Breaking

Friday, 29 November 2019

Bible story of naaman | bible stories in telugu | నయమాను



సీరియా దేశపు రాజు దగ్గర నయమాను అను ఒక సైన్యాధిపతి ఉండేవాడు. అతడు మహా పరాక్రమశాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజుకు
దేశానికి జయము కలుగజేశాడు. రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అందువలన రాజు నయమానును ఎక్కువగా గౌరవించేవాడు నయమానుకు చాల మంచి లక్షణాలు వున్నాయి. కాని అతడు కుష్టురోగి, అందువలన ఎప్పుడూ తన వ్యాధిని గురించి బాధపడుతుండేవాడు. అతని భార్య దగ్గర ఇశ్రాయేలు దేశమునుండి బానిసగాతెచ్చిన ఒక బాలిక వుంది. ఆ బాలిక నయమాను భార్యకు ఒక సలహా యిచ్చింది. "అమ్మగారూ! షామ్రోను దగ్గర ఎలీషా అను ఒక దైవజనుడు వున్నాడు. నా యజమాని ఆయన దగ్గరికి వెళ్ళితే తప్పకుండా స్వస్థత పొందుతాడు" అని చెప్పింది. నయమాను వెళ్ళి సిరియా రాజుకు ఈ సంగతి చెప్పాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజు
దగ్గరికి ఒక దూతను పంపాడు. ఆ దూత ద్వారా యిరువది మణుగుల వెండి, లక్షయిరువది వేల రూపాయల బంగారు, పది దుస్తుల బట్టలు కానుకగా
పంపాడు. నా సైన్యాధిపతియైన నయమానుయొక్క కుష్ఠురోగాన్ని ఎలాగైనా బాగు చేయించమని” లేఖ వ్రాసి పంపాడు. ఆ లేఖ చదివిన ఇశ్రాయేలు రాజు
దుఃఖముతో తన బట్టలు చింపుకొన్నాడు. "ఒకరిని చంపడానికి, బ్రతికించడానికి నేనేమైనా దేవుడినా? నయమానుకు వున్న కుష్టురోగం బాగు చేయించమని
రాజు నాకు పత్రిక పంపించాడు. సిరియారాజు నాతో కలహము పెటుకోవడానికే ఈ పని చేశాడు" అని ఎంతో బాధపడ్డాడు. ఈ విషయం తన అధికారులకు
చెప్పాడు. రాజు చాల దుఃఖంలో వున్నాడని ఎలిషా ప్రవక్తకు తెలిసింది. "రాజా నీవు నీ వస్త్రములు చింపుకొనడం ఎందుకు? ఇశ్రాయేలులో ఒక ప్రవక్త వున్నాడని సిరియా రాజుకు తెలియునట్లుగా, ఆ కుష్టురోగిని నాదగ్గరికి పంపించు" చెప్పి పంపాడు

నయమాను గుర్రములతో, రధములతో, పరివారముతో, కానుకలతో ఎలీషా యింటిముందు నిలిచాడు. అప్పుడు ఎలీషా "నీవు వెళ్ళి యోర్దాను
నదిలో ఏడుసార్లు స్నానం చెయ్యి, నీ కుష్టురోగం బాగవుతుంది" అని ఒక దూత ద్వారా చెప్పి పంపించాడు. దూత మాటలు వినిన నయమాను కోపంతో వెనక్కు తిరిగి వెళ్లాడు. "ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి, నా శరీరాన్ని తాకి, నా రోగం బాగుచేస్తాడనుకొన్నాను. కాని యోర్దాను నదీలో ఏడు సార్లు స్నానం చేయమని చెప్పి పంపించాడు. మా దేశంలో వున్న అబానాయును, ఫర్పరును
ఇశ్రాయేలు దేశపు నదులకంటె మంచివి కావా?" అని అన్నాడు. అప్పుడు నయమాను దాసుడొకడు "అయ్యా! ఆ ప్రవక్త యింతకంటె గొప్ప పని ఏదైనా
చేయమని ఆదేశిస్తే చేయవా?" అన్నాడు. ఈ సలహా నయమానుకు నచ్చింది అతడు వెళ్ళి యెర్దాను నదిలో ఏడుసార్లు మునగగానే అతని శరీరం పసిపిల్లల శరీరం వలె మారిపోయింది. అతడు పూర్తిగా స్వస్థత పొందాడు. నయమానుకు పట్టరాని సంతోషం కలిగింది. వెంటనే ఎలీషా దగ్గరికి తిరిగి వెళ్లాడు. తాను తెచ్చిన కానుకలు యివ్వబోయాడు. కాని ఎలీషా తీసికొనలేదు. అప్పుడు నయమాను ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని స్తుతించాడు. ఎలీషా దగ్గర సెలవు తీసికొని తన దేశానికి తిరిగి వెళ్ళాడు జరిగిన విషయమంతా ఎలీషా శిష్యుడు గెహాజీ గమనిస్తున్నాడు అతనికి తన యజమాని చేసిన పని బొత్తిగా నచ్చలేదు. సులభంగా లభిస్తున్న వెండి, బంగారు, ప్రశస్త వస్త్రములు ఎలీషా తిరస్కరించినందుకు ఎంతో బాధపడ్డాడు. వెంటనే నయమాను దగ్గరికి పరుగు తీశాడు. దారిలో అతనిని
కలుసుకొని "అయ్యా! ఇప్పుడే మా యజమాని దగ్గరికి ఎప్రాయీము నుండి యిద్దరు శిష్యులు వచ్చారు. వారికోసం రెండు 'మణుగుల వెండి, రెండు మీ వద్ద యిప్పించుకొని రమ్మని మా యజమాని చెప్పి పంపాడు“ అని అబద్దం చెప్పాడు. నయమాను గెహాజీ మాటలు నమ్మాడు. నీకు యిష్టమైతే రెట్టింపు తీసికొని వెళ్లు అని చెప్పి, సేవకుల ద్వారా నాలుగు మణుగుల వెండి రెండు జతల బట్టలు సేవకుల ద్వారా యిచ్చి పంపించాడు గేహాజీ వాటిని దాచిపెట్టి ఏమీ ఎరుగని వానివలె ఎలీషా ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అతనితో "గెహాజీ, నీవు ఎక్కడినుండి వచ్చావు?" అని అడిగాడు. అందుకు గెహాజీ నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఇక్కడే వున్నాను అన్నాడు. అందుకు ఎలీషా "ఆ మనుష్యుడు రథము దిగి, నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నామనసు నీతో కూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్షతోటలను ఎడ్లను, గొర్రెలను, దాస దాసీలను సంపాదించుకొనుటకు యిది సమయమా? నీవు నాకే కాదు యెహోవాకు యిష్టంలేని పని చేశావు. కనుక నయమానుకు వున్నకుష్టురోగము నీకు, నీ సంతతికి సదాకాలము వుండుగాక" అన్నాడు. వెంటనే గెహాజీ శరీరము కుష్టువలన తెల్లగా మారిపోయింది. అతడు ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు



ధ్యానాంశములు :

1.ఎలీషా చేసిన అద్భుత కార్యం వలన యెహాో వా దేవునికి మహిమ, ఘనత కలిగాయి. అన్యుడైన నయమాను యెహోవా దేవుని స్తుతించాడు
ఆయననుపూజించాలని నిర్ణయించుకొన్నాడు. ప్రవక్త దగ్గర వుంటూ, యెహోవా దేవుని స్తుతిస్తూ జీవితం గడుపుతున్న గెహాజీ ధనాశవలన శపింపబడి తరతరాల కుష్ఠురోగాన్ని సంపాదించుకొన్నాడు

2.దేవుని నమ్ముకున్నవారు స్వస్థత పొందుతారనీ, కష్టాలను అధిగమిస్తారనీ ఆయన చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శాపానికి గురి అవుతారని
మనము గ్రహించాలి

3.దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు

4.నయమాను యింట్లో వుంటున్న ఇశ్రాయేలు బాలిక తన యజమానురాలికి మంచి సలహా ఇచ్చింది. దేవుని బిడ్డలు కూడ యితరులకు మేలు చేయాలి మంచి మార్గము చూపించాలి


బంగారు వాక్యము

ఇశ్రాయేలులో వున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును.
2 రాజులు 5:15


No comments:

Post a Comment