Breaking

Sunday, 5 January 2020

Bible story of moses | bible stories in telugu | మోషే



మోషే భూమిమీద వున్న వారందరిలో సాత్వికుడు. దేవుడు ఏర్పరచుకొన్న నమ్మకమైన సేవకుడు. దేవునితో (ఒక స్నేహితునితో మాట్లాడినట్టు) ముఖాముఖిగా మాట్లాడిన వాడు. “మోషే నా యిల్లంతటిలో నమ్మకమైన వాడు” అని యెహోవా దేవుడే మోషేను మెచ్చుకొన్నాడు. యోసేపు ఐగుప్తులో వున్న కాలంలో యాకోబు సంతానం 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు. వారు క్రమక్రమంగా విస్తరించి లక్షల సంఖ్యకు పెరిగారు. ఐగుప్తు రాజు, ప్రజలు వారిచేత కఠినమైన పనులు చేయింపసాగారు. రాజు
హెబ్రీయుల మగపిల్లలను పుట్టగానే చంపి వేయమని హెబ్రి మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. ప్రతి మగ బిడ్డను నదిలో పారవేయమని కూడ ఆజ్ఞాపించాడు.
కాని మంత్ర సానులు రాజు ఆజ్ఞను పాటించక రాజుతో అబద్దం చెప్పారు.

మోషే పుట్టుక, బాల్యము, వివాహము :-

లేవీ వంశంలోని ఒక స్త్రీకి ఒక అందమైన కుమారుడు పుట్టాడు. ఆ స్త్రీ రాజాజ్ఞకు భయపడింది. ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డను దాచి నదిలోని నాచులో దాచి పెట్టింది. ఫరో చక్రవర్తి కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బాలుణ్ణి చూసింది. చాలా సంతోషించి, ఆ పిల్లవాడిని పెంచుకోవాలని నిర్ణయించు కొంది. ఆ బిడ్డను పెంచే భారం వాడి తల్లికే అప్పగించింది. ఆ బాలుడు నీటి నుండి తీయబడ్డాడు కనుక అతనికి “మోషే” అని పేరు పెట్టింది. మోషే రాజ భవనంలో రాజకుమారుని వలె పెరిగాడు. ఒక రోజు మోషే ఒక ఐగుప్తీయుడు, హెబ్రీయుని కొట్టడం చూశాడు. స్వజాతి అభిమానంతో ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో పూడి పెట్టాడు. మరుసటి దినం యిద్దరు హెబ్రీయులు కొట్లాడుకొంటున్నారు. మోషే వారికి న్యాయం చెప్పబోయాడు. అప్పుడు వారిలో ఒకడు “నిన్న నీవు ఐగుప్తీయుని చంపావు, ఈ రోజు నన్ను చంపాలనుకొంటున్నావా?" అన్నాడు. తన రహస్యం తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ "సిప్పోరా” అనే స్త్రీని పెండ్లి చేసికొన్నాడు.

మండుచున్న పొద : దేవుని స్వరం : -

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. వారు యెహోవా దేవుణ్ణి మొరపెట్టుకొన్నారు. దేవుడు వారి మొర విన్నాడు. వారిని ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేయాలను కొన్నాడు. ఒక దినం మోషే గొర్రెలను మేపుతూ హోరేబు' కొండకు వచ్చాడు అక్కడ అగ్నిలో
మండుచున్న ఒక పొదను చూశాడు. మంటలో పొద కాలిపోలేదు. ఆ వింతను చూడాలని మోషే పొద దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పొదలో నుండి దేవుని స్వరం వినిపించింది. 'మోషే ! నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలము, నీవు దగ్గరకు రావద్దు. నీ కాళ్ళకు వున్న చెప్పులు వదులు. నేను ఐగుప్తు బానిసత్వంలో
వున్న నా ప్రజల మొర విన్నాను. వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేరుస్తాను. ఈ పని నీ ద్వారా జరుగుతుంది" అప్పుడు మోషే "దేవా! నేనొక మామూలు మనిషిని. బాగుగా మాట్లాడే శక్తి లేని వాడిని. ఆ ప్రజలు నన్ను నమ్మరు. కనుక వేరెవరినైనా పంపించు” అన్నాడు. కాని దేవుడు “ఈ పని చేయడానికి నీవే తగిన వాడివి" అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించడం కోసం ఈ మూడు సూచక క్రియలు చేసి చూపించమన్నాడు.

