యేసు క్రీస్తు తన బోధల ద్వారా ఎన్నో సత్యాలను, పరలోక మర్మాలను తెలియజేశాడు. ఆయన ఒకసారి తన శిష్యులకు ఈ కథ చెప్పాడు. మనుష్యుల దృష్టిలో, ఈ లోకం దృష్టిలో మంచివానిగా, గొప్పవానిగా
ఎంచబడినవారు దేవుని దృష్టిలో అల్పులుగా, అసహ్యులుగా కనిపించవచ్చును. కనుక దేవుని దృష్టిలో న్యాయమైన, నీతి యుక్తమైన పనులు చేయవలసినవారమై యున్నాము.
ఒక పట్టణంలో ఒక ధనవంతుడున్నాడు. అతడు ఊదారంగు బట్టలు, ఖరీదైన సన్నపు నార బట్టలు ధరిస్తూ, ఖరీదైన భోజనం తింటూ చాలమంది
దాస దాసీ జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు. ప్రతిదినం సుఖంగా
గడుపుతుండేవాడు. అతని ఇంటిముందే లాజరు అనే పేరుగల నిరు పేద వుండేవాడు. అతడు ధనవంతుడు తింటున్న సమయంలో క్రిందపడే రొట్టె ముక్కలు ఏరుకొని తినాలని ఎంతో ఆశపడుతుండేవాడు. అతని శరీరం గాయాలతో కురుపులతో ఉండేది. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేవి. వాడు ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు.
అయితే ఎవరికీ కష్టము కలిగించలేదు.
లాజరు చనిపోయాడు. అతడు దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము ప్రక్కన వుంచబడ్డాడు. పరలోకంలో పరిశుద్ధుల, విశ్వాసుల సహవాసంతో అతడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ధనవంతుడు కూడ చనిపోయాడు. అతడు
పాతాళలోకంలో (నరకంలో) వుంచబడ్డాడు. అక్కడ ఎన్నో బాధలు భరిస్తూవున్నాడు. అతడు అబ్రహామును ఆనుకోని వున్న లాజరును చూశాడు. అతడు పెద్దగా కేకలు వేస్తూ విశ్వాసులకు తండ్రియైన అబ్రహామును అడుగుతున్నాడు. "తండ్రివైన అబ్రహామా! నేనీ అగ్ని జ్వాలల మధ్య భరించరాని బాధను అనుభవిస్తున్నాను. దప్పికతో నా నాలుక ఎండిపోయింది. కనుక దయచేసి నా పట్ల కనికరము చూపించు. లాజరును పంపి తన వ్రేలి కొనను నీళ్లతో
ముంచి, ఆ నీళ్లలో నా నాలుక తడపమని చెప్పు" అందుకు అబ్రహాము నా కుమారుడా! నీవు భూలోకంలో వున్నప్పుడు అధిక ధనవంతుడవైనందున నీ యిష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. ఎక్కువ సుఖబోగాలు అనుభవించావు. దానికి ఫలితంగా యిప్పుడు కష్టపడుతున్నావు. లాజరు భూలోకంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించి, యిప్పుడు సుఖపడుతున్నాడు. మాకు మీకు మధ్య పెద్ద అఘాతము వున్నది. ఇక్కడి వారు అక్కడికి అక్కడివారు యిక్కడికి వచ్చే వీలు లేదు. ప్రతివాడు తన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు" అన్నాడు.
అప్పుడు ధనవంతుడు ఎంతో బాధపడ్డాడు. తాను దేవుణ్ణి మరచి అక్రమ కార్యాలు చేసినందుకు పశ్చాత్తాప పడ్డాడు. అందుకు అబ్రహామును
దీనంగా యిలా వేడుకొంటున్నాడు. "తండ్రీ నాకు అయిదుగురు సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదని నేనెంతో
ఆశ పడుతున్నాను. దయచేసి లాజరును ఒక్కసారి వారి దగ్గరికి పంపి నీతి క్రియలు చేస్తే కలిగే మహా సంతోషాన్ని గురించి, అక్రమాలు చేస్తే కలుగబోయే
మహా శ్రమలు, బాధలను గురించి తెలియజేయమని చెప్పు”. అందుకు జవాబుగా అబ్రహాము “వారికి మంచి విషయాలు బోధించడానికి అక్కడ మోషేయు, ప్రవక్తలును వున్నారు. వారు అన్ని విషయాలు బోధించి వున్నారు" అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు "తండ్రివైన అబ్రహామా! నీవు ఎంతో కనికరముగల వాడివి. 10 మంది నీతి మంతులు ఉంటే, వారి కోసమైనా సొదొమ, గొమొర్రా పట్టణాలను నాశనం చేయవద్దని దేవుణ్ణి బ్రతిమిలాడిన వాడివి.
కాబట్టి చనిపోయిన వారిలో నుండి ఒకడు (లాజరు వంటివాడు) వారి మధ్యకు వెళ్ళి పరలోకవిషయాలన్నీ వివరిస్తే గాని వాళ్ళు నమ్మరు” అని బ్రతిమిలాడాడు.
అప్పుడు అబ్రహాము “వారు మోషే చెప్పిన మాటలు, ప్రవక్తల హెచ్చరికలు వినలేదు. కనుక చనిపోయిన వారిలో నుండి ఒకడు వెళ్ళి చెప్పినను నమ్మరు. వాళ్ళు తమ అవిధేయతకు, గర్వానికి, తెలివి తక్కువతనానికి తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు" అన్నాడు.
ధ్యానాంశములు :
1.ఈ లోకంలో ధనం సంపాదించుకొని, సుఖ సంతోషాలతో జీవితం గడపాలనుకొనేవాడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొంటాడు. ఎవడును యిద్దరు యజమానులకు సేవకునిగా వుండలేడు. దేవుణ్ణి, సిరిని ఏకకాలంలో సేవించడం సాధ్యం కాదు.
2.దేవునియందు భయభక్తులు కలిగి వుండాలి. ఆయన బోధలు అనుసరించాలి. ధనవంతుల మనసంతా ధనం మీదే వుంటుంది. వారు ధన సంపాదన కోసం ఎన్నో అక్రమాలు కూడ చేస్తారు. కనుకనే యేసుక్రీస్తు ఒక సందర్భంలో “ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము" అని చెప్పాడు.
3.ఈ కథ యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పిన కథకాదు. ఆయన నిన్న, నేడు, రేపు (మూడు కాలాల్లో) ఏకరీతిగా వున్నవాడు. జరిగినవి, జరుగుతున్నవి, జరుగబోయేవి అన్ని విషయాలు ఆయనకు తెలియును. కనుక మనుష్యులందరికి హెచ్చరికగా వుండు నిమిత్తము ఈ కథను చెప్పాడు.
బంగారు వాక్యము:
నామాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడై యున్నాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు.
యోహాను 5:24.
No comments:
Post a Comment