పూర్తి పేరు : జాన్ వెస్లీ
జన్మస్థలం: ఇంగ్లాండ్ లోని ఎపి వర్తు
తల్లిదండ్రులు: సామ్యూల్ వెస్లీ, సూసన్నా వెస్లీ
జననం: 1703 జాన్ 17
మరణం: 1791 మార్చి 2
రక్షణానుభవం: 35 సం॥ల వయస్సులో
సేవా ఫలితం: ఇంగ్లాండ్ దేశమంతటా ఉజీవ జ్వాలలు
రగుల్కొల్ని ఇంగ్లాండ్ దేశాన్ని క్రీస్తు కొరకు
సంపాదించెను.
జాన్ వెస్లీ 1703 జూన్ 17 వ తారీఖున సామ్యూల్ వెస్లీ, సూసన్నా వెస్లీ అను దంపతులకు కలిగిన 19 మంది బిడ్డలలో 15 వ వాడిగా పుట్టెను. ఆ 19
మందిలో 10 మంది మాత్రమే బ్రతికిరి. వారిలో జాన్ వెస్లీ ఒకడు. వెస్లీ కూడా తన ఆరవ సంవత్సరములోనే భయంకరమైన అగ్నిప్రమాదములో మరణించవలసియుండెను. కాని, అతని కొరకు గొప్ప ఉద్దేశ్యములు కలిగిన దేవుని కృప అతనిని కాపాడెను.
వెస్లీ తండ్రి బోధకుడు. తల్లి చిన్న వయస్సు నుండి బిడ్డలను దేవుని భయభక్తులలో పెంచిన స్త్రీ. వెస్లీ దేవుని భయభక్తులయందును, జ్ఞానమందును
పెరుగుచు, తన 15వ సంవత్సరములో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో చేరి విద్యాభ్యాసము నందు ముందుకు సాగుచుండెను. తన 23 వ సంవత్సరానికి
యం.ఏ. ముగించడమే కాక, లాటిన్, గ్రీకు, హీబ్రూ, ఫ్రెంచి మొదలగు భాషలలో ఆరితేరిన వాడాయెను.
వెస్లీ తల్లిదండ్రులు ఇతనిని సేవకు ప్రత్యేకించిరి. వ్యక్తిగతముగా వెస్లీ అపవిత్రమైన కార్యాలకు చోటివ్వనందున, తాను పరిశుద్ధుడననే అభిప్రాయమును కలిగియుండెను. తన తండ్రి పాస్టరు అయినందున తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగపలెనని జాన్ వెస్లీ తన్ను తాను సేవకు సమర్పించుకొనెను. ఉదయము, సాయంకాలము క్రమముగా బైబిలు చదువుకొనుటయు, చర్చికి
వెళ్ళుటయు తన భక్తికి ఆధారమనుకొనుచుండెను. వ్యభిచారము, దొంగతనము మొదలగు అసహ్యకరమైన పాపములు తాను చేయుటలేదు కాబట్టి, తాను మంచివాడనని అనుకొనుచుండెను. గాని, తన స్వనీతి, గర్వము, అవిశ్వాసము
అనునవి రక్షణకు అడ్డుగా ఉన్నవని అతడు గ్రహించలేక పోయెను. థామస్ ఏ. కేంపస్ వ్రాసిన 'క్రీస్తు అనుకరణ' అను పుస్తకమును చదివిన తరువాత వెస్లీ తన అభిప్రాయమును మార్చుకొని; బాహ్యశుద్ధికంటె, అంతరంగ శుద్ధి ముఖ్యమని, నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయుట కాదుగాని అంతరంగములో ఉండవలసినదని గ్రహించి, దేవుని ముందు తన నీతి క్రియలు మురిగి గుడ్డలవంటివని గుర్తించెను. అయినను ఇంకనూ లోతైన రక్షణానుభవము
పొందనివాడిగానే యుండెను. గనుక ఆయన పరిచర్యలో ఆత్మలు రక్షించబడుట
చూడలేక పోయెను.
కాని, 1736 అక్టోబర్ 18వ తారీఖున జాన్ వెస్లీ, అతని సహోదరుడైనఛార్లెస్ వెస్లీ ఓడలో అమెరికాకు మిషనెరీలుగా ప్రయాణమైరి. ఆ ఓడలో భక్తి
పరులైన మొరేవియనులు కొందరుండిరి. వారిలో ఒకరైన పీటర్ బోలర్ గారు జాన్ వెస్లీకి ఓడలో పరిచయమాయెను. ఆయన 'నీవు రక్షించబడితివా?” అని అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపడిన వెస్లీ 'నేను చిన్న వయస్సు నుండి పరిశుద్ధముగా యున్నాను.
దేవుని సేవకు అర్పించుకున్నాను' అని చెప్పెను. “రక్షణ క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా వ్యక్తిగతముగా సంపాదించుకొనవలసిందేగాని మంచిగా
బ్రతుకుటవలన వచ్చునదిగాద"ని ఆయన తెలియజేసెను. "యేసు క్రీస్తు లోకరక్షకుడని ఎరుగుట కాదు. గాని, యేసుక్రీస్తు నీ రక్షకుడైనాడా?" అన్న మరొక ప్రశ్న వెస్లీని కదిలించెను. “రెడ్ ఇండియన్లను రక్షించుటకు నేను అమెరికా వెళ్ళుచుంటిని