Breaking

Saturday, 20 March 2021

ప్రార్ధన ఎలా చేయాలి


ప్రార్ధన అనగా దేవునితో సంభాషణ 

మన బావాలు మన ఆలోచనలు మన బాధలు మన భయాలు ఆయనతో పంచుకోవడమే ప్రార్ధన 

ఈరోజు ప్రార్ధన ఎలా చేయాలో తెలియక 

ప్రార్ధనలకు జవాబులు ఎలా పొందాలో అర్థం కాక 

ప్రార్ధన పట్ల ఆసక్తిని కోల్పోయిన వారు 

ప్రార్ధనను నిర్లక్ష్యం చేసేవారు లేకపోలేదు 

ఇంతకీ మనం ఎలా ప్రార్ధిస్తే దేవుడు వింటాడు 

దేవుడు మన ప్రార్ధన విన్నాడని మనకు ఎలా తెలుస్తుంది ఏ సమయములో మనము ప్రార్ధిస్తే దేవుడు వింటాడు 

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈరోజు జవాబులు  చూద్దాం 


మొదటగా మనము ఎలా ప్రార్ధన చేయాలి 

శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా ప్రార్ధన ఎలా చేయాలో మాకు నేర్పమని ఆయనను అడిగారు 

అందుకు యేసయ్య మనము ఎలా ప్రార్ధించాలో 

మన ప్రార్ధనలో ఉండవలసిన అంశాలేంటో స్పష్టంగా తెలియజేసాడు 

యేసయ్య నేర్పిన ఈ ప్రార్ధన మనము ఎలా ప్రార్ధించాలి అనే దానికి ఒక గొప్ప నమూనా లాంటిది 

మొదటగా మనం ఎవరికి ప్రార్ధించాలి 

పరలోకమందున్న తండ్రికి 

అందుకే పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించాడు 

తండ్రికి మనము ప్రార్ధించినప్పుడు కుమారుని బట్టి తండ్రి మన ప్రార్ధనలకు జవాబులు అనుగ్రహిస్తాడు 

వాస్తవంగా మనము దేవునికి ప్రార్ధించడానికి గాని 

దేవుని దగ్గర్నుండి జవాబులు పొందడానికి గాని ఎటువంటి అర్హత లేనివారమే అయితే యేసుక్రీస్తును బట్టి మనము తండ్రి సన్నిధికి ధైర్యముగా చేరగలుగుతున్నాము తండ్రి అని అయనను పిలువగలుగుతున్నాము 

కుమారుని నామమును బట్టి మనము ప్రార్ధించినప్పుడు కుమారుని బట్టి తండ్రి మన ప్రార్ధనలకు జవాబిచ్చుటకు ఇష్టపడువాడై యున్నాడు 


ఆయన నామం అన్ని నామముల కన్నా పై నామం 

ఆ నామం పరిశుద్ధపరచబడాలని అనేకులు ఆ నామాన్ని బట్టి ప్రార్ధించి అయనిచ్చే రక్షణను పొందుకోవాలని రెండవదిగా మనం ప్రార్ధించవలసిన వారమైయున్నాము 

యేసుక్రీస్తు మనుషులందరి కొరకు సిలువలో తన రక్తము కార్చి తన ప్రాణాలర్పించాడు 

మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు 

ఎవరైతే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని విశ్వసిస్తారో

ఎవరైతే ఆయన నామమును బట్టి ప్రార్ధిస్తారో వారు రక్షింపబడతారు గనుక ఆయన నామము ప్రతీ చోట ప్రకటింపబడాలని ఆయన నామాన్ని బట్టి ప్రార్ధించి అనేకులు రక్షింపబడాలని మనము ప్రార్ధించువారమైయుందాం


మూడవదిగా దేవుని రాజ్యం రావాలని అనేకులు ఆ రాజ్యంలో వారసులుగా ఉండాలని యుగయుగాలు దేవునితో పాటు నివసించాలని 

