సొలొమోను దావీదు మహారాజు యొక్క కుమారుడు, ఇతని తల్లి పేరు బత్సేబ. సొలొమోను పుట్టగానే ప్రవక్తయైన నాతాను అక్కడికి వెళ్లాడు. నాతాను అతనికి పెట్టిన పేరు “యదీద్యా" - అనగా యెహోవాకు ప్రియుడు. దావీదు మరణించిన తర్వాత సొలొమోను రాజయ్యాడు. సొలొమోను ఐగుపు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసికొన్నాడు. చరిత్రలో సొలొమోను రాజు మహాజ్ఞానియైన సొలొమోను అని ప్రసిద్ధి చెందాడు. ఒక రాత్రి సొలొమోనుకు కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేమి కావాలో కోరుకొనమన్నాడు. అందుకు సొలొమోను “నా దేవా! యెహోవా! నేను చాల చిన్న వాడిని. అయినా నన్ను రాజుగా చేశావు. యింత గొప్ప జనాంగాన్ని పరిపాలించడం, యింత విశాలమైన దేశాన్ని తనికీ చేయడం నాకు అసాధ్యమైన పని. కాబట్టి ప్రజలను న్యాయంగా పరిపాలించేందుకు అవసరమైన
జ్ఞానహృదయాన్ని (వివేకమును) నాకు అనుగ్రహించు" అని ప్రార్థించాడు. అతని కోరికను విని దేవుడు చాల సంతోషించాడు. “నీవు ధనాన్ని, దీర్ఘాయుష్షును, శతృవుల ప్రాణాలను కోరలేదు. జ్ఞానాన్ని కోరావు గనుక నీకు మంచి జ్ఞానంతోపాటు ఐశ్వర్యాన్ని, ఆయుష్షును కూడ యిస్తున్నాను. నీవంటి వివేక హృదయం గలవాడు నీకంటే పూర్వములేడు. నీ తర్వాత కూడ వుండబోడు". అని దీవించాడు.
సొలొమోను కీర్తి వ్యాపించుట :
సొలొమోను రాజ్యపాలన సుఖశాంతులతో కొనసాగింది. రాజ్యపాలన చక్కగా, న్యాయంగా జరిగేందుకు సొలొమోను ఎందరో అధికారులను
నియమించాడు. అజర్యాను ప్రధాన యాజకునిగా, బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. ఇశ్రాయేలు రాజుల పరిపాలనా కాలంలో సొలొమోను కాలము సంపదలతో, సుఖశాంతులతో, మంచి పంటలతో తులతూగింది. ప్రజలు తమ ద్రాక్ష తోటల్లో అంజూరపు చెట్టు క్రింద ప్రశాంతంగా, నిర్భయంగా
జీవించారు. ఫరాతునది మొదలుకొని, ఐగుప్తు వరకు వున్న రాజ్యాన్ని సొలొమోను రాజుగా వున్నాడు. చుట్టుప్రక్కల రాజ్యాలను పాలించే రాజు అతని అధికారానికి లోబడి వున్నారు. రాజు మందిరము ఎప్పుడూ విందులతో, వినోదాలతో ఆనందమయంగా వుండేది. ఐగుప్తు వారికంటె, తూర్పుదేశాల జ్ఞానుల కంటె సొలొమోను గొప్పవానిగా యెంచబడ్డాడు. అతని జ్ఞానపు మాటలు వినుటకై యితర రాజ్యాలనుండి ప్రజలు, రాజులు వస్తుండేవారు. అతని కీర్తి చుట్టు ప్రక్కల వున్న రాజ్యాలన్నిటికి వ్యాపించింది. సొలొమోను మూడు వేల సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. సొలొమోను వ్రాసిన సామెతలు మానవ జీవితాలకు మార్గదర్శకాలు. బైబిలులోని సామెతలు, ప్రసంగి, పరమగీతము గ్రంథాలు సొలొమోను రచించినవే.
