దానియేలు
బబులోను సామ్రాజ్యానికి రాజు “నెబుకద్నెజరు”, అతడు యూదా
రాజైన "యెహోయాకీము"ను ఓడించాడు. యెహోవా దేవుని మందిరంలో వున్న విలువైన వస్తువులన్నీ దోచుకొని పోయాడు. వాటిని షీనారు దేశంలో వున్న
దేవతాలయపు ధనాగారంలో వుంచాడు. అతడు తెలివి, అందము గల కొందరు యూదా రాజవంశపు యువకులను బందీలుగా పట్టుకొన్నాడు. వారికి తాను
భుజించే ఆహారము, తాను సేవించే ద్రాక్షారసము, మంచి బట్టలు యిచ్చి మూడు సం||లు పోషించమని చెప్పాడు. పట్టుబడిన యువకులలో దానియేలు,
హసన్యా, మిషాయేలు, అజర్యా అనువారున్నారు. వారికి రాజు బెత్తెషాజరు, షద్రకు, మేషాకు, అబెద్నగో అను పేర్లు పెట్టాడు. వీరు నలుగురు పవిత్రంగా
యెహోవా దేవునికి విధేయులుగా వుండాలనుకొన్నారు. అందువల్ల రాజు యిచ్చిన ఖరీదైన ఆహారం భుజించకుండా మామూలు శాకాహారం భుజించారు. అయినప్పటికి చాల ఆరోగ్యంగా, అందంగా వున్నారు. రాజు నలుగురు
యువకులను రాజ మందిరంలో వుంచుకొన్నాడు. దేవుడు వారికి జ్ఞానమును, వివేచనను, సకల శాస్త్రములలో ప్రావీణ్యము అనుగ్రహించాడు. దానియేలు అన్ని రకముల స్వప్నముల యొక్క అర్ధమును చెప్పగల్గిన తెలివిగలవాడై
యుండెను. అతడు దేవుని ఆత్మగలవాడై వుండెను.
నెబుకద్నెజరు ఒక రాత్రి ఒక కలగన్నాడు. అయితే ఆ కలను మరచిపోయాడు. ఆయన తన రాజ్యంలోని మాంత్రికులను, శకున గాండ్రను అందర్నీ పిలిపించాడు. వాళ్లు కల భావము చెప్పలేకపోయారు. రాజుకు చాల కోపం వచ్చింది. అందరిని చంపమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసికొన్న దానియేలు రాజు సన్నిధికి వెళ్లాడు. "రాజా ! నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చేత మీ కల యొక్క భావం వివరిస్తాను” అన్నాడు.
దానియేలు కలయొక్క అర్థం యిలా తెలియజేశాడు. “రాజా! తమరు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ పండుకొన్నారు. కలలో ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు. ఆ విగ్రహం తల బంగారంతో, భుజాలు వెండితో, పొట్ట తొడలు యిత్తడితో, పాదములలో ఒక భాగం యినుముతో, ఒక భాగం మట్టితో తయారు చేయబడింది. చేతితో చేయబడని ఒక పెద్దరాయి వచ్చి విగ్రహం పాదాలను విరుగగొట్టి, ముక్కలు
ముక్కలుగా చేసింది. విగ్రహం అంతా ఏకంగా కలపబడి చెత్తవలె అయిపోయింది. ఆ విగ్రహము తమరి మహా గొప్ప సామ్రాజ్యానికి చిహ్నంగా వుంది. మీ తరువాత బలంలేని, ఐకమత్యం లేని రాజులు పరిపాలన చేస్తారు. చివరకు వారు నశించి, దేవుని రాజ్యము వస్తుంది. యిలా జరుగబోతుందని దేవుడు మీకు స్వప్నం ద్వారా తెలుయజేశాడు” అంతా వినిన నెబుకద్నెజరు రాజు దానియేలును మెచ్చుకొని, గౌరవించాడు. అతనిని తన ఆస్థానంలోని జ్ఞానులకు ప్రధానిగా నియమించాడు.
రాజైన నెబుకద్నెజరు “దూరా' అనే మైదానంలో ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని నిలబెట్టించాడు. మంగళ వాద్యములు మ్రోగగనే ప్రజలంతా ఆ ప్రతిమకు మొక్కాలనీ, మొక్కనివారు అగ్ని గుండంలో వేయబడతారనీ ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలందరు రాజు ఆజ్ఞను పాటించారు. కాని షడ్రకు, మెషాకు,
అబెద్నగోలు మాత్రం ఆజ్ఞను లెక్కచేయలేదు. వారు బంగారు ప్రతిమకు మొక్కలేదు. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు.