1) మోషే తన చేతి కర్రు క్రింద పడవేయగానే అది పాముగా మారిపోయింది. దాని తోకను పట్టి పైకి ఎత్తగానే మరల కర్రగా మారిపోయింది.
2) మోషే తన చెయ్యి రొమ్మున ఉంచుకోగానే అది కుష్ఠుతో తెల్లగా మారిపోయింది. రెండవసారి అలా చేయగానే మామూలు చెయ్యిగా మారిపోయింది.
3) కొంచెము ఏటినీళ్ళు తీసికొని నేలమీద పోయగానే అవి రక్తంగా మారిపోయాయి.

మోషే ఐగుప్తుకు వెళ్ళుట :

యెహోవా దేవుడు మోషేతో ఈ విధంగా అన్నాడు. “నీవు ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్లు. రాజా ఇశ్రాయేలు ప్రజలంతా అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి పూజించాలి. కాబట్టి అనుమతి యివ్వండి" అని అర్థించు. నేను ఫరో హృదయాన్ని కఠిన పరుస్తాను. కాబట్టి అతను మీకు అనుమతి యివ్వడు. అప్పుడు నేను ఐగుప్తు ప్రజలను తెగుళ్ళతో బాధ పెడతాను. వారు విసిగిపోయి మిమ్మల్ని దేశం విడిచిపొమ్మని తొందర పెడతారు. నేను నీకు, ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా వుంటాను...
మోషే తన కర్రను చేత పట్టుకొన్నాడు. అన్న అయిన అహారోనును వెంట తీసికొని ఐగుప్తు దేశం వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలందరిని పిలిపించాడు. తాము వచ్చిన పనిని తెలియజేశాడు. మోషే చేసిన మూడు సూచక క్రియలను చూసిన ప్రజలు, మోషే నిజంగానే దేవుని చేత పంపబడ్డాడని నమ్మారు. మోషే అహారోనులు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగాడు. అప్పుడు ఫరో "యెహోవా ఎవడు? ఆయనను నేను ఎరుగను. ఇశ్రాయేలు ప్రజలకు అనుమతి ఇవ్వను" అని ఖండితంగా చెప్పాడు. అంతేకాక ఇశ్రాయేలీయులకు గడ్డి యివ్వవద్దని, ఎక్కువ కష్టపెట్టమనీ, యిటుకలు మాత్రం తక్కువ కాకూడదనీ తన అధికారులకు ఆజ్ఞాపించాడు.

10 తెగుళ్లు :

మోషే, అహరోను రెండవసారి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో ఏదైన సూచక క్రియచేసి చూపించమన్నాడు. అప్పుడు అహరోను తన చేతిలో వున్న కర్రను క్రింద పడవేశాడు. వెంటనే అది పాముగా మారింది. ఫరో చెప్పగానే ఐగుప్తుమాంత్రికులు కూడ పాములను సృజించారు. కాని ఆహరోను పాము (కర్ర) ఆపాములను అన్నింటిని మ్రింగివేసింది. ఈ అద్భుతం చేసిన తర్వాత కూడ ఫరో మనసు మెత్తబడలేదు. అందువల్ల యెహోవా పది తెగుళ్ళతో ఐగుప్తు ప్రజలను బాధ పెట్టాడు.

