Breaking

Saturday, 31 August 2019

Bible story of job | Bible Stories In Telugu | యోబు


ఊజు దేశంలో యోబు అనే పేరుగల ఒక మనుష్యుడు వున్నాడు.
అతడు నీతిమంతుడు, యదార్థవంతుడు, న్యాయ వర్తనుడు, చెడు తనమును
విసర్జించినవాడు, దేవునియందు భయభక్తులుగలవాడు. దేవుడతన్ని బహుగా
ఆశీర్వదించాడు. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు,
ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు,
ఎందరో దాసదాసీలు వుండేవారు. తూర్పు దేశంలో యోబు చాల ధనవంతుడని,
ధర్మవర్తనుడనీ ప్రసిద్ది చెందాడు. యోబు తన కుమారులు పాపము చేసి
దేవుని దూషించినారేమో అని వారిని పిలిపించి, పవిత్రపరచి, ఉదయాన్నే నారి
నిమిత్తము దహనబలులు అర్పించేవాడు.
ఒక రోజు దేవదూతలందరు యెహోవా దేవుని దగ్గరికి వచ్చారు. వారితో
అపవాది (సాతాను) కూడ వచ్చాడు. దేవుడు అపవాదిని యిలా అడిగాడు.
“భూమి మీద నా సేవకుడైన యోబు వున్నాడు. అతని వంటి నీతిమంతుడు,
సద్గుణ సంపన్నుడు ఎవరూ లేరు, నీవు అతన్ని గురించి ఎప్పుడైనా
ఆలోచించావా?" దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా అపవాది “నీవు యోబును
అతని సంతానాన్ని, అతని ఆస్తిని కాపాడుతుండబట్టి అతడు హాయిగా
జీవిస్తున్నాడు. నీవు గనక అతని ఆస్తిని పోగొట్టి, అతనికి కష్టం కలిగించావంటే
అతడు నిన్ను తిట్టి, నీకు దూరమై పోతాడు” అన్నాడు. అపవాది మాటలు
- వినిన యెహోవా దేవుడు “యోబుకువున్న ఆస్థిపాస్తులను, సంతానాన్ని,
పశువులను నీకు అప్పగిస్తున్నాను. అతనిని నీవు శోధించవచ్చు." అన్నాడు.
ఒకదినం యోబు కుమారులు, కుమార్తెలు తమ అన్న యింట్లో
విందులో వున్నారు. ఒక సేవకుడు యోబు దగ్గరికి వచ్చి “శత్రువులు పనివారిని
చంపిమన ఎద్దులను, గాడిదలను తోలుకొని పోయారు. నేను మాత్రమే బ్రతికాను" అని చెప్పాడు. మరొక సేవకుడు వచ్చి "ఆకాశం నుండి అగ్ని
దిగివచ్చి మన గొర్రెలను, పనివారిని దహించి వేసింది" అని చెప్పాడు, యింకొకడు వచ్చి "కల్దీయులు పనివారిని చంపి మన ఒంటెలను తోలుకొని పోయారు" అన్నాడు. కొంచెం సేపయిన తర్వాత యింకొక సేవకుడు వచ్చి "అయ్యా! మీ కుమారులు, కుమార్తెలు విందులో వుండగా పెద్ద సుడిగాలి
వచ్చింది. వాళ్ళు వున్న యిల్లు కూలిపోయింది. అందరు చనిపోయారు" అని చెప్పాడు. ఈ సంగతులు విన్న యోబు లేచి తన పైవస్త్రం చింపుకొన్నాడు.
తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల పై సాష్టాంగపడి నమస్కారము చేసి ఇలా అన్నాడు “నేను నా తల్లి గర్భమునుండి దిగంబరిగా ఈ లోకంలోనికి వచ్చాను.
దిగంబరిగానే ఈ లోకంనుండి వెళ్ళిపోతాను. నాకు వున్న సమస్తము ! యెహోవా యిచ్చినవే. యెహోవా యిచ్చాడు. యెహోవా తీసికొన్నాడు. ఆయన
నామమునకు స్తుతి కలుగును గాక."అని అన్నాడు
ఒకదినము దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చారు. అపవాదికూడా వారితో పాటు వచ్చాడు. అతనితో దేవుడు “నా సేవకుడైన యోబు తన పిల్లలను, సమస్త సంపదలను పొగొట్టుకొన్నా నన్ను నిందించలేదు. నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు. నాయందు స్థిరంగా వున్నాడు. నీవు అనవసరంగా అతనిని కష్ట పెట్టావుసుమా" అన్నాడు. అందుకు అపవాది “నీవు అతని శరీరాన్ని కాపాడినావు. శరీరాన్ని, ఎముకలను రోగాలకు గురిచేస్తే అతడు తప్పకుండా నిన్ను దూషించి, వదిలి పెడతాడు” అని జవాబు చెప్పాడు. అందుకు దేవుడు “నీవు యోబు ప్రాణం తప్ప, అతని శరీరాన్ని నీ యిష్టం వచ్చినట్లు
