Breaking

Tuesday, 6 October 2020

జాన్ బన్యన్ John Bunyan


1660వ సం||లో ఇంగ్లాండు రాజైన చార్లెస్-II జాస్ బన్యనును చెరసాలలో బంధించే సమయానికి అతను సజీవుడైన సత్యదేవుని సువార్తను ఎంతో తీవ్రతతో ప్రకటిస్తున్న బోధకునిగా ఉన్నారు. చెరసాలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథము మరియు క్రీస్తు యొక్క

సాక్షులను గురించిన ఒక పుస్తకము మాత్రమే అతని వద్ద ఉన్నాయి. బందీగృహములో అతను గడిపిన పండ్రెండు సంవత్సరముల కాలమును కూడా సద్వినియోగము చేసుకొనిన జాన్ బన్యన్, ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన "ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్" ("యాత్రికుని ప్రయాణం") అనే గొప్ప ఇతిహాసాన్ని వ్రాశారు.


ఉపమానరూపకంగా వ్రాయబడిన ఈ పుస్తకం, పవిత్ర గ్రంథమైన బైబిలు తరువాత నూటికంటే ఎక్కువ భాషలలో ప్రచురింపబడినదై, విస్తృత ప్రేక్షకులచే చదువబడిన రెండవ పుస్తకముగా పరిగణించబడినది. ఈ ఉపమానంలో ప్రధాన పాత్ర అయిన "క్రిస్టియన్"

ప్రతి ఒక్క క్రైస్తవుని పాత్రకు సాదృశ్యంగా నిలుస్తాడు. తన స్వస్థలమైన 'నాశనపురం' (ఈ లోకానికి సాదృశ్యం) అనే పట్టణం నుండి సీయోను శిఖరాగ్రముపై ఉన్న 'శాశ్వత

నగరము'నకు (రానున్న రాజ్యం: పరలోకం) 'క్రిస్టియన్' సాగించిన పయనమే ఈ పుస్తక కథనం. ఎంతోమంది క్రైస్తవులు వారి క్రైస్తవ జీవిత పయనంలో ముందుకు సాగుటకు ఈ పుస్తకం దోహదపడుటయే కాక దేవుని కొరకు నిలబడి మిషనరీలుగా ముందుకు వచ్చుటకు

అనేకమందికి ప్రేరణగా నిలిచింది.


చెరసాల నుండి విడుదల పొందిన తరువాత జాన్ బన్యస్ దేవుని సేవను కొనసాగించారు. బెడ్ ఫోర్డ్ లోను, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలోను అతను గుర్రం మీద ప్రయాణిస్తూ ప్రసంగించేవారు. అతని సేవ ద్వారా అనేకమంది వారి పాపముల కొరకై

పశ్చాత్తాపపడి రక్షణ పొందారు. ఆ ప్రాంతాలలోని ప్రజలు "బిషప్ బన్యన్" అని అతనిని

ఆప్యాయంగా పిలిచేవారు.


ఒక బీద కుటుంబంలో జన్మించిన జాన్ బన్యన్ తన జీవితంలో అధిక శాతం దుష్టత్వంతో కూడిన

ఒక నాస్తికుడిగానే గడిపారు. అటువంటి వ్యక్తినే దేవుడు వాడుకొనగలిగితే, మనలోని ప్రతి ఒక్కరినీ కూడా ఆయన కొరకు గొప్ప కార్యములు చేయుటకు ఎంతో నిశ్చయముగా ఆయన వాడుకొనగలడు. జాన్  బన్యన్ ఒక తగరపు కర్మాగారంలో పనిచేసినప్పటికీ దేవుని కొరకు వజ్రమువలె ప్రకాశించిన వారై ప్రపంచ

నలుమూలల నుండి ప్రశంసలను అందుకున్న వ్యక్తి అయ్యారు. అతను దేవుని చిత్తాన్ని చేయుటకు తన జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి మాత్రమే కాదు గానీ, ఎంతో మందిని దేవుని రాజ్యం వైపుకు నడిపించిన ఆత్మీయ మార్గదర్శకుడు కూడా


ప్రభువా, శ్రమలలో కూడా మీ పనిని నిరాటంకముగా చేయుటకు నన్ను నేను అర్పించుకుంటున్నాను. ఆమేస్!



No comments:

Post a Comment