బలపరచాడు.

జొర్యా పట్టణంలో మనోహ అనే మనుష్యుడు ఉండే వాడు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒక రోజు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఈ
విధంగా చెప్పాడు. “నీవు త్వరలో ఒక కుమారుని కంటావు. నీవు ద్రాక్షారసముగాని, మద్యముగాని సేవించరాదు. అపవిత్రమైన పదార్ధములు
తినకూడదు. పుట్టినది మొదలుకొని నీ కుమారుని తలమీద మంగలి కత్తి పెట్టకూడదు. అతడు ఇశ్రాయేలు ప్రజలను  ఫిలిష్తీయుల బానిసత్వం నుండి
కాపాడుతాడు” ఆ స్త్రీ దేవదూత తనతో చెప్పిన మాటలను భర్తతో చెప్పింది. భర్త ఆమె మాటలు నమ్మలేదు. యెహోవా దేవుని ప్రార్ధించాడు. కొన్ని దినాలు గడిచాయి. దేవుని దూత పొలంలో మనోహకు కనిపించి పుట్టబోయే కుమారుణ్ణి ఎలా పెంచాలో వివరించాడు. అప్పుడు మనోహ సంతోషంతో దేవునికి దహనబలి అర్పించాడు. కొంత కాలం తర్వాత మనోహ భార్య ఒక కుమారుని ప్రసవించింది.
అతనికి “సమ్సోను" అని పేరు పెట్టింది.


సమ్సోను వివాహము : పొడుపు కథ :

సమ్సోను పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు తిమ్నాతులో ఒక ఫిలిస్తి యువతిని ప్రేమించాడు. ఆమెను పెండ్లి చేసికోవాలని పట్టుపట్టాడు.
తల్లిదండ్రులు యిష్టపడలేదు. సమ్సోను తిమ్నాతుకు వెళ్తున్నాడు. మార్గంలో ఒక కొదమ సింహము అతని మీదికి వచ్చింది. సమ్మోను చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. సమ్పోనును దేవుడు బలపరచాడు. అతడు ఆ సింహాన్ని సునాయాసంగా చీల్చి చంపాడు. తాను సింహాన్ని చంపిన విషయం అతడు ఎవరికీ చెప్పలేదు. కొంతకాలమైన తరువాత సమ్సోను అదే దారిన నడిచి వెళ్తున్నాడు. తాను చంపిన సింహపు కళేబరములో తేనెపట్టు వుండడం చూశాడు అతడు ఆ తేనెను తిని, యింటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు కూడ కొంత యిచ్చాడు
సమ్సోను తిమ్నాతులోని  ఫిలిష్తీయ యువతిని పెండ్లి చేసికొన్నాడు ఫిలిష్తీయుల ఆచారం ప్రకారము పెండ్లి కుమారుడు ముప్పది మంది స్నేహితులకు విందు చేయాలి. విందు జరుగు సమయంలో సమ్సోను
ముప్పదిమందిని ఒక పొడుపుకథ అడిగాడు. దాని అర్ధం వివరించమని కోరాడు

బలమైన దానిలోనుండి తీపి వచ్చెను
తిను దానిలో నుండి తిండి వచ్చెను"

ఫిలిష్తీయులు ఎంత ఆలోచించినా, పొడుపు కథకు సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళు సమ్సోను భార్య దగ్గరికి వెళ్ళారు. ఎలాగైనా నీ భర్తను అడిగి ఈ పొడుపు కథకు జవాబు తెలిసికొమ్మని బ్రతిమిలాడారు
సమ్సోను ఆమెకు సమాధానం చెప్పలేదు. అప్పుడు ఫిలిష్తీయులు "ఈ రహస్యం తెలిసికొనకుంటే నిన్ను, నీ తండ్రి యింటివారిని కాల్చి వేస్తాము" అని సమ్సోను
భార్యను బెదరించారు. కాబట్టి సమ్సోను భార్య ప్రతిరోజు ఏడుస్తూ, పొడుపు కథకు సమాధానం చెప్పమని బ్రతిమిలాడసాగింది.

చివరకు సమ్సోను విసుగెత్తి జవాబు చెప్పాడు. ఏడవ దినము అందరు కూడి వచ్చి “తేనె కంటే తీయని వస్తువేది? సింహము కంటే బలమైనది ఏది?"
అని చెప్పారు. అందుకు సమ్సోను "నా దూడతో దున్నకపోతే నా పొడుపుకథకు సమాధానం చెప్పగలిగేవారు కాదు" అన్నాడు.

