Breaking

Thursday, 6 May 2021

జాన్ బన్యన్ biography

 



పూర్తి పేరు: జాన్ బన్యన్


జన్మస్థలం: ఇంగ్లాండ్ లోని బెడ్ ఫోర్ట్


తల్లిదండ్రులు: మార్గరెట్ బెంబ్లీ, థామస్ బన్యన్


భార్య పేరు: మేరీ


జననం: 1628 నవంబరు


మరణం: 1688 ఆగష్టు 31


రక్షణానుభవం: 25 సం॥ల వయస్సులో

సేవా ఫలితం: బైబిలు తరువాత బహుగా ప్రసిద్ధి నొందిన 'యాత్రికుని ప్రయాణము' అనే పుస్తకమును

రచించెను.




జాన్ బన్యన్ ఇంగ్లండ్ లోని బెడ్ లో నవంబరు 1628 వ సంవత్సరమున జన్మించెను. వారిది పేద కుటుంబము. అతని తండ్రి పేరు థామస్ జాన్, అతను పాత్రలు పోతపోయు కమ్మరి పనిచేసెడివాడు.

జాన్ బన్యన్ చిన్నప్పటి నుండి చాలా

అల్లరి చిల్లరిగా తిరుగుచు అబద్దములకు, దొంగతనములకు అలవాటయ్యెను.

ఎక్కువ విద్యాభ్యాసము చేయలేదు గాని, చదవను, వ్రాయను మాత్రము నేర్చుకొనెను. 1644 లో ఆయన తల్లి మరణించెను. ఆ తరువాత ఒక నెలలోనే

తన సహోదరి మార్గరెట్ చనిపోయెను. వారి మరణం తర్వాత అతని తండ్రి తిరిగి వివాహం చేసుకొనెను. తల్లి, చెల్లి మరణ వేదన; తండ్రి వలన ఆదరణ

లేకపోవుటే గాక సవతి తల్లి వలన శ్రమలు- ఇవన్నీ, జాన్ బన్యను దేవుని దూషించువానిగా చేసెను.

తన గృహములోను, హృదయములోను ఎటువంటి సమాధానము లేనందున సైన్యములో చేరి 2 సంవత్సరములు సైనికునిగా పనిచేసెను. సైన్యములో

ఉండగా ఒకసారి అతనికి నియమించబడిన డ్యూటీ మరియొకనికి నియమించినందున

జాన్ స్థలములో ఉండిన వ్యక్తి యుద్ధములో మరణించెను. దేవుడే ఏదో ఉద్దేశ్యముతో మరణము నుండి తనను తప్పించెనని గ్రహించెను. సైన్యము నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు తన తండ్రి వృత్తియైన పాత్రలకు మాట్లు వేసి బాగుచేయు పనిని ప్రారంభించెను. ఆ తర్వాత మేరీ అను ఒక భక్తి కలిగిన పేద స్త్రీని వివాహం చేసుకొని పేదరికంలో ఉండెను. క్రమముగా తన భార్యతో దేవాలయమునకు వెళ్ళేవాడు. అయినను తన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలేక ఎల్లప్పుడు పాపపు తీర్పును గురించిన భయంతో జీవించుచుండెను. పుస్తకములను

ఎక్కువగా చదివి తర్కిస్తుండేవాడు. అయితే ఈలోగా కొందరు స్త్రీలు అయనకు రక్షణను గురించి తెలియజేసి “గిఫోర్డ్" అనే పాదిరిగారికి పరిచయం చేసిరి. ఆయన సువార్తను వివరంగా బోధించి కృప ద్వారా వచ్చిన రక్షణను గురించి తెలియజేయగా “బన్యన్" తాను క్షమించలేనన్ని పాపములు చేసితినని పశ్చాత్తాపపడి పాపములొప్పుకొని మారుమనస్సు పొందెను. మారుమనస్సు పొందిన తర్వాత కూడా ఆయనకు కష్టములు వచ్చెను. అయితే మునుపటివలె దేవుని దూషింపక, దుఃఖములో కూడా దేవుని పట్టుకొనెను. ఆయనకు అంధురాలైన కుమార్తె జన్మించినప్పటికీ, ఆ తరువాత కొద్ది కాలములోనే ఆయన భార్య మరణించినప్పటికీ, దేవునిపై నున్న విశ్వాసమును వీడక క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచుండెను. ఆ దినములలో ఇంగ్లాండ్ దేశములో అభిషేకించబడిన వారు తప్ప