బాధ పెట్టవచ్చును” అని చెప్పాడు. అపవాది యోబు దగ్గరికి వెళ్లాడు. అతని శరీరాన్ని అరికాలు మొదలుకొని తలవరకు కురుపులతో బాధ పెట్టాడు. యోబు కురుపుల బాధ భరించలేక, ఒళ్ళు గోకుకొనడానికి ఒక చిల్ల పెంకు తీసికొన్నాడు.
బూడిదలో కూర్చున్నాడు. అతని శరీరమంతా పుండ్లతో అసహ్యంగా, చూసేవారికి భయంకరంగా వుంది. అతని దగ్గరికి ఎవరూ రావడంలేదు. అతన్ని
ఎవరూ గుర్తుపట్టలేకున్నారు. యోబు ఒంటరిగా మూలుగుతూ, రోధిస్తూ, బాధపడుతూ రోజులు గడుపుతున్నాడు.
యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి యిలా అన్నది. "దేవుడే నిన్ను యిలా కష్టాలపాలు చేశాడు. యింకా ఎందుకు ఆయనను నమ్ముకొని జీవిస్తాను.
దేవుణ్ణి తిట్టి, ప్రశాంతంగా చనిపోవడమే మంచిది.” అందుకు యోబు తన
భార్యతో “మూర్జురాలివలె మాట్లాడుతున్నావు. దేవుడు మనకు సుఖ సంపదలు
యిచ్చినప్పుడు మనము సంతోషించాము. ఆయన మంచివాడని పొగిడాము.
యిప్పుడు కష్టాలు రాగానే ఆయనను తిట్టుకోవటం మంచిది కాదు. మనము
కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి” అన్నాడు.
యోబు స్నేహితులైన ఎలీఫజు, బిల్టదు, జోఫరు అనువారు యోబును
ఓదార్చడానికి వచ్చారు. అతని దీన పరిస్థితిని చూసి చాలా చింతించారు. తల పై దూళి చల్లుకొని పెద్దగా ఏడ్చారు. ఏడు దినములు అతనితో కూడ
నేలమీద కూర్చొన్నారు. దేవుడే యోబును కష్టాలపాలు చేశాడని చెప్పారు. దేవుణ్ణి వదిలి పెట్టమని సలహా ఇచ్చారు. అయినా యోబు దేవుని దూషించలేదు. తన యదార్ధ ప్రవర్తనను విడిచి పెట్టలేదు. ఏ విషయంలోను పాపం చేయలేదు. నీతి మార్గాన్ని త్యజించలేదు. యోబు భక్తితో దేవుని ప్రార్ధించాడు. తన కష్టాలను, బాధను తొలగించమని దేవుని వేడుకొన్నాడు. దేవుడు యోబును ఆశీర్వదించాడు. పూర్వము వున్న సంపదకు రెండు రెట్లు సంపదను యిచ్చాడు. సంతానాన్ని
కూడ యిచ్చాడు. అతనికి మరల ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు. యోబు కుమార్తెల వంటి సౌందర్యముగల స్త్రీలు ఆ దేశంలోనే లేరు. దేవుడు యోబుకు 14వేల గొర్రెలను, ఆరువేల ఒంటెలను, వెయ్యి జతల ఎడ్లను, వెయ్యి ఆడు గాడిదలను యిచ్చాడు. యోబు స్నేహితులు బంధువులు వచ్చి అతనితో కలిసి విందు ఆరగించారు. తరువాత యోబు 140 సం||లు
బ్రతికి నాలుగు తరముల సంతానాన్ని చూశాడు.
ధ్యానాంశములు :
1. యోబు జీవితం మనకు గొప్ప మాదిరిని చూపిస్తున్నది. సుఖాలను, కష్టాలను సమానంగా భావించాలనీ, కష్ట సమయాల్లో కూడ దేవుని నిందించరాదనీ, నిరీక్షణతో జీవించాలనీ, తెలుపుతున్నది.
2. కష్టాలు సదాకాలము వుండవు. దేవుడు కృపామయుడు. తన భక్తులను తప్పకుండా కాపాడుతాడు. అనే విషయం యోబు జీవితం ద్వారా
తెలిసికొనగలము.
3. బైబిలులో యోబు చాల ప్రాధాన్యత గల గ్రంథము. ఈ గ్రంథంలో మరణ, పునరుత్థానములను గురించిన వచనాలు వున్నవి.
4. యోబు అన్ని పరిస్థితులలో దేవుని యందు నమ్మకముంచాడు. విశ్వాసం నుండి తొలగిపోలేదు.
బంగారు వాక్యము :
యోబు యదార్ధవర్తనుడు, న్యాయవంతుడునై, దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు.
యోబు 1:8.

No comments:

Post a Comment