ఈ సంగతి గమనించిన కొందరు పెద్దలు రాజుకు చాడీలు చెప్పారు. రాజు వారు ముగ్గురిని పిలిపించి అన్నాడు - "మీరు ప్రతిమకు మొక్కడం లేదనీ, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారనీ తెలిసింది. నానుండి మిమ్మల్ని కాపాడేదేవుడెక్కడ వున్నాడు?” అని బెదిరించాడు. అందుకు వారు ముగ్గురు “రాజా! మా దేవుడైన యెహోవా మండుచున్న అగ్నిగుండంలో వేసినా మమ్ములను రక్షింప గలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకున్నా మేము మాత్రం నీవు పెట్టించిన బంగారు ప్రతిమను పూజించము" అని ధైర్యంగా చెప్పారు. వారి మాటలకు రాజుకు చాల కోపము వచ్చింది. ఆయన
ముగ్గురినీ మండుచున్న అగ్ని గుండంలో వేయించాడు. వారిని గుండంలో విసిరేసిన మనుషులు కాలి చచ్చిపోయారు. కాని షడ్రకు, మెషాకు, అబెదగో అను వారు మాత్రం కాలిపోలేదు. రాజు, అతని మంత్రులు అగ్నిగుండంలో నలుగురు మనుషులు సంచరించడం చూశారు. తర్వాత నెబుకద్నెజరు పిలవగానే ముగ్గురు స్నేహితులు అగ్నిగుండం నుండి క్షేమంగా బయటికి
వచ్చారు. యిదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. షడ్రకు. మెషాకు, అబెద్నగోల దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడు.
ఒక రాత్రి నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. కలలో ఒక పెద్ద చెట్టును చూశాడు. అది కొమ్మలువేసి, ఆకులతో, పండ్లతో చక్కగా పెరిగింది. అప్పుడు ఆకాశం నుండి ఒక దూత వచ్చి చెట్టును నరికి, మొద్దును మాత్రం
వుంచమన్నాడు. ఏడు కాలముల తర్వాత మొద్దు మరల చిగురిస్తుంది అన్నాడు. దానియేలు ఆ కలయొక్క భావాన్ని రాజుకు యిలా వివరించాడు. "మహారాజా! ఆ పెద్దచెట్టు మీరే. మీనుండి మీ రాజ్యం తీసివేయబడుతుంది. మనుష్యులు మిమ్మల్ని తరిమి వేస్తారు. మీరు ఏడు సం||లు అడవిలో వుండి పశువువలె గడ్డి తింటారు యెండలో, వానలో, మంచులో తిరుగుతారు. దేవుడు గొప్ప వాడని
తెలిసికొన్న తర్వాత మీ రాజ్యము మీకు తిరిగి యివ్వబడుతుంది.”
ఒక దినము రాజు తాను కట్టించిన బబులోను మహానగరాన్ని చూసి గర్వించాడు. ఆ ఘడియనుండే దానియేలు చెప్పిన ప్రకారం జరిగింది. రాజు
ఏడు సం||లు అడవిలో సంచరించాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ తర్వాత మరల రాజయ్యాడు
నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడు బెలసరు రాజయ్యాడు. అతడు ఒకరోజు తన అధిపతులకు విందు చేయించాడు. తన తండ్రి యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలు తెప్పించాడు. వాటిలో ద్రాక్షారసము పోసి తాగుతూ రాజు, అతని రాణులు, ఉపపత్నులు తమ దేవతలను పొగడుతూ వున్నారు. అప్పుడు రాజుకు ఒక మానవ హస్తము కనిపించింది. ఆ హస్తము గోడమీద ఏమిటో రాసింది. ఆ వ్రాతను చూడగానే
రాజు భయంతో గడగడ వణికాడు. అతని ముఖము వికారమైంది. మోకాళ్లు గడగడ కొట్టుకొన్నాయి. మరుసటి రోజు రాజు తన రాజ్యంలోని గారడీ వాండ్లను, జ్యోతిష్కులను, కల్దీయులను పిలిపించాడు. ఎవరూ కలకు అర్ధం చెప్పలేకపోయారు. చివరకు రాణి సలహా యివ్వగా దానియేలును (బెత్తెషాజరును) పిలిపించాడు.
