
సువార్త సేవలో దయా హృదయం మరియు ఇతరుల సహాయము కలిగియుండుట ఆవశ్యకము. మనము ఎక్కడైతే ఉన్నామో అక్కడ మన చుట్టూ ఉన్న వారి సహాయము లేకుండా క్రీస్తు సువార్తను ప్రకటించలేము. మనము ఏ ప్రాంతములో అయితే మిషనరీ పని చేస్తున్నామో ఆ ప్రాంతములోని ప్రజల సంస్కృతిని పరిగణలోనికి తీసుకొనుట చాలా ముఖ్యం. అంతేకాక, ఆ ప్రాంతములో కొత్తగా నెలకొంటున్న మార్పులు మరియు మారుతున్న అలవాట్లు, పద్ధతులను
గురుంచి కూడా మనము జాగ్రత్త వహించాలి. మరేవో కొత్త పద్ధతులను వారి మధ్య ప్రవేశపెట్టకుండా
మనము కూడా వారి మధ్యలో వారి వలెనే జీవిస్తూ మన జీవితం మరియు క్రియల ద్వారా క్రీస్తు
ప్రేమను వారికి కనుపరచాలి. ఆ విధంగా తాము వెళ్ళిన ప్రదేశం యొక్క సంస్కృతికి అనుగుణంగా తమను తాము మలుచుకొని దేవుని సేవను చేసిన మిషనరీలలో ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళిన మల్లామో ఒకరు. తన జీవితాన్ని క్రీస్తు సేవ కొరకు అర్పించడంలో ఎంతగానో సంతోషించిన ఆమె ఆఫ్రికా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆ నాగలిపై చేయి
వేసిన తరువాత ఏనాడూ ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. స్వాజిలాండ్ ప్రజలతో చక్కని సహవాసము కలిగియుండి వారి మధ్య సుమారు 54
సంవత్సరాలు ఆమె అవిశ్రాంతంగా దేవుని పనిని చేశారు. 'డోరికా' అనే మరో మహిళ సహాయంతో
ఆమె ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో కూడా సువార్తను అందించగలిగారు. ఆమె దక్షిణాఫ్రికాలో 'బేతేలు మిషస్ స్టేషన్'ను స్థాపించారు. ఆఫ్రికాలోని అధికారులతో ఆమె కలిగియున్న మంచి సహవాసమును బట్టి మిషనరీ పనులలో వారి యొక్క సహాయాన్ని కూడా ఆమె పొందుకోగలిగారు. 65 సంవత్సరాల వయసులో
చురుకుగా చేయుటకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఆమె 'ఇంటింటికీ వాహన పరిచర్య' (హౌస్ వేగస్ మినిస్ట్రీ) ను ప్రారంభించారు. ఆమె ఒక వాహనమును అద్దెకు తీసుకుని ఒక క్రమపద్ధతిలో సువార్త ప్రకటించబడని ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ ప్రయాణించారు. పరిచర్యలో ఆమె ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ దేవుని పనిని చేయుటలో పట్టుదలను ఆమె ఏ మాత్రం విడిచిపెట్టలేదు. ఆమె తన సహచరులతో, సేవలో తనకు తోడ్పాటునందించే వారితో ఎల్లప్పుడూ మంచి సహవాసము కలిగి ఉండేవారు. దేవుని పరిచర్యలో ఆమె యొక్క విజయానికి ఇది ఒక మంచి సాధనమయ్యింది.
ప్రియమైన వారలారా, మీరు ఎవరితో కలిసి పని చేస్తున్నారో వారిని గురించిన వివరములన్నీ మీరు ఎరిగియున్నారా?
"ప్రభువా, నాతో కలిసి పనిచేసేవారితో మంచి సహవాసము కలిగిఉండుట ద్వారా
నేను పనిచేయు స్థలములో మిమ్ములను మహిమపరచెదను. ఆమేస్!"
No comments:
Post a Comment