మరెవ్వరూ ప్రసంగించకూడదనే చట్టముండెడిది. అట్టివారు శిక్షించబడుదురు. అటువంటి చట్టమున్నదని జాన్ ఎరిగినప్పటికి "సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ” అని, మనుష్యుల కంటె దేవునికి విధేయులగుట మేలని

ధైర్యముతో ప్రసంగించెను. ఆయన ప్రసంగములు బలమైనవిగా ఉన్నందువలన గుంపులు గుంపులుగా

జనులు ఆయన చెప్పు వాక్యం వినుటకు వచ్చుచుండిరి. బన్యన్ చిన్న బిడ్డవలె

దేవునిపై ఆధారపడుచు, దేవుని హృదయము నుండి వచ్చిన మాటలను ప్రజలకు బోధించుచుండెను. ఆయన గృహములలోను, బహిరంగముగాను ప్రసంగించుచుండెను. అందుకై ఆయనను బంధించి చెరసాలలో ఉంచిరి. మరెన్నడు ప్రసంగించనని ప్రమాణము చేసిన యెడల విడుదల చేయుదుమని చెప్పిరి. కాని ఆ విధముగా ప్రమాణం చేయుటకు జాన్ నిరాకరించెను. పైగా ఈ దినము విడుదల చేసిన యెడల మరల రేపు ప్రసంగించెదను అనెను. మరియు దేవునికి అవిధేయుడగుట కంటె చెరసాలలోనే నా కండ్లపై నాచు పెరుగుపరకు చెరసాలలోనే

ఉంటాను అనెడివాడు! అందుకై అతనికి శిక్ష 12 సంవత్సరములకు పొడిగించబడెను. ఆ జైలు

ఎంతో మురికిగాను, చీకటిగాను ఉన్నప్పటికీ, జైల్లో ఉన్న వారికి సువార్తను బోధించుచూ, వారితో ప్రార్ధించెను. ఆ 12 సంవత్సరములు తన సమయమును ఏ మాత్రము వ్యర్ధ పరచుకొనక ప్రతి నిమిషము ప్రార్ధనలోను, ధ్యానములోను గడిపెను. ప్రపంచములో గొప్ప పేరు పొందిన "యాత్రికుని ప్రయాణం" అను పుస్తకమును జైలులో వ్రాసెను. అనేక సంవత్సరములుగా ఉన్న ఆయన ఆశ నెరవేరెను. నాశనపురము నుండి పరలోకపురమునకు ఒక యాత్రికుని ప్రయాణములో గల శోధనలను, శ్రమలను,

జయములను చక్కగా వివరించెను. ఆ పుస్తకము 100 కంటే ఎక్కువ భాషలలో తర్జుమా చేయబడెను.

జాన్ తన 43 వ సంవత్సరములో జైలు నుండి విడుదల పొందెను. ఆ తరువాత “పరిశుద్ధ

యుద్ధం" అను మరొక గొప్ప పుస్తకమును వ్రాసెను.

తర్వాత “బెడ్ ఫోర్ట్ " లోని బాప్టిస్ట్ సంఘమునకు పాదిరిగా పని చేసి అనేక ఆత్మలను సంపాదించెను. అతని మరణ సమయానికి మరో ఆరు పుస్తకములను వ్రాసి ప్రింట్ చేసెను. మరి 16 పుస్తకములు ప్రింటు చేయుట కొరకు సిద్ధపరచెను. 1688 వ సంవత్సరములో ఆగస్టు 31వ తేదీన ప్రభువు

నందు నిద్రించెను ఈ కల్వరి యోధుడు!




No comments:

Post a Comment