లోవిక్ అనే పట్టణానికి ఒక మైలు దురంలో థామస్ అనే ఒక బీదవాడుండేవాడు. అతడు ఒంటరిగానున్న ఒక చిన్న పూరిగుడిసెలో కాపురముండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద బొగ్గుల బస్తాలను వేస్తూ తన భార్యను, యిద్దరు చిన్న పిల్లలను
పోషించుకునేవాడు. కొన్నిసార్లు ఆ పనికూడ దొరకనప్పటికి తన కుటుంబ పోషణకు తన సంపాదన సరిపోయేది కాదు. అయితే అతడు దేవునియందు భయభక్తులు కలిగి దేవునికి సమీపంగా జీవిస్తూ
ఉండేవాడు. దేవుడతని ప్రార్థనలకు జవాబులిచ్చేవాడు. ఒక దినమున తాను అమ్మిన బొగ్గులకు డబ్బు అందనందున ఎంతో నిరాశతో
యింటికి తిరిగి వచ్చాడు. ఇంటిలో కూడ తినడానికేమిలేదు. ఆ వారు పస్తుండవలసినదే. పెద్దవాళ్లెతే ఫరవాలేదు కాని యిద్దరు చిన్న పిల్లలు. వారు ఆకలితో కేకలేస్తూ ఉన్నారు.
పిల్లల పరిస్థితిని చూచి అతని భార్య భోరున ఏడ్వసాగింది. పిల్లలిద్దరు అర్థరాత్రి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయారు. వారితోపాటు వారి తల్లికూడ నిద్రపోయింది. భార్యా పిల్లలను
నిద్రపుచ్చిన తరువాత థామస్ బయటికి వచ్చాడు. అది ఒక చక్కని వెన్నెల రాత్రి. అతడు కొంత దూరము వెళ్లి ఒంటరిగా ఒక స్థలములో కూర్చొని హబక్కూకు 3:17-19 వచనాలలోనున్న గొప్ప సత్యాలను
ధ్యానం చేశాడు. “అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినను, ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు
పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను.
నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్లవలె చేయును. ఉన్నత స్థలములమీద ఆయన నన్ను నడువజేయును” సుమారు ఒక గంట సేపు ప్రార్థనలో గడిపాడు. హబక్కూకు చెప్పినట్లుగా తాత్కాలికమైన అవసరతలను గూర్చి ధ్యానించాడు. ఆయన
హృదయము తేలికపడిన తరువాత యింటి ముఖం పట్టాడు. ఆయన యింటికి చేరుకున్న తరువాత లోపలికి వెళ్లకముందే కిటికీలోంచి చూశాడు. ఆ వెన్నెల కాంతిలో తన భార్యాపిల్లలు పడుకున్న మంచము ప్రక్కన ఒక స్టూలు మీద ఏదో ఉండడం గమనించాడు.
తరువాత లోపలికి వెళ్లి తడిమి చూడగా అక్కడ వేయించిన మాంసము ఒక పెద్ద రొట్టె ఉండడం గమనించాడు. వెంటనే బయటికి వచ్చి ఎవరైనా
ఉన్నారా? అని చూశాడు. గట్టిగా అరిచాడు. కాని కనుచూపుమేరలో అతనికెవరూ కనిపించలేదు. తరువాత లోపలికి వచ్చి తన భార్యను యిద్దరు పిల్లలను లేపాడు. వారు ఆ ఆహారాన్ని చూచిన వెంటనే వారు కళ్లు చెమర్చాయి. వారు దేవుని స్తుతించి నిండుగా ఆరగించారు. అయితే ఈనాటి వరకు ఆ యాహారం ఎక్కడి నుండి వచ్చిందో
వారికి తెలియదు. థామస్ దీనిని వ్రాసిన రచయితతో ఈ విషయాన్ని చెప్పాడు. అతడు ఆరా తీయగా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి.
లోవిక్ పట్టణ శివార్లలో స్ట్రేంజ్వస్ అనే ఒక ధనవంతుడైన రైతు ఉన్నాడు. అతడు మహా పిసినారి. అతని పినిగొట్టుతనాన్నిబట్టి అతని స్నేహితులు
అతనిని హేళన చేస్తూ ఉండేవారు. ఒక దినమున తన స్నేహితులకు తాను పిసినిగొట్టు వానిని కాదు అని నిరూపించడానికి ఒక గొప్ప విందు ఏర్పాటుచేశాడు. వారికొరకై మాంసము, రొట్టె తెప్పించి చక్కగా
వేపుడు చేయమని పనివారి కాజ్ఞాపించాడు. తన స్నేహితులకు ముందుగా తెలియజేయకుండా వారిని ఆశ్చర్యపరచాలనుకున్నాడు. ఆ సాయంకాలమున వారు మార్కెట్ నుండి ఈయన యింటి దగ్గర ఆగి, వారి గ్రామానికి గుఱ్ఱముల పై వెళతారు. అప్పుడు వారిని లోనికి ఆహ్వానించాలనుకున్నాడు. వారి కొరకు కనిపెడుతూ ఉన్నాడు కాని వారు వచ్చే సమయానికి చిన్న చిన్న వానజల్లులు కురిసినందువలన వారు ఇతని యింటి దగ్గర ఆగకుండానే గుద్దాలను వేగముగా
తోలుకుంటూ వెళ్లిపోయారు. వారికొరకు సిద్ధము చేసిన భోజనం అలాగే ఉండిపోయింది. అతడు చాలా విసుక్కుని నిద్రపోయాడు. అయితే అక్కడికి ఒక మైలు దూరములోనున్న థామస్ కుటుంబం ఆకలితో
నున్నట్లు తాను వారికి రొట్టెను మాంసమును పంపించినట్లు కలగన్నాడు. మెలకువ వచ్చింది. చిరాకుగా మరల పడుకున్నాడు. మరల అదే కల, లేచాడు మరల పడుకున్నాడు. మూడవసారి కూడ అదే కల. వెంటనే అతడు లేచి తన పనివారిలో ఒకని లేపి ఆ రొట్టెను, మాంసమును థామకు యిచ్చిరమ్మని ఆజ్ఞాపించాడు. పనివాడు వచ్చేసరికి థామస్ యింట్లో లేడు. ఒంటరి ప్రార్థనలో నున్నాడు. అతని భార్యా పిల్లలు నిద్రపోతున్నారు. వారిని లేపకుండా వారి మంచము ప్రక్కన స్టూలు మీద వాటిని పెట్టి వచ్చేశాడు.
No comments:
Post a Comment