Breaking

Sunday, 27 September 2020

సెయింట్ క్వెంటిన్ Saint Quentin


ఆది క్రైస్తవ సంఘాలకు చెందిన వారిలో క్వెంటిస్ ఒకరు. అతను దేవుని రాజ్యం పట్ల ఎంతో ఉత్సుకత కలిగినవారై క్రీస్తు కొరకు మరియు సువార్త కొరకు చనిపోవుటకు కూడా సిద్ధ మనస్సు కలిగియున్నవారు. దేవునియందు భయభక్తులు గల కుటుంబంలో జన్మించిన క్వెంటిస్, ఫ్రాన్స్ లోని అమియన్స్ అనే ప్రదేశంలో నివసించారు. తనకున్న అద్భుతాలు చేసే వరం మరియు పవిత్రత కలిగిన జీవితం ద్వారా అనేక వేల మందిని అతను క్రీస్తు వైపుకు నడిపించారు. అంత మాత్రమే కాదు, అనేక మంది విశ్వాసంలో బలపడుటకును, క్రీస్తులో ఎదుగుటకును సహాయం చేశారు మరియు కష్టాలు, శ్రమలలో కూడా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగియుండుటకు వారిని ప్రోత్సహించారు. ఆ రోజులలో అక్కడి ప్రజలను పరిపాలిస్తున్న రివీయోవారస్ క్రైస్తవులను హింసించేవాడు. చాలా మంది క్రైస్తవులు క్రీస్తు కొరకు హతసాక్షులుగా అతని చేతులలో తమ ప్రాణాలను కోల్పోయారు. అటువంటి సమయంలో అమియన్స్ వద్ద చాలా మంది క్రైస్తవులు ఉన్నారని తెలిసికొన్న రియోవారస్ ఆగ్రహించి వారిని పట్టుకొనుటకు అక్కడికి వెళ్ళాడు. తద్ఫలితంగా క్వెంటిస్ కూడా చెరసాలలో బంధించబడ్డారు. అతను సంకెళ్లతో బంధించబడి పదేపదే హింసించబడినప్పటికీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టుటకు తృణీకరించారు. ఆ శ్రమలన్నిటి మధ్యలో కూడా పరమ దేవునికి స్తుతి గీతాలను పాడుతూ గడిపిన క్వెంటిస్ తోటి ఖైదీలను కూడా క్రీస్తు వైపుకు నడిపించగలిగారు. ఆ కారణంగా అతనిని ఒక చట్రముపై పరుండబెట్టి, తీవ్రంగా కొట్టి తిరిగి చెరసాలకు పంపారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ రాత్రి ఒక దేవదూత అతనిని అక్కడ నుండి విడిపించి, నగరంలోకి వెళ్లి ప్రసంగించమని ఆదేశించాడు. ఈ విషయం తెలుసుకున్న రిక్టియోవారస్ తీవ్ర ఆగ్రహంతో ఈ సారి మరింత తీవ్రముగా హింసించాలని క్వెంటిస్ ను తిరిగి పట్టుకున్నాడు. బంధింపబడిన క్వెంటిస్ యొక్క భుజాల నుండి తొడల వరకు వారు ఇనుప కడ్డీలతో గ్రుచ్చి, అతని వేళ్లు మరియు కపాలంలోకి ఇనుప మేకులను దించారు. అయితే, ఈ హింస కొనసాగుతున్నంత పర్యంతం క్వెంటిస్ దేవునిని స్తుతించడం ఆపలేదు. చివరిగా “ప్రభువైన యేసూ, నీ పవిత్ర దయతో నా ప్రాణాత్మలను స్వీకరించుమని నిన్ను వేడుకొంటున్నాను” అని అతను ప్రార్థించుచుండగా శిరచ్ఛేదనం చేయబడ్డారు. అతను చేసిన త్యాగం క్రీస్తు కొరకు జీవించడానికి చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ప్రియమైన వారలారా, మిమ్ములను బట్టి ఎవరైనా క్రీస్తును వెంబడిస్తున్నారా? "ప్రభువా, ఎటువంటి ఉపద్రవాలు కలిగినా మీ ప్రేమను మరువక మిమ్ములనే వెంబడించెదను. ఆమేస్!"

No comments:

Post a Comment