ఆయన రాజ్యమును గూర్చి మనము ప్రార్ధించవలసిన వారమై యున్నాము 

ఈ లోకము తాత్కాలికమైనది ఈ లోకములో మనము యాత్రికులముగా జీవిస్తున్నాము ఏదో ఒక రోజు ఈ లోక యాత్రను ముగించి మనము వెళ్లిపోవాల్సిందే 

అయితే మనము ఎక్కడికి వెళ్తామనేదే అతి ప్రాముక్యమై యున్నది 

ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని దేవుని మార్గములో నడుస్తూ దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నట్లయితే అతడు దేవుని రాజ్యములో ఉంటాడు 

అలా కాకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకాశాలననుసరించి నడుచుకునే వారు శిక్షకు పాత్రులుగా ఉంటారు 

గనుక ఈ లోకములో దేవుని రాజ్యం కట్టబడటమును  గూర్చి అనేకులు ఆ రాజ్య వారసులవ్వడమును గూర్చి 

మనము ప్రార్ధించవలసినవారమై యున్నాము 



నాల్గవదిగా 

దేవుని చిత్తము పరలోకంలో నెరవేరుచున్నట్లుగా 

భూమి మీద కూడా నెరవేరాలని 

మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఆయన చిత్తం నెరవేరాలని మనము ప్రార్ధించవలసినవారమై యున్నాము 

యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చాడు 

తండ్రి చిత్తానికి సంపూర్ణముగా తనను తాను అప్పగించుకున్నాడు 

మనుషులందరి పాపములను తన మీద వేసుకొని 

మనుషులకు రావాల్సిన శిక్షను మనుషుల స్థానములో ఆయన భరించాడు ఇప్పుడు ఏ ఒక్కరు శిక్షను పొందాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే చాలు వారు శిక్ష నుండి తప్పించబడుతారు ప్రతి ఒక్కరు రక్షించబడి శిక్ష నుండి తప్పించుకోవడమే తండ్రి చిత్తమై యున్నది గనుక ఆయన చిత్తము ఈ లోకములో నెరవేరాలని ప్రతి ఒక్కరు రక్షించబడాలని మనము ప్రార్ధించవలసినవారమై యున్నాము 


ఐదవదిగా 

మనకు కావాల్సిన ప్రతి అవసరతను అక్కరను 

ఆయనతొ చెప్పుకొని అవి తీర్చమని ఆయనను అడగవలసినవారమై యున్నాము 

దేవుడు మన ప్రతి అవసరతను అక్కరను తీర్చుటకు చాలిన వాడు 

ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు మనము విశ్వాసముతొ అడిగితే అద్భుతకార్యములు చేయుటకు ఆయన ఇష్టపడువాడై యున్నాము 

మోషే ప్రార్ధించినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపి అద్భుతరీతిగా తన ప్రజలను పోషించాడు 

యెహోషువ ప్రార్ధించినప్పుడు సూర్య చంద్రులను సైతం ఒక నాడెళ్ల నిలిపివేశాడు 

మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మార్పు లేనివాడు 

విశ్వాసముతో మనము ఆయనకు ప్రార్ధిస్తే మన ఉహకందనంత అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించుటకు ఆయన చాలినవాడై యున్నాడు 

గనుక మన ప్రతి సమస్యను ఆయనతొ చెప్పుకొని విశ్వాసముతో ప్రార్ధించి ఆయన దగ్గర్నుండి జవాబులు పొందుకొనువారమై యుందాం 


ఆరవదిగా 

మన ఋణస్థులను మనము క్షమించిన ప్రకారము 

మన రుణములను క్షమించమని క్షమించే గొప్ప మనసు మనము కలిగి యుండులాగున సహాయం చేయమని ఆయనను అడగవలసిన వారమైయున్నాము 

దేవుడు మనము చేసిన ప్రతి పాపాన్ని క్షమించాడు దేవుని క్షమాపణను పొందుకున్న మనము మన చుట్టు ఉన్న వారిని మన సహోదరులను కుడా క్షమించేటటువంటి గొప్ప మనసు కలిగి ఈ లోకములో జీవించాలి 

మనము హృదయపూర్వకంగా మన సహోదరులను 

క్షమించకుండా దేవుని క్షమాపణను మనము ఆశించడంలో ఎటువంటి ఉపయోగం లేదు 

ఒకరోజు పేతురు యేసయ్య దగ్గరికి వచ్చి  

ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.

అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్నది.

అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.

అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కినాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా

ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.

అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను

అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని

వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.

కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.

అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;

నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను.

అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను.

మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.


ప్రియులారా

దేవుడు క్షమించే మనసు కలిగి యున్నట్టుగా ఆయన పిల్లలమైన మనము కుడా క్షమించే మనసు కలిగి యుండాలని ఆశిస్తున్నాడు 

ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన సత్యం దీన్ని పాటించక పోతే మనము ఎదుర్కునే నష్టం కూడా చాలా తీవ్రంగా ఉంటుందనే విషయం గమనించాలి 



ఏడవదిగా 

మనము శోధనలో ప్రవేశించకుండునట్లు దుష్టుని నుండి తప్పించమని 

ప్రతి కీడు నుండి విడిపించమని ఆయనను

అడగవలసిన వారమైయున్నాము 

ఈ లోకములో మనము నివసిస్తున్నప్పుడు 

ఎన్నో శోధనల గుండా శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది 

అయితే మనము ఆ శోధనల్లో శ్రమల్లో చిక్కిపోకుండా 

సాతాను చేతికి దొరకకుండా దేవుని కాపుదల కోసం ప్రార్ధించవలసినవారమై యున్నాము 

దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో మనలను 

దాచుటకు ఏ అపాయము సంభవించకుండా మనలను కాపాడుటకు చాలినవాడై యున్నాడు 

దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు 

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.

నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.అని 

ప్రియులారా

మనము దేవునికి చెందిన వారమైతే మన చుట్టు పరిస్థితులు ఎలా ఉన్న ఎలాంటి ప్రమాదాలు పొంచిఉన్న ఆ దేవుని కాపుదల ఎల్లవేళలా మనుకుంటుంది గనుక మనము బయపడవలసిన 

పని లేదు 

మన ప్రతి పరిస్థితిని ఆయనకప్పగించి విశ్వాసముతో ముందుకు వెలుతూ 

ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉందాం 



మనము ఎలా ప్రార్ధించాలి అనేదానికి యేసయ్య చెప్పిన ఈ ఏడు అంశాలను జ్ఞాపకము చేసుకొని 

ప్రతీ రోజు దేవునికి ప్రార్ధించు వారమై యుందాం 



ఎప్పుడైతే మనము చేసిన ప్రార్ధన దేవుడు వింటాడో 

మన ప్రార్ధన దేవుని సన్నిదికి  చేరుతుందో అప్పుడే  మన హృదయములో గొప్ప సమాధానాన్ని నెమ్మదిని  అనుభవిస్తాము మన భారము తొలగించబడిన 

అనుభూతిని పొందుకుంటాము 

ఏ సమయములో మనము ప్రార్ధించిన 

ఏ భంగిమలో మనము ప్రార్ధించిన దేవుడు మన ప్రార్ధన వింటాడు 

మన బాహ్య స్థితిని బట్టి గాని 

మన మాటలలోని కూర్పును బట్టి గాని 

మన స్థాయిని బట్టి గాని కాదుగాని మన హృదయయ యధార్థను బట్టే 

దేవుడు మన ప్రార్ధనలకు జవాబులు అనుగ్రహిస్తాడు 

గనుక యధార్థ  హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరి ఆయనకు ప్రార్ధించువారమై యుందాం 


యేసయ్య నేర్పిన ఈ ప్రార్ధన నమూనాను బట్టి 

మీ ప్రార్ధన జీవితాన్ని కట్టుకుంటారని 

ప్రతీ రోజు దేవునికి ప్రార్ధిస్తారని ఆశిస్తున్నాను 


2 comments: