పేరు:
హీబ్రూ భాష నుండి “పరమగీతం” అని అనువదించిన మాటలకు అక్షరాల చెప్పుకోవలసిన అర్థం “గీతాలకు గీతం” లేక “గీతాలన్నిటిలో శ్రేష్ఠమైన గీతం” అని.
రచయిత:
1:1 వచనాన్ని బట్టి రచయిత సొలొమోను అని చెప్పవచ్చు. అయినా “సొలొమోను రచించిన” అని అనువదించిన హీబ్రూ మాటలను “సొలొమోను గురించి” లేక “సొలొమోను కోసం” అని కూడా అనువదించవచ్చు. ఇక్కడ వాడిన హీబ్రూ మాటలు స్పష్టమైన అర్థాన్ని ఇవ్వడం లేదు గనుక ఎవరు రచించారో ఖచ్చితంగా చెప్పడానికి వీలుపడదు.
వ్రాసిన కాలం:
బహుశా సొలొమోను ఏలుబడి కాలంలో ఎప్పుడో రాసి ఉండాలి.
ముఖ్యాంశం:
ఈ పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించినవారు ముఖ్యాంశ విషయంలో గాని, కథలోని ముఖ్య పాత్రధారుల విషయంలో గాని ఏకీభవించడం లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పుస్తకం రాజైన సొలొమోనుకూ అతని వధువుకూ మధ్యనున్న ప్రేమను గీతం రూపంలో చిత్రించిన వర్ణన మాత్రమే. మరికొందరు ఆధునిక వ్యాఖ్యానకర్తలు ఇలా అంటున్నారు – ఈ పుస్తకంలోని ప్రేమకథ పేరు తెలియని ఒక కాపరికీ అతని వధువుకూ మధ్యనున్న ప్రేమను గురించి తెలియజేస్తున్నది. సొలొమోనురాజు దుష్టుని పాత్ర వహించి కాపరి వధువును తాను ఉంచుకోవడానికి ఎత్తుకుపోవాలని ప్రయత్నించాడు (ఈ వ్యాఖ్యానం సమంజసంగా లేదు). మరికొందరైతే ఈ పుస్తకం అలంకారిక రీతిలో దేవునికీ విశ్వాసులకూ మధ్యనున్న ప్రేమను చిత్రించినది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొందరైతే ఈ పుస్తకానికి ఇదే ముఖ్యాంశం అంటున్నారు. ఈ వ్యాఖ్యాత ఈ ప్రేమ కథలోని ప్రధాన పాత్రధారులు సొలొమోనురాజు, అతని వధువు అని నమ్ముతున్నాడు. అంతేగాక ఈ కథలో సాదృశ్య రూపంలో ఆత్మ సంబంధంగా అనేక అంతరార్థాలు ఉన్నాయనీ అలంకార రీతిలో రారాజైన యేసుక్రీస్తుకూ, ఆయన సంఘం, లేక విశ్వాసులైన వ్యక్తులకూ మధ్యనున్న ప్రేమను వివరిస్తున్నదనీ కూడా నమ్ముతున్నాడు. ఇలా నమ్మడానికి గల కారణాలు ఇవి:
లేఖనాలలోని ఇతర భాగాలన్నిటిలాగానే ఈ పుస్తకం పేరు కూడా దైవావేశం వల్ల కలిగినదే. పవిత్రాత్మ దేవుడే దీనిని “పరమ” గీతం – అంటే గీతాలన్నిటిలో ఉత్తమమైనది, సర్వశ్రేష్ఠమైనది (దీని హీబ్రూ పేరుకు అర్థం ఇదే) అని అంటున్నాడంటే అలా అనడానికి తగిన కారణాలు తప్పక ఉండాలి. అది కేవలం సొలొమోనుకూ, అతని వధువుకూ మధ్యనున్న ప్రేమకథను వివరించేదే అయితే దానిని సర్వశ్రేష్ఠమైన గీతం అని ఎలా అనగలం? అలా అనుకుంటే ఇది ఇస్రాయేల్‌లో అతి మధుర కవి దావీదు రచించిన గీతాల కంటే సర్వశ్రేష్ఠమైనదా? అది కీర్తన 22 లేక 45 లేక 69 లేక 119 మొదలైనవాటికంటే శ్రేష్ఠమైనదా? క్రీస్తే దానిలో లేకుంటే అది గీతాలన్నిట్లోకీ శ్రేష్ఠమైనది కాగలదా?