సొలొమోను న్యాయ తీర్పు:
సొలొమోను రాజ్యంలో యిద్దరు వేశ్యలు వున్నారు. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. వారిలో ఒకామె బిడ చనిపోయింది. ఆమె చనిపోయిన తన బిడ్డను
నిద్రపోతున్న స్త్రీ పక్కలో వుంచి, బ్రతికివున్న బిడ్డను తెచ్చి తన దగ్గర వుంచుకొంది. తెల్లవారింది. నిద్రలేచిన స్త్రీ జరిగిన మోసం తెలిసికొంది. తన బిడ్డను యిచ్చి వేయమని అడిగింది. రెండవ స్త్రీ బ్రతికి వున్న బిడ్డ నాదే. చనిపోయినదే నీ బిడ్డ, అని వాదించింది. బ్రతికి వున్న బిడ్డ (బాలుని) కోసం యిద్దరు స్త్రీలు బాగా తగవులాడుకొన్నారు. ఎవరెంత చెప్పినా వినలేదు. చివరకు న్యాయం కోసం సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు యిద్దరి వాదనలు విన్నాడు. తరువాత ఒక కత్తి తెప్పించి, బిడ్డను రెండు సమానభాగములుగా నరికి, చెరిసగం పంచి యివ్యమని సేవకునికి చెప్పాడు. రాజాజ్ఞ వినగానే బిడ్డను కనిన తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె కన్నతల్లి
గుండె ద్రవించిపోయింది. ఆమె రాజుతో యిలా అన్నది. “రాజా! ఆ బిడ్డను చంపవద్దు. ఆ రెండవ స్త్రీకే యిచ్చివేయండి” అన్నది. రెండవ స్త్రీ మాత్రం బిడ్డను రెండు ముక్కలు చేసి చెరిసగం పంచమని కోరింది. అప్పుడు రాజు బిడ్డ యొక్క అసలు తల్లి యెవరో గ్రహించాడు. బిడ్డను చంపవలసిన పనిలేదనీ,
వాడిని స్వంత తల్లి అయిన మొదటి స్త్రీకే యివ్వమని ఆదేశించాడు. (ఆమె కన్నతల్లి కాబట్టి బిడ్డ ప్రాణాలు తీయడానికి యిష్టపడలేదు). రాజు దేవుడు తనకిచ్చిన జ్ఞానం వల్లనే న్యాయమైన తీర్పు యిచ్చాడని ప్రజలందరు అనుకొన్నారు.
యెరూషలేము దేవాలయ నిర్మాణము :
సొలొమోను ఇశ్రాయేలు దేశపు రాజైనందుకు చుట్టు ప్రక్కల వున్న రాజులందరు సంతోషించారు. వారు తమ శుభాకాంక్షలు పంపారు. తూర్పు దేశపు
రాజైన హేరాము కూడా సొలొమోనుకు శుభములు పంపాడు. కానుకలు కూడ పంపాడు. సొలొమోను హిరాము రాజుకు ఒక వర్తమానము పంపించాడు. “రాజా!! నేను మా దేవుడైన యెహోవాకు ఒక భవ్య మందిరము కట్టించాలనుకొటున్నాను. నీవు ఆ మందిరానికి అవసరమైన దేవదారు, సరళ మ్రానులను మాకు యివ్వాలి. మీ సేవకులకు అవసరమైన గోధుమలు, నూనె యిస్తాను. సహాయంగా మనుషులను కూడ పంపిస్తాను. హీరాము సొలొమోను రాజు కోరికను సంతోషంగా అంగీకరించాడు.
సొలొమోను యెరూషలేము పట్టణంలో యెహోవా దేవునికి మహా గొప్ప దేవాలయం కట్టించాడు. ఆ దేవాలయము పొడవు 60 మూరలు, వెడల్పు 20
మూరలు. ఎత్తు 30 మూరలు. యెహోవా మందసము కొరకు ప్రత్యేకంగా ఒక గర్భాలయము నిర్మింపబడింది. అది లోపల యిరువది మూరల పొడవు వెడల్పు, ఎత్తు గలిగి పూర్తిగా మేలిమి బంగారుతో పొదగబడినది. సొలొమోను దేవాలయాన్ని 7 సం॥లలో పూర్తి చేయించాడు. దానికి కావలసిన వస్తువులన్నీ తయారు చేయడానికి తూర్పు పట్టణం నుండి హీరాము అను ప్రఖ్యాత శిల్పిని పిలిపించాడు. అతడు యిత్తడితో చిత్ర విచిత్రములైన పనులు చేయగల గొప్ప పనివాడు. సొలొమోను ఇశ్రాయేలు గోత్ర పెద్దలతో, యాజకులతో వెళ్ళి దేవుని
మందసాన్ని స్థలంలో వుంచాడు. మందిర నిర్మాణంలో తనకు సహాయపడిన దేవదేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. యెహోవా దేవుడు సొలొమోను చేసిన ఈ మంచి పనికి సంతోషించాడు. సొలొమోను ఒక అందమైన రాచనగరు కూడ కట్టించాడు. దాని నిర్మాణానికి 18 సం॥లు పట్టాయి
షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట :
ఇశ్రాయేలు దేశాన్ని సొలొమోను పరిపాలిస్తున్న కాలంలో షేబ దేశాన్ని ఒక రాణి పరిపాలిస్తున్నది. ఆమె చాల అందమైనది. చాల తెలివైనది. ఆమె
సాలొమోను జ్ఞానాన్ని, వైభవాన్ని గురించి విన్నది. అతన్ని దర్శించడానికి గొప్ప పరివారంతో బంగారము, రత్నములు, గంధము మొ॥ విలువైన బహుమతులతో యెరూషలేముకు వచ్చింది. సొలొమోను యొక్క జ్ఞానాన్ని, సంపదను రాచనగరును, భోజన సామగ్రిని, పరిపాలనను చూసి ఆశ్చర్య పోయింది. ఆమె సొలొమోను మహారాజుతో యిలా అన్నది. "రాజా! నేను నిన్ను గురించి ఎన్నో
మంచి సంగతులు విని వున్నాను. నీ రాజ్య వైభవాన్ని గురించి, నీకు దేవుడిచ్చిన గొప్ప జ్ఞానాన్ని గురించి వినివున్నాను. నీ జ్ఞానము, నీ సౌభాగ్యము నేను వినిన దానికంటే ఎన్నోరెట్లు గొప్పగా వున్నవి. యెహోవాదేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమించాడు. వారిని న్యాయంగా పరిపాలించుట కొరకు నిన్ను వారికి రాజుగా నియమించాడు. నీ దేవుడైన యెహోవా స్తుతికి, స్తోత్రమునకు అర్హుడు"
సాలొమోను రాజు ఆమె ప్రశంసను విన్నాడు. అతడు రాణికి ఎన్నో విలువైన బహుమతులిచ్చి పంపించాడు. సొలొమోను దినములలో రాజుభవనంలో వుపయోగించే పాత్రలన్నీ బంగారువే. అతని దినములో వెండికి ఏమీ విలువ లేదు
సాలొమోను ఫరో కుమార్తెను గాక చాలా మంది అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు
చాలా మంది రాజ కుమార్తెలైన భార్యలు, 100 మంది ఉపపత్నులు ఉండేవారు. సాలోమోను భార్యలు, అతని మనస్సును అన్య దేవతలపైపు మరిల్చివేశారు. ఆతడు "అష్తారోతు " అను సీదోనీయుల దేవతను, "మిల్కోము" అను అమ్మోరీయుల దేవతను అనుసరించాడు. అన్యదేవతలకు యెరూషలేము ఎదుట కొండమీద బలిపీటము నిర్మింప చేశాడు. తన భార్యలను మిక్కుటంగా ప్రేమించి, యెహోవా దేవునికి బదులుగా అన్యదేవతలను పూజింపసాగాడు. యెహోవా రెండుసార్లు ప్రత్యక్షమై ఆతనిని హెచ్చరించాడు. కాని ఫలితం లేకపోయింది. కనుక దేవుడు ఆతనితో యిలా చెస్పాడు. "నీ రాజ్యాన్ని నీ సేవకునికి యిచ్చి వేస్తాను నీ కుమారుని కాలంలో నేను చెప్పినదంతా జరుగుతుంది", యహోవా చెప్పినట్లుగానే జరిగింది, ఎదోమీయుడైన హదదు రెజోను సాలొమోను సేవకుడైన యరోబాము తిరుగుబాటు చేశారు. సాలొమోను కుమారుడైన రెహబాముకు యెరూపలేము పట్టణము, ఒక గోత్రము మాత్రము మిగిలాయి. సాలొమోను 40 సం॥లు రాజ్యపరిపాలన చేశాడు. చనిపోయిన తర్వాత దానీదుపురంలో (బెత్లెహేములో) సమాధి చేయబడ్డాడు.
ధ్యానాంశములు
1.సాలొమోను యెరూషలేములో గొప్ప దేవాలయం నిర్మించాడు. అది చాల అందంగా, ఖరీదైన కలపతో, బంగారు వెండి నగిషీలతో నిర్మింపబడింది.
2.సాలొమోను చక్రవర్తి వ్రాసిన సామెతలు యిప్పటికీ చాల మంచివిగాను, మానవ జాతికి మేలుకరమైనవిగాను భావింపబడుతున్నవి
3.సాలొమోను అన్యులైన స్త్రీలను పెండ్లి చేసికొని, వృద్ధాప్యంలో అన్యదేవతలను పూజించాడు. కనుక విశ్వాసులు అవిశ్వాసులైన భార్యలు లేదా భర్తలను పెండ్లి చేసికొన్నప్పుడు చాల జాగ్రత్తగా పుండాలి. రక్షణకర్త అయిన దేవుణ్ణి మరువకూడదు
బంగారు వాక్యము
యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము" సామెతలు 910
No comments:
Post a Comment