సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 54: 10
ప్రియులారా మోషే భక్తిని ద్వారా యూదులకు అనుగ్రహింపడిన ధర్మశాస్త్రము వారి పాయములకు సంపూర్ణ విమోచనను కలిగించలేక పోయెను కానీ అది పాపమును గూర్చిన నియమములను వారికీ తెలియజేసెను. వారు చేసిన పాపముల విషయమై అనేక బలులు అర్పించుచు వచ్చిరి. అయితే యేసయ్య వలన మనకు కల్గినరక్షణ సంపూర్ణముగా మనలను పాపము నుండి రక్షించేదిగా ఉండెను ఆయన కలువరిలో కార్చిన రక్తము వలన నూతన నిబంధన మనకు కలిగెను అది ధర్మశాస్త్రము వంటిది కాదు గాని ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చేదిగా ఉండెను ఈ నూతన నిబంధన వలన దేవుడు ప్రేమ, జాలి కృప మనకు అనుగ్రహింపబడెను.
ఇందును గూర్చి దేవుని వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తోంది
4.భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
5.నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
6.నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.
7.నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను
8.మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
9.నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
10.పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
11.ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును
12.మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును.
13.నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
14.నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర ముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు
ప్రియులారా దేవుడు మనము చేసిన తప్పులకు శిక్షను ఇచ్చుటకు ఇష్టపడుట లేడు గాని ఆయన మనపైజాలిని చూపి సంపూర్ణ మారు మనస్సు కలవారిగా మనలను మార్చుటకే ఇష్టపడ్తున్నాడు.
మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమ కలిగిజీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకే యేసయ్య ను మననిమిత్తం సిలువ శ్రమలకు అప్పగించాడు. ఇందును గూర్చి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది.
5.మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
6.మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అని
ప్రియులారా మనం దేవుని ప్రేమను రుచి చూచి ఆ ప్రేమలోఉండుటకు ప్రయాసపడుదాం. మన అతిక్రమములను క్షమిచి మన పట్ల జాలి చూపు దేవుడు మనలను ఎన్నడును తృణీకరించడని
గ్రహించి ఆయన ప్రేమలో నిలిచి యుండుటకు
ప్రతీ క్షణం ఆయనతో సహవాసం చేయువారమైయుందాం
ఈ వాక్యం దేవుడు మన పట్ల జాలిగలవాడై యున్నాడని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం చేయువారమై యుందాం
దేవుని కాపుదల మనకు తోడై యుండి ప్రతి క్షణం మనలను ఆయన ప్రేమ మార్గములో నడిపించును గాక. ఆమెన్
No comments:
Post a Comment