ఇస్సాకు అబ్రాహాము యొక్క ఏకైక కుమారుడు. యితడు దేవుని వరము వలన అబ్రాహాము, శారాలకు వృద్ధాప్యంలో పుట్టినవాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరేండ్లవాడు. దేవుడు అబ్రాహాముతో “నీ సంతానాన్ని ఆకాశనక్షత్రాల వలె, సముద్రతీరంలోని యిసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను” అని వాగ్దానము చేశాడు. ఇస్సాకును అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేవాడు. అయితే ఒకసారి దేవుడు అబ్రహాముతో “నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి యివ్వు" అన్నాడు. అబ్రాహాము దేవునికి ఎదురు చెప్పలేదు. తన కుమారుని బలి యివ్వడానికి సిద్ధపడ్డాడు.
అబ్రాహాము ఇస్సాకును వెంట తీసికొని మోరియా పర్వతానికి చేరుకొన్నాడు. కొండపైకి ఇస్సాకు చేతులు కట్టి, బలిపీఠం పై పరుండబెట్టి వధించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు తండ్రికి ఏమీ ఎదురు మాట్లాడలేదు. తండ్రిపట్ల పూర్తి విధేయత చూపాడు. అబ్రాహాము తన చెయ్యి చాపి ఇస్సాకును చంపడానికి కత్తి ఎత్తగానే యెహోవా దూత పరలోకము నుండి "అబ్రహామా! ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యవద్దు. అతన్ని చంపవద్దు" అన్నాడు.
ఇస్సాకునకు బదులుగా దేవుడు పంపిన ఒక పొట్టేలును అబ్రాహాము బలిగా అర్పించాడు. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రాహాము, ఇస్సాకు యిద్దరూ
ధైర్యంగా వున్నారు.
అబ్రాహాముకు విగ్రహారాధికురాలైన అన్యుల కుమార్తెను తన కోడలిగా చేసికోవడం ఇష్టం లేదు. తన బంధువుల కుమార్తె అయిన రిబ్కాను తన కోడలిగా చేసికొన్నాడు. రిబ్కా నాహోరు పట్టణ కాపురస్తుడైన బెతూయేలు కుమార్తె, లాబానుకు సహోదరి. ఆమె చాలా అందమైన యువతి, భర్తను ఎంతగానో ప్రేమించి, గౌరవించింది. ఇస్సాకు కూడ రిబ్కాను మిక్కిలిగా ప్రేమించాడు. రిబ్కా గర్భవతిగా వున్నప్పుడు ఆమె గర్భంలో యిద్దరు శిశువులు
ఒకరితో ఒకరు పెనుగులాడుకొన్నారు. ప్రసవ సమయంలో చిన్నవాడు పెద్దవాని మడమను పట్టుకొని లాగుతున్నాడు. ఆమె యిద్దరు కుమారులను ప్రసవించింది..! పెద్దకుమారుని పేరు ఏశాపు, రెండవ కుమారుని పేరు యాకోబు. ఇస్సాకు
ఏశావును, రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించారు.
ఇస్సాకు కాలంలో ఒకసారి ఆ దేశంలో గొప్ప కరవు వచ్చింది. అతడు తన పరివారంతో ఫిలిప్తీయుల రాజగు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. యెహోవా దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించినందున అతనికి విస్తారంగా పశువులు, గొర్రెలు, ధనము, దాసదాసీలు యిచ్చాడు. అతని సంపదను, ఉన్నత స్థితిని చూసి ఫిలిప్తీయులు అసూయపడ్డారు. వారు అబ్రాహాము త్రవ్వించిన బావులన్నింటిని పూడ్చి వేశారు. అబీమెలెకు ఇస్సాకుతో “నీవు మాకంటె
ధనవంతుడవు. బలవంతుడవు. మా యొద్దనుండి దూరంగా వెళ్ళిపో" అన్నాడు. ఇస్సాకు అక్కడినుండి వెళ్ళి గెరారు లోయలో నివసింపసాగాడు. అక్కడి ప్రజలు అతడు త్రవ్వించిన బావులను పూడ్చి వేశారు. మూడవ బావిని ఎవరూ పూడ్చలేదు. దానికి ఇస్సాకు "రహెబోతు" అని పేరు పెట్టాడు. అతడు అక్కడి నుండి “బెయెరైబా”కు వెళ్ళి అక్కడ నివాసం వున్నాడు. దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై "నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నీవు ఎవరికీ భయపడవలసిన పనిలేదు" అని చెప్పాడు. అక్కడ ఇస్సాకు మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఫిలిప్తీయుల సేనాధిపతి ఇస్సాకు దగ్గరికి వచ్చి “మనము ఒకరికి ఒకరము కీడు చేసికొనకుండా ఉందాము. నీవు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడివి. నీకు మేము ఎలాంటి హాని చేయము. నీవు కూడ
మాకు హాని చేయవద్దు" అని చెప్పారు. ఇస్సాకు అందుకు ఒప్పుకొన్నాడు. వారికి విందు చేసి పంపాడు. ఆరోజే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన
బావిలో నీళ్ళు పడ్డాయని చెప్పారు. ఇస్సాకు ఆ బావికి "షేల" అని పేరు పెట్టారు. తర్వాత ఆ వూరికి "బెయెరైబా" అనే పేరు స్థిరపడింది.
