Breaking

Monday, 6 January 2020

Bible story of ruth | bible stories in telugu | రూతు




యూదా దేశంలో బెల్లెహేము అనే గ్రామం వుంది. ఆ ఊరిలో ఎలీమెలెకు అనే పేరుగల మనుష్యుడు తన భార్యతో ఉంటున్నాడు. వారికి యిద్దరు కుమారులున్నారు. వారి పేర్లు మహ్లాను, కిల్యోను. యూదా దేశంలో గొప్ప కరవు వ్యాపించింది. ప్రజలు తిండిలేక, పంటలు పండక చాల కష్టపడసాగారు. అందువల్ల ఎలీమెలెకు తన భార్యను, యిద్దరు కుమారులను తీసికొని మోయాబు దేశానికి వెళ్లాడు. బెల్లెహేము అను మాటకు రొట్టెల యిల్లు అని అర్ధం వుంది. ఎలీమెలెకు తాత్కాలికంగా వచ్చిన కష్టాలకు భయపడి, దీవెన కరమైన గ్రామాన్ని విడిచి, విగ్రహారాధనకు, అక్రమాలకు స్థావరమైన మోయాబుదేశానికి వెళ్ళాడు. అక్కడ తన కుమారులకు రూతు, ఓర్చా అనే మోయాబు యువతులను పెండ్లి చేశాడు. అక్కడ పది సం||లు గడిచిపోయాయి. ఎలీమెలెకు, అతని యిద్దరు కుమారులు చనిపోయారు. నయోమి, ఆమె యిద్దరు కోడళ్లు మిగిలిపోయారు. నయోమిపై విధవలుగా వున్న యిద్దరు కోడళ్ల భారం పడింది... కాలం మారింది. వర్షాలు కురిశాయి. యూదా దేశంలో పంటలు పండాయని, దేవుడు ఆ దేశాన్ని కరుణించాడని నయోమి విన్నది. ఆమె తన యిద్దరు కోడళ్ళను తీసికొని బెల్లెహేముకు ప్రయాణమైంది. మార్గంలో ఆమె కోడళ్లతో - మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్లండి అని బ్రతిమిలాడింది. ఎవరైనా మోయాబు దేశంలోని యువకులను పెండ్లాడి, సుఖపడమని చెప్పింది. ఓర్సాకు ఆమె సలహా నచ్చింది. ఆమె అత్తను ముద్దు పెట్టుకొని, ఆమె వద్ద సెలవు తీసికొని వెనక్కు వెళ్ళిపోయింది. కాని రూతు మాత్రం వెళ్ళలేదు. ఆమె నయోమితో యిలా అన్నది. "నీవు వెళ్ళిన చోటికే నేను కూడ వస్తాను. నీవు వున్న చోటనే నేను కూడ వుంటాను. నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనము. నీవు మరణించిన చోటనే నేను కూడ మరణిస్తాను" నయోమి రూతు మాటలకు సంతోషించింది. ఆమె యిష్టాన్ని మన్నించింది. ఆమెను తన వెంట పెట్టుకొని బెల్లె హేము గ్రామానికి చేరింది.

బోయజు పొలంలో రూతు :
యూదా దేశంలో పంటలు బాగా పండాయి. యవల కోత ప్రారంభం అయింది. అత్త సలహా పాటించి రూతు, సమీప బంధువైన బోయజు పొలంలో
పరిగి ఏరుకొనడానికి వెళ్ళింది. బోయజు చాల ధనవంతుడు, దయగలవాడు, ఉత్తమ గుణసంపన్నుడు. అతడు రూతును గురించిన విషయాలు తెలిసికొన్నాడు. ఆమె పరిస్థితికి జాలిపడ్డాడు. ఆమెను ప్రతిరోజు, తన పొలంలోనే పరిగె ఏరుకోమన్నాడు. తన కూలీల వెంబడే వుండమని చెప్పాడు. వాళ్ళతో పాటే తిని, వాళ్లు త్రాగే కుండల్లో నీళ్లు త్రాగమన్నాడు. సాయంత్రం రూతు బోయజు పొలం నుండి యింటికి వచ్చింది. ఆమె తన అత్త నయోమితో జరిగిన సంగతులన్నీ వివరించింది. ఆమె రూతు చెప్పినదంతా విన్నది. బోయజు తమకు దగ్గరి బంధువనీ, రోజూ అతని పొలంలోనే పరిగే ఏరుకోవడం మంచిదనీ చెప్పింది. బోయజు మంచి వాడనీ, దయగలవాడనీ, బంధు ప్రేమ గలవాడనీ, రూతును తప్పక ఆదరిస్తాడని అర్థం చేసికొంది. యవల కోతలు పూర్తయ్యాయి. “నీవు రాత్రి సమయంలో వెళ్ళి కళ్లం దగ్గర పండుకొన్న బోయజు కాళ్ల దగ్గర పండుకొమ్మని" నయోమి రూతుకు
సలహా యిచ్చింది. రూతు అత్త చెప్పిన విధంగా చేసింది. బోయజు రూతు వినయాన్ని, మంచి గుణాలను గ్రహించాడు. బోయజు రూతుతోయిలా అన్నాడు - "కుమారీ! నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె, యిప్పటి సత్ప్ర వర్తన మెచ్చుకొనదగినది. నీవేమీ భయపడవద్దు. నేను నిన్ను ఆదరిస్తాను. నీకు అండగా వుంటాను. నీవు చాల యోగ్యురాలవి, అనే సంగతి నా బంధువులకు, నా గ్రామ ప్రజలందరికి బాగా తెలియును. నేను నీకు బంధు ధర్మము జరిగిస్తాను. నీ ఆస్తిని, నిన్ను విడిపిస్తాను. అయితే నీకు దగ్గరి బంధువైన వాడు, నిన్ను విడిపించ తగినవాడు
ఒకడున్నాడు. అతడు తన బంధు ధర్మము జరిగించకుంటే నేను తప్పక నిన్ను విడిపిస్తాను. ఆస్తిని నీకు యిప్పిస్తాను, నిన్ను నా దానినిగా చేసికొంటాను".
తెల్లవారక ముందే బోయజు రూతును ఆమె యింటికి పంపించాడు. ఆమెకు 'ఆరు కొలలు (ఆరు మానికలు) యవలు యిచ్చి పంపించాడు. రూతు రాత్రి జరిగిన విషయమంతా నయోమికి చెప్పింది. అంతా విని నయోమి చాలా సంతోషించింది. రేపు బోయజు నీకు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు నిశ్చింతగా వుండు. అని ధైర్యం చెప్పింది. -

బోయజు రూతును వివాహము చేసికొనుట : -
మరుసటి రోజు బోయజు బెల్లె హేము పురద్వారం వద్దకు వెళ్ళాడు. పదిమంది పెద్దలను పిలిపించి, అక్కడ కూర్చండబెట్టాడు. ఆ దారిన వెళుతున్న
నయోమి బందువును పిలిచాడు, నయోమి అమ్మదలచుకొన్న భూమిని గురించి, ఆమె కోడలైన రూతును గురించి వివరించాడు. బంధు ధర్మము జరిగించి వాళ్లకు మేలు చేయమని కోరాడు. అంతా విన్న బంధువు, తాను నయోమి పొలం తీసుకోవడానికి సిద్ధమేననీ, ఆమె కోడలు రూతును మాత్రం పెండ్లి చేసుకోననీ కచ్చితంగా చెప్పాడు. ఆమెను పెండ్లి చేసికొంటే నా స్వాస్థ్యం పోగొట్టుకుంటాను కదా అన్నాడు. అందువల్ల బోయజు ఎలీమెలెకు, అతని కుమారుల ఆస్తిని విడిపించి, కూతును తన భార్యగా స్వీకరించాడు. తాను
చెప్పిన మాట నెరవేర్చారు.

ఆశీర్వదింపబడిన రూతు :
బెల్లెహేము పుర ద్వారము దగ్గర చేరిన పెద్దలు, ప్రజలు బోయజును దీవించారు. అతని ఉదారబుద్దిని మెచ్చుకొన్నారు. నీ ఇంటికి వచ్చిన మోయాబీయురాలైన రూతు బహుగా ఆశీర్వదించబడుగాక, అని దీవించారు. కొంత కాలం గడిచిపోయింది. రూతుకు ఒక కుమారుడు కలిగాడు. స్త్రీలందరు నయోమిని పొగిడారు. నీ కోడలు రూతు ఏడుగురు కుమారుల కంటెమిన్న అన్నారు. ఆమె కుమారుడు నీకు వృద్ధాప్యంలో తోడుగా వుంటాడని
దీవించారు.యిరుగుపొరుగు స్త్రీలు ఆ బాలునికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు కుమారుడు
యెష్షయి. యెష్షయి కుమారుడే మహావీరుడు, పరమ
భక్తుడు, అమర గాయకుడైన దావీదు మహారాజు, దావీదు వంశంలోనే ప్రభువును, లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు.

వివరణ:
పరిగె - పొలంలో పంట కోయునప్పుడు కూలీలు అక్కడక్కడ కొన్ని ధాన్యముతో వున్న గడ్డి పరకలను వదిలివేస్తారు. నిరు పేదలైన వారు ఆ గడ్డి పరకలు ఏరుకొని, వాటినుండి వచ్చిన ధాన్యంతో అన్నం వడుకొంటారు.

ధ్యానాంశములు :
1. బైబిలు గ్రంథంలో రూతు, ఎస్తేరు అను రెండు గ్రంథాలు మాత్రమే స్త్రీల పేర్లతో వున్నాయి. రూతు అను మాటకు రోజా పుషము అని అర్థము .
2. ఈ గ్రంథంలోని నయోమి, ఓర్పా, రూతు గమనించతగిన స్త్రీలు, రూతు తన దేశాన్ని తన జనులను వదిలి పెట్టి యూదా దేశానికి వచ్చింది.
బోయజు ఆమెను భార్యగా స్వీకరించాడు. రూతు ఆమె వంశము దేవునిచేత ఆశీర్వదింపబడింది. ఆమె వినయము, శీలము, మంచి ప్రవర్తన గలిగిన ఆదర్శ స్త్రీ.
3. ఆమె ఇశ్రాయేలుదేవుడైన యెహోవాను నమ్మింది. ఇశ్రాయేలు జనాంగములోనికి వచ్చింది.

బంగారు వాక్యము :
'నీ జనమే నాజనము. నీ దేవుడే నా దేవుడు.
రూతు 1:16


No comments:

Post a Comment