ఆ పది తెగుళ్ళు

1) నీళ్ళు రక్తముగా మారుట
2) కప్పలు
3) పేలు
4) జోరీగలు
5) తెగులు
6) పొక్కులు, దద్దులు
7)వడగండ్లు
8) మిడుతలు
9) చీకటి
10) తొలి చూలు బిడ్డలు, పశువులు మరణించుట. 

ఈ పది తెగుళ్ళ వలన ఐగుప్తు ప్రజలు ఎంతో బాధపడ్డారు. 10వ తెగులు రాబోతుందని మోషే హెచ్చరించినప్పటికీ ఫరో లెక్కచేయలేదు.

పస్కాపండుగ : దాస్య విముక్తి
మోషే జరుగబోవు సంగతులను ఇశ్రాయేలు ప్రజలందరికి ముందుగా తెలియజేశాడు. వారు ఎప్పుడు ఏమి చెయ్యాలో వివరించాడు. మీరు పస్కా పండుగ ఆచరించండి. ఒక ఏడాది వయస్సున్న గొర్రె పిల్లను చంపి, దాని రక్తాన్ని మీ యిండ్ల ద్వారబంధపు పై కమ్మీ మీద, రెండు నిలువు కమ్మీల మీద చల్లండి. యెహోవా ఆ రక్తాన్ని చూసి మీ తొలిచూలు పిల్లలను చంపకుండ దాటి పోతాడు. మీరు మీ నడుము కట్టుకొని, కాల్వకు చెప్పులు తొడుగుకొని కర్ర చేతపట్టుకొని, త్వరపడుచు ఆ గొర్రెపిల్ల మాంసాన్ని, పులియని రొట్టెలను తినాలి. ఏడవ దినము యెహోవా మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించి, ఆ దేశం నుండి బయటికి రప్పిస్తాడు..
అంతా మోషే చెప్పిన విధంగానే జరిగింది. ఫరో యిల్లు మొదలు ఖైదీ వరకు ఐగుప్తు దేశంలోని తొలి చూలు పిల్లలందరు చనిపోయారు. పశువుల్లో కూడ యిలాగే జరిగింది. ఐగుప్తు దేశమంతా మహా ఘోష పుట్టింది. ప్రజలు భయంతో గడగడ వణకసాగారు. అప్పుడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను వెంటనే తీసికొని పొమ్మని తొందర పెట్టాడు.

కనాను దేశానికి ప్రయాణము :
ఇశ్రాయేలు ప్రజలంతా మోషే అహరోనుల నాయకత్వంలో బయలుదేరారు. వారు ఐగుప్తు వారిని అడిగి విస్తారంగా వెండి, బంగారము, బట్టలు
యిప్పించుకొన్నారు. వారు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై ముందుకు సాగిపోయారు. ఐగుప్తునుండి కనానుకు బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు కాక ఆరు లక్షలమంది.
430 సం॥లు ఐగుప్తులో బానిసత్వంలో పలు బాధలు అనుభవించారు. మోషే ద్వారా వారికి దాస్య విముక్తి కలిగింది.

ధ్యానాంశములు :

1 మోషే నమ్మకమైన సేవకుడు, దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా అనుసరించినవాడు.

2. దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు.

3. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రము యిచ్చాడు.

4. మోషే దేవునితో మాట్లాడిన వాడు, ఆయన మహిమను చూసినవాడు,ఆయనతో మాట్లాడినవాడు.

5. మోషేకు, యేసుక్రీస్తుకు కొన్ని విషయాలలో సారూప్యం వుందని బైబిలు పండితులు నమ్ముతున్నారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుపు దాస్యం నుండి విడుదల చేసి కనానుకు చేర్చాడు. యేసు మానవులను పాపదాస్యం నుండి విముక్తులను చేసి పరలోకానికి చేరుస్తాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవునికి విజ్ఞాపనలు చేసిన
విధంగానే, యేసు మనకొరకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు.

6. మోషే మంచి నాయకుడు.

బంగారు వాక్యము :

యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి యింకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.
(ద్వితీ 34:12)


No comments:

Post a Comment