కొన్ని లేఖనాలు దేవునికీ ఆయన ప్రజలకూ మధ్యనున్న సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంతో పోల్చి చెపుతున్నాయి. కీర్తన 45; యెషయా 54:5; యిర్మీయా 3:14; 31:32; యెహె 16; 23 అధ్యాయాలు; హోషేయ 2:7, 16 మొదలైనవి; మత్తయి 22:1-2; రోమ్ 7:4; 2 కొరింతు 11:2; ఎఫెసు 5:25-32; ప్రకటన 19:6-9 చూడండి. దేవుణ్ణి ఇస్రాయేల్ జాతికి భర్తగానూ క్రీస్తును సంఘానికి వరునిగానూ అభివర్ణిస్తూ ఉంటే బైబిలులోని ఒక పుస్తకం క్రీస్తుకూ ఆయన సంఘానికి మధ్యనున్న ప్రేమను గురించి మానవ పరిభాషలో రాసివుండడం ఆశ్చర్యమేమీ కాదు. ఇలాంటి ప్రేమ క్రీస్తుకు ఆయన ప్రజలకు మధ్య ఉండాలి, ఉంది. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసే సందర్భంలో పైన తెలిపిన వాక్యభాగాలను పఠించాలి. అవి బైబిలులోని శ్రేష్ఠమైన అంశాల్లో ఒకదాన్ని వెల్లడి చేస్తాయి.
భౌతికమైనవాటిలో ఆధ్యాత్మిక భావాలున్న వేరు వేరు అంశాలు బైబిలులో కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని అంశాలను గమనించండి – సన్నిధి గుడారం, యాజులు, బలియాగాలు, ఇంకా నిర్గమకాండం, లేవీయకాండం గ్రంథాల్లో ఇలాంటి విషయాలపై ఇచ్చిన నోట్స్‌ను చూడండి. ఆ విషయాలు అక్షరాలా వాస్తవమైనవే గాని వేరే అంతరార్థం కూడా వాటికి ఉంది. అవి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలకు సూచనలు, నీడలు. శారా, హాగరుల కథ అలంకార రూపకంగా చెప్పబడినదని పౌలు అంటున్నాడు (గలతీ 4:21-27)! శారా, హాగరు చరిత్రలో అలంకార రూపంలో ఆధ్యాత్మిక సత్యం దాగివున్నప్పుడు అదేరీతిగా ఈ గీతంలో కూడా ఆధ్యాత్మిక భావం అంతర్గతంగా దాగి ఉందని భావించవచ్చు గదా. శారా, హాగరు చరిత్రలో వాళ్ళిద్దరూ అక్షరాలా వాస్తవంగా జీవించిన వ్యక్తులే. అదే రీతిగా ఈ గీతంలో సూచించిన వధూవరులు వాస్తవంగా జీవించారన్న దానిని మనం కాదనడం లేదు. సొలొమోనురాజు, షూనేము యువతి నిజంగా జీవించిన వ్యక్తులే. అయినా ఇది పరలోక సంబంధమైన ప్రేమను గురించి సాదృశ్య రూపంలో వివరిస్తున్న ఒక ఉదాహరణ. చూడగల కన్నులున్నవారు అంతర్గతంగా దీనిలో దాగిన ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించగలుగుతారు. లూకా 24:27; 2 తిమోతి 3:16-17లోని విషయాలను గమనించండి. పాత ఒడంబడికలో అన్నిచోట్లా క్రీస్తు ఉన్నాడని ఈ ఒక్క పుస్తకంలో మాత్రం లేడని అనగలమా? ప్రతి చోటా ఆయన్ను చూడడానికి ప్రయత్నించి, ఈ గీతంలో మాత్రం ఆయన్ను చూడకుండా ఉండడానికి ప్రయత్నించాలా? ఈ పుస్తకంలో క్రీస్తు లేకుంటే, ఆత్మ సంబంధం, పరసంబంధం అయిన పాఠాలు దీనిలో లేకుంటే దేవుని మనుషులు (ముఖ్యంగా పెండ్లి కానివారు) “సంసిద్ధులుగా ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థులై” ఉండడానికి ఈ గీతం ఎలా సహాయపడగలదు?
ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలకు, సన్నివేశాలకు తప్పక ఆత్మ సంబంధమైన అర్థం లేక అలంకార రూపంలో దాగి ఉన్న భావం ఉంటుందని గుర్తించాలి. అక్షరాల సొలొమోనురాజు యొక్క వధువు రాత్రిపూట ఒంటరిగా అతన్ని వెతుక్కుంటూ వీధులలో తిరుగులాడే విషయాన్ని ఊహించుకోవడం కష్టం (3:2-4). ఆమె అలా తిరుగుతున్నప్పుడు కావలివారు ఆమెను కొట్టి ఆమె ముసుగు తీసుకుపోవడం కూడా ఊహించలేము (5:6-7). ఆమె అక్షరాలా సొలొమోను మీద ఆనుకొని ఎడారి మార్గంలో వచ్చిందంటే కూడా ఊహించడం కష్టమే (8:5). క్రీస్తుకు పూర్వమూ తరువాతా కూడా ఉన్న భక్తిపరులైన వ్యాఖ్యాతలు ఈ పుస్తకాన్ని అలంకార రూపంలో ఉన్నవాటిని వివరించడం అనే పద్ధతిని శతాబ్దాలుగా వాడుతూ వచ్చారు. ఇది యెహోవాకూ ఇస్రాయేల్‌కూ మధ్యనున్న సంబంధాన్ని వర్ణిస్తున్నదని యూదులూ, క్రీస్తుకూ తన సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని వర్ణిస్తున్నదని క్రైస్తవులూ భావిస్తూ వచ్చారు. అందుచేత ఈ వివరణ పద్ధతి మనం కల్పించినది కాదు, లేక ఇటీవల వాడుకలోకి వచ్చినదేమీ కాదు.
పైన తెలిపిన కారణాలు తృప్తికరంగా లేవు అని పాఠకులు భావిస్తే వాటిని తిరస్కరించవచ్చు. ఈ గీతాన్ని కేవలం మానవ ప్రేమ స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మన ఉద్దేశాల్లో, లేఖన వివరణల్లో తప్పక లోపాలుంటాయి. పవిత్రాత్మ ఇచ్చే సహాయంతో ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసినప్పుడు క్రీస్తు తన విశ్వాసులను ఎలా ప్రేమిస్తాడు, వారు ఆయన్ను ఎలా ప్రేమించాలి అనేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలౌతుంది. అంతేగాక ఈ పుస్తకం విషయంలో అనుభవం అనేది సాటిలేని బోధకుడని మా అభిప్రాయం. క్రీస్తు ప్రేమను ఎరిగినవారు మాత్రమే దీనిలో ఏమున్నదో తెలుసుకోగలరు. ఈ పుస్తకమంతా ప్రేమను గురించే. దీనిలోని అంశాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.
విషయసూచిక
మాటల్లో వెల్లడి అయిన ప్రేమ 1:2-4
ఆందోళన చెందిన ప్రేమ 1:5-7
కలయికలోని ప్రేమ 1:9—2:7
ఎదురు చూచి, ఆహ్వానాన్ని పొందిన ప్రేమ 2:8—3:1
పరీక్షకు లోనై నిరూపణ అయిన ప్రేమ 3:1-5
శోభాయమానమైన రీతిలో వ్యక్తపరచిన ప్రేమ 3:6-11
ప్రియురాలిలో ప్రియుని ఆనందం 4:1-16
ప్రేమలోని తృప్తి 5:1
బలహీనపడి బలం తిరిగి పుంజుకున్న ప్రేమ 5:2-8
ప్రియుణ్ణి ప్రశంసించిన ప్రేమ 5:8-16
నిబ్బరం గలిగిన ప్రేమ 6:1-3
ప్రియురాలి సౌందర్యాన్ని పొగిడే ప్రేమ 6:4-12
ప్రేమను వెల్లడించే సంభాషణ 7:1—8:4
ప్రేమకున్న బలం 8:6-7
ప్రేమ ఆలోచనలు 8:8-12
ప్రేమ అభిలాష 8:13-14
(నోట్: పరమగీతంలో మాట్లాడుతున్నది ఎవరో ఆమెను లేక ఆయనను లేక చెలికత్తెలను సూచించేందుకు అనువాదకులు అక్కడక్కడ హెడింగ్స్ ఉంచారు అవి మూలభాష హీబ్రూలో లేవు).
No comments:
Post a Comment