యెహోవా ఆత్మ సమ్సోనును ప్రేరేపింపగా అతడు ముప్పది మందిని చంపి, వారి సొమ్మును దోచుకొని,
పొడుపు కథకు భావం చెప్పినవారికి యిచ్చాడు. తర్వాత కోపంతో తన యింటికి వెళ్ళిపోయాడు. అందువలన సమ్సోను తన భార్యను విడిచి వెళ్ళాడని తలంచిన ఆమె తల్లిదండ్రులు, ఆమెను సమ్సోను స్నేహితునికి యిచ్చి పెండ్లి చేశారు.


సమ్సోను ప్రతీకారము : శత్రువులను చంపుట :

కొంత కాలమైన తర్వాత సమ్సోను తన భార్య దగ్గరికి వచ్చాడు. ఆమెను తన స్నేహితునికి యిచ్చి పెండ్లి చేశారని తెలిసికొని చాల కోపపడ్డాడు. వెళ్లి 300 నక్కలను పట్టుకొని జతలుగా వాటి తోకలు కట్టాడు. తోకలకు దివిటీలు కట్టి వదిలాడు. అవి వెళ్ళి ఫిలిష్తీయుల గోధుమ పొలాలను, పనల కుప్పలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగుల బెట్టాయి. ఈ నష్టం అంతటికి సమ్సోను కారకుడని తెలిసికొన్న ఫిలిప్తీయులు అతని భార్యను, మామను చంపివేశారు. ఈ సంగతి తెలిసిన సమ్సోనుయింకా చాలా మందిని
తుంట్లు విరుగగొట్టి చంపివేశాడు. సమ్సోను వెళ్ళి ఏతాము బండ సందులో వుంటున్నాడు. అతనిని
పట్టుకోవాలని ఫిలిపీయులు పెద్ద సైన్యంతో బయలుదేరారు. అప్పుడు యూదా ప్రజలు సమ్సోను దగ్గరికి వెళ్ళారు. అతన్ని బ్రతిమిలాడి, తాళ్లతో, సంకెళ్ళతో కట్టి తెచ్చి ఫిలిష్తీయులకు అప్పగించారు. సమ్సోను యెహోవా ఆత్మచేత బలపరచబడి ఆ తాళ్ళను, సంకెళ్ళను లైంపివేశాడు. అక్కడ పడివున్న ఒక గాడిద దవడ యెముకను తీసికొని దానితో వెయ్యిమందిని చంపాడు. -
సమ్సోను గాజా పట్టణంలో ఒక వేశ్య యింటిలో వుంటున్నాడు. ఈ సంగతి తెలిసిన గాజా ప్రజలు అతన్ని చంపాలని పొంచి వున్నారు. అయితే సమ్సోను మధ్యరాత్రి వేళ లేచి, పట్టణపు తలుపులను, వాటి ద్వార బంధములతో సహా ఊడ పెరికి తన భుజాలపై పెట్టుకొని పారిపోయాడు. శతృవులు సమ్సోనును పట్టుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయి.


సమ్సోను మరియు దెలీలా :

సమ్సోను దెలీలా అను స్త్రీని ప్రేమించాడు. ఆమె యింట్లో ఎక్కువ సమయం వుండేవాడు. ఈ సంగతి తెలిసికొన్న ఫిలిష్తీయుల సర్దారులు దెలీలా దగ్గరికి వచ్చి - "సమ్సోను బలము దేనిలో వున్నదో తెలిసికొని చెప్పు. నీకు ప్రతి ఒక్కరమూ వెయ్యిన్ని నూరు వెండి నాణెములు యిస్తాము. మేము సమ్సోనును బంధించి అతని గర్వాన్ని అణచాలి" అన్నారు.
దెలీలా సమ్సోను పట్ల అధిక ప్రేమ చూపసాగింది. అతడు సంతోషంగా వున్నప్పుడు "నీ బలము యొక్క రహస్యం ఏమిటో చెప్పు” అని అడిగింది. అందుకు సమ్సోను "ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించవచ్చు" అన్నాడు. సమ్సోను నిద్రపోతున్న ప్పుడు దెలీలా అతన్ని నిరవంజి చువ్వలతో బంధించింది. ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పింది. సమ్సోను ఆ నిరవంజి చువ్వలను నూలు దారాల వలె అతి సులభంగా తెంచి వేశాడు. రెండవసారి కొత్త తాళ్ళతో బంధించమని చెప్పాడు. వాటిని కూడ సులభంగా తెంచి వేశాడు. మూడవ
సారి నా వెంట్రుకలను జడలుగా చేస్తే నేను బంధీనైపోతాను అన్నాడు. దెలీలా సమ్సోను వెంట్రుకలను ఏడు జడలుగా అల్లి వాటిని మేకులతో దిగగొట్టింది. ఈ పర్యాయము సమ్సోను మేకులతో సహా ఊడదీసికొని పోయాడు. అప్పుడు దెలీలా “నీకు నా మీద ప్రేమలేదు. కాని నన్ను ప్రేమిస్తున్నానని అబద్దం చెబుతున్నావు. నన్ను మూడుసార్లు ఎగతాళి చేశావు. యిప్పుడైనా నీ బలం దేనిలో వుందో చెప్పు” అని బ్రతిమిలాడింది. సమ్సోను విసుగు చెంది చచ్చిపోతే మంచిది అనుకొన్నాడు. ఈసారి అతడు ఈ విధంగా నిజం చెప్పాడు "నేను పుట్టినప్పటినుండి దేవునికి నాజీరు చేయబడినవాడిని. నా తల మీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షవరం చేసినట్లయితే నా బలమంతా పోతుంది.” దెలీలా ఈ నిజాన్ని తెలిసికొని వెంటనే ఫిలిష్తీయుల సర్దార్లను పిలిపించింది. వారు డబ్బు తీసికొని వచ్చారు. ఆ రాత్రి దెలీలా సమ్సోనును
తన తొడపై నిద్రపుచ్చి ఒక మనుష్యుని చేత పూర్తిగా క్షవరం చేయించింది. ఆ తరువాత " ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు. త్వరగా లేచి పారిపో" అని చెప్పింది. సమ్సోను యింతకు ముందు వలెనె లేచి బంధాలు తెంచుకోవాలనుకొన్నాడు. కాని యెహోవా తనను ఎడబాసినాడని గ్రహించలేదు.
ఫిలిష్తీయులు సమ్సోనును బంధించి, అతని కన్నులు తీసి వేశారు. ఇత్తడి సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు.

సమ్సోను జీవితంలో చివరి రోజులు : మరణము :

సమ్సోను తమకు బంగీగా దొరికినందుకు ఫిలిష్తీయుల సర్దారులు చాలా సంతోషించారు. తమ దేవత అయిన దాగోను గుడిలో కొన్ని వేలమంది అధికారులు, పురుషులు, స్త్రీలు సమావేశమయ్యారు. ఈ సంతోష సమయంలో ఖైదీగా వున్న సమ్సోనును గుడిలోనికి తెచ్చారు. రెండు స్తంభాల మధ్య కట్టి వేశారు. సమ్సోను భటులను అడిగి ఆ గుడికి ఆధారంగా వున్న రెండు స్తంభాలను అనుకొని నిలబడ్డాడు. ప్రజలందరు సంతోషంతో కేకలు వేస్తూ, సమ్సోనును ఎగతాళి చేస్తూ వున్నారు. అప్పుడు సమ్సోను చివరి సారిగా తనకు బలాన్ని యివ్వమని యెహోవా దేవుణ్ణి ప్రార్థించాడు. ఈ ఒక్కసారి ఫిలిప్తీయులను
శిక్షించి పగ తీర్చుకొమ్మని వేడుకొన్నాడు.

సమ్సోను గుడికి మూలాధారంగా వున్న రెండు స్తంభాలను రెండు చేతులతో పట్టుకొని బలముతో వంగి “నేనును, ఫిలిష్తీయులను చనిపోదుముగాక” అన్నాడు. అతడు రెండు స్తంభములను పట్టుకొని
వంగినప్పుడు, గుడి సర్దారుల మీద, జనులందరి మీద పడింది. అప్పుడు అతడు చంపిన వారి లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారికంటె ఎక్కువ.
సమ్సోను దేవుడు ఏర్పరచుకొనిన న్యాయాధిపతి.

ధ్యానాంశములు:

1.సమ్సోను మహా బలశాలి. మహావీరుడు. దేవునికి "నజీరు” చేయబడినవాడు. అతడు తన జీవితంలో ఎప్పుడూ శతృవుల చేతిలో ఓడిపోలేదు. తన మరణ రహస్యము దెలీలాకు చెప్పినందువలన బంధింపబడినాడు.

2. సమ్సోను ఫిలిష్తీయుల (శతృవుల) యువతులను పెండ్లి చేసికొన్నాడు. కనుక కష్టాల పాలయ్యాడు.

3.మనము కూడ దేవుని ఆజ్ఞలను పాటించాలి. లేనిచో కష్టాలలో చిక్కుకుంటాము


బంగారు వాక్యము :

యెహోవా ప్రభువా! దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము.

న్యాయాధి 16:28




No comments:

Post a Comment