దానియేలు కల భావం యిలా వివరించాడు - "రాజా! నీ తండ్రి అయిన నెబుకద్నెజరు గర్వపడి, దేవుని కోపానికి గురియై అడవుల పాలయ్యాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. నీవు కూడ గర్వించావు. దేవాలయపు పాత్రలలో ద్రాక్షారసము పోసికొని తాగావు. బంగారము, వెండి, యిత్తడి, యినుముతో
చేసిన విగ్రహాలను పొగిడావు. అందువలన దేవుడు నీకు సంభవింపబోయే సంగతులను ఆ గోడ పైన వ్రాశాడు. గోడ మీద “మెనే, మెనే టెకేల్ పార్సిన్"
అని వ్రాయబడింది. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు. టెకేల్ అనగా - ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు
తక్కువగా కనబడితివి ఉపార్సిన్ అనగా - నీ రాజ్యము నీ నుండి తీసివేయబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది.” రాజు దానియేలును ఎంతో మెచ్చుకొన్నాడు. అతనికి ఊదారంగు వస్త్రములు దరింపచేశాడు. మెడలో బంగారు హారం వేసి సత్కరించాడు. దానియేలు తన రాజ్యంలో మూడవ అధికారి అని చాటింపు వేయించాడు. ఆ రాత్రే బెలసరు చంపబడ్డాడు. మాదీయుడగు దర్వావేషు రాజయ్యాడు.
రాజైన దర్యావేషు 120 మందిని అధిపతులుగా ఏర్పాటు చేశాడు. వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలుకు
ప్రముఖ స్థానం యిచ్చాడు. దానియేలు మంచి ప్రవర్తన, న్యాయ బుద్ధి నమ్మకము గలవాడై, ప్రజలలో అధికారులలో మంచి పేరు సంపాదించాడు.
అది చూసి కొందరు అధికారులకు అసూయ కలిగింది. వాళ్ళు రాజుతో ఒక శాసనం చేయించారు. ఆ శానసం ప్రకారం “30 రోజుల వరకు ప్రజలందరు రాజుకు మాత్రమే తమ విజ్ఞాపనలు చెప్పుకోవాలి. యితర దేవతల యొద్దగాని, మనుషుల యెద్ద గాని విజ్ఞాపన చేస్తే వారు సింహముల గుహలో వేయబడతారు”. దానియేలుకు శాసనం చేయబడిందని తెలిసింది. అయినా అతడు ప్రతి రోజు మూడు పర్యాయములు యెహోవా దేవునికి ప్రార్థనలు చేస్తూ, ఆయనను స్తుతిస్తూ వున్నాడు. అధికారులు ఈ సంగతి రాజుకు చెప్పారు. దానియేలు మీ ఆజ్ఞను మీరాడు” అన్నారు.
రాజుకు దానియేలు పట్ల చాలా ప్రేమ వుంది. కాని విధిలేక దానియేలును సింహముల బోనులో వేయించాడు. ఆయనకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి దినం ఉదయాన్నే గుహదగ్గరికి వస్తాడు "దానియేలూ! నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా?” అని అడిగాడు. అప్పుడు
దానియేలు “రాజా! నా దేవుడు సింహముల నోళ్లుమూయించాడు. నేను క్షేమంగా వున్నాను'' అన్నాడు. వెంటనే రాజు దానియేలును బయటికి
తీయించాడు. చాడీలు చెప్పిన అధికారులను గుహలో వేయించాడు. సింహములు వారిని వెంటనే చంపి, ఎముకలు కూడ తినివేశాయి. దర్యావేషు
తన రాజ్యమంతట ఈ విధంగా ప్రకటన చేయించాడు. “దానియేలు పూజించే దేవుడే జీవము గల దేవుడు. ఆయన యుగయుగములు వుండువాడు. సూచక
క్రియలను, ఆశ్చర్య కార్యములను జరిగించు వాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించాడు.".
ఆ తర్వాత కూడ దానియేలు ఎన్నో దర్శనములను చూశాడు.
భవిష్యత్తులో రాజ్యాలకు, రాజులకు, ప్రజలకు జరుగబోయే విషయాలు
తెలిసికొన్నాడు. యుగాంతంలో పరలోకంలో సంభవించే సంగతులు తెలిసి
కొన్నాడు. ఈ విషయాలన్నీ ఒక గ్రంథంలో వ్రాశాడు.
God bless you bro..
ReplyDelete