ఇస్సాకు ముసలివాడయ్యాడు. అతని కనుచూపు మందగించింది. అతడు ఒక దినం తన పెద్ద కుమారుడు ఏశావుతో “నీవు అడవి నుండి వేటాడిన
మాంసం తెచ్చినాకు వండి పెట్టు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను" అన్నాడు. ఈ మాటలు రిబ్కా విన్నది. ఆమె మేక మాంసం రుచిగా వండింది. దానిని యాకోబుకు యిచ్చి పంపింది. అతని చేతులకు, మెడ భాగానికి మేకతోలు కప్పి పంపింది.
యాకోబు తండ్రి దగరికి వెళాడు. తానే ఏశావును అని చెప్పాడు, ఇస్సాకు అతనిని తడివి చూశాడు. 'స్వరము యాకోబుది, దేహము ఏశావుది" అనుకొన్నాడు. యాకోబును ఆశీర్వదించి పంపాడు. తర్వాత ఏశావు వచ్చాడు. యాకోబు తండ్రిని మోసగించి ఆశీర్వాదములన్నీ పొందిన విషయం
తెలిసికొన్నాడు. చాలా బాధపడ్డాడు. "యాకోబు (మోసగాడు) అనే పేరు వానికి బాగా సరిపోయింది” అన్నాడు. ఏశాపు తన తమ్ముడైన యాకోబుపై పగపట్టాడు. యాకోబు తన మేమమామ అయిన లాబాను వద్దకు పారిపోయాడు. అతని వద్ద
20 సం||లు ఉండి, తన యిద్దరు భార్యలు,పిల్లలు మరియు దాసదాసీలతో కనాను దేశంలోని హెబ్రోనులో వుంటున్న ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు బహు వృద్ధుడై 180 సం||ల వయసులో మరణించాడు.
ఇస్సాకులో మనము విధేయుడైన కుమారుడు, ప్రేమించే భర్త, దయగల తండ్రి అనే మూడు మంచి గుణాలు చూడగలము. తండ్రి బలి యివ్వబోయినప్పుడు ఇస్సాకు వయస్సు 20 సం||లు. అయినను అతడు తండ్రికి విధేయత చూపాడు.
ధ్యానాంశములు :
1. అబ్రాహాము యెహోవా దేవునికి, ఇస్సాకు యేసుక్రీస్తుకు సూచనగా వున్నారు. యేసుక్రీస్తు వలెనె ఇస్సాకు తండ్రికి విధేయుడుగా వున్నాడు. యేసుక్రీస్తు వలెనె ఇస్సాకు తండ్రికి ఏకైక కుమారుడు.
2. ఇస్సాకు తనను మోసం చేసిన యాకోబుపట్ల కూడ తండ్రి ప్రేమను కనపరచాడు.
3. దేవుడు సెలవిచ్చినట్లుగా ఇస్సాకు సంతానము ఆకాశంలోని నక్షత్రాల వలె, సముద్ర తీరంలోని యిసుక రేణువుల వెల విస్తరించింది.
4. ఇస్సాకు బలి కావడానికి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు మానవులందరి కొరకు తన ప్రాణములు బలి అర్పించాడు.
బంగారు వాక్యము :
యెహోవా అతనిని ఆశీర్వదించెను. కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
ఆది 26:12. 1
No comments:
Post a Comment