Breaking

Wednesday, 27 May 2020

Bible story of lot | telugu bible stories | లోతు

లోతు :
తెరహు కుమారులు అబ్రాము, నాహోరు, హారాను. హారాను కుమారుడు లోతు. అబ్రాము తాను పుట్టి పెరిగిన హారాను దేశం విడిచి పెట్టి యెహోవా దేవుని ఆదేశం ప్రకారం కనాను దేశం వచ్చాడు. అతని వెంట అతని తమ్ముని కుమారుడైన లోతు కూడ వున్నాడు. అప్పుడు అబ్రాము వయస్సు డెబ్బది అయిదేండ్లు. (దేవుడు తర్వాత అబ్రాము పేరును అబ్రహాముగా
మార్చాడు.. కనాను దేశంలో అబ్రహాము, లోతు బహుగా ఆశీర్వదింపబడ్డారు. వారి పంటలు, పశువులు, సంపద బాగా అభివృద్ధి చెందాయి.
ఒక పర్యాయం అబ్రహాము పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులు బాగా తగవులాడుకొన్నారు. అప్పుడు అబ్రహాము సలహా ప్రకారం లోతు, అబ్రహాము దూరదూర ప్రదేశాలలో నివసించడం మంచిదని నిర్ణయించుకొన్నారు. లోతు తూర్పుదిక్కున వున్న యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకొన్నాడు. ఆ ప్రాంతం చాలా సుందరమైన, సంపన్నమైన ప్రాంతం. అది దేవుని తోట అయిన ఏదెను వలె, ఐగుప్తు దేశం వలె నీళ్ళు పారే దేశమై పాడి పంటలతో తుల తూగుతూ వుంది. ఆ ప్రాంతంలోనే సొదొమ గొమొర్రా పట్టణాలు వున్నాయి. లోతు సొదొమ పట్టణంలో నివాసం ఏర్పరచుకొన్నాడు. సొదొమ మనుష్యులు చాల చెడ్డ వారు. వారు యెహోవా దృష్టిలో బహు పాపాత్ములై వుండిరి. ఒకసారి శతృరాజులు సొదొమ రాజును, ఓడించి, లోతు ఆస్తిని దోచుకొని వెళ్ళారు. ఈ సంగతి తెలిసిన అబ్రహాము 318 మంది సేవకులతో వెళ్ళి, శతృవులను ఓడించి, సొదొమ రాజును విడిపించాడు. లోతు ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కు తీసికొని వచ్చాడు. ఒకరోజు మధ్యాహ్నం ముగ్గురు మనుష్యులు (దేవదూతలు)
అబ్రాహాము యింటికి వచ్చారు. వారు సొదొమ గొమొర్రా ప్రజల దుర్మార్గం ప్రబలిపోయిందని చెప్పారు. యెహోవా ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నాడని చెప్పారు. ఆ దూతలలో యిద్దరు సోదాను పట్టణానికి వెళ్లారు. లోతు వారిని సాదరంగా తన యింటికి పిలుచుకొని వెళ్లాడు. లోతు యింటికి కొత్త మనుష్యులు వచ్చారని తెలిసికొన్న సొదొమ ప్రజలు అతని యింటిమీదికి గుంపుగా వచ్చారు. "ఆ యిద్దరు మనుషులను బయటికి పంపించు. వారిని
మేము అనుభవించాలి" అని గొడవ చేయసాగారు. లోతు బయటికి వచ్చి, అతిధుల పట్ల మర్యాదగా వుండమని బ్రతిమిలాడారు. కాని వాళ్లు పెడచెవిని
పెట్టారు. లోతుపై కోపపడ్డారు. “వారికంటె నీకే ఎక్కువ అపకారం చేస్తాము." అన్నారు. పరిస్థితిని అర్థం చేసికొన్న దేవదూతలు లోతును యింట్లోకి లాగి
తలుపు మూశారు. వారు సొదొమ మనుష్యులకు కనుమబ్బు కలిగించారు. అందువల్ల వాళ్లు రాత్రంతా వెదకినా యింటి ద్వారం కనుక్కోలేకపోయారు.
సొదొమ గొమొర్రా పట్టణాల పై దేవుడు చాల కోపంగా వున్నాడనీ, ఆ రెండు పట్టణాలను అగ్ని గంథకముల చేత కాల్చబోతున్నాడనీ దేవదూతలు లోతుకు చెప్పారు. లోతు కుటుంబాన్ని పట్టణం వదలి పారిపొమ్మని తొందరపెట్టారు. మధ్యలో ఎక్కడా ఆగవద్దనీ, వెనుకకు తిరిగి చూడవద్దని హెచ్చ
రించారు. లోతుకు కాబోయే అల్లుళ్ళు లోతుమాట లెక్కచేయలేదు. కనుక లోతు తన భార్య, మరియు యిద్దరు కుమార్తెలతో తెల్లవారు ఝామునే పట్టణం వదిలివెళ్లాడు. వాళ్ళు సోయరు అను ఊరివైపు వడివడిగా నడుస్తున్నారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు. దేవుడు ఆకాశం నుండి అగ్నిని,
గంధకమును కురిపించాడు.సొదొమ గొమొర్రా పట్టణాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రజలందరు చనిపోయారు. పంటలు కాలిపోయాయి. లోతు
కుటుంబ సభ్యులు త్వరత్వరగా వెళ్లి పోతున్నారు. అయితే లోతు భార్య వెనక్కు తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పుస్థంభంగా మారిపోయింది. సొదొమ,
గొమొర్రా పట్టణాలు కాలిపోయినందున లేచిన పొగ, మంటలు ఆకాశాన్ని కమ్ముకొన్నాయి. తెల్లవారిన తర్వాత ఆ బ్రాహాము తాను వుంటున్న చోటునుండి
ఆ పొగను, మంటలను చూశాడు. సొదొమ, గొమొర్రా పట్టణాలు కాలిపోయాయని గ్రహించాడు. లోతు కుటుంబాన్ని గురించి చింతించాడు.
ధ్యానాంశములు :
1.లోతు పైకి అందంగా, బాగా కనిపిస్తున్న ప్రదేశాన్ని ఎన్నుకొన్నాడు. మనం కూడ పైకి బాగా కనిపించే వస్తువులను, మనుషులను ఎన్నుకొంటాము.
దేవుని చిత్తాన్ని గ్రహించాలి.
2.దేవుడు చాలా దయగలవాడు. ఆయన లోతు కుటుంబాన్ని రక్షించాడు.
3.లోతు భార్య దేవదూతల ఆజ్ఞను మీరింది. వెనక్కు తిరిగి చూసి, ఉప్పుస్థంభంగా మారిపోయింది. విశ్వాసులు దేవుని వైపు చూస్తూ, ముందుకు
సాగిపోవాలి. లోకం వైపు చూస్తే లోతు భార్యవలె అయిపోతారు.
4.లోతు స్వంత యిష్ట ప్రకారం జీవించాడు. కనుక కష్టాల పాలయ్యాడు. అబ్రాహాము దేవుని చిత్త ప్రకారం జీవించాడు. కనుక బహుగా ఆశీర్వదింపబడ్డాడు.
5.సొదొమ, గొమొర్రా పట్టణాలు ఈ లోకానికి సూచనగా వున్నాయి.
బంగారు వాక్యము:
యెహోవాయందు భయభక్తులు గలవాడెవ్వడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
కీర్తనలు 25:12

No comments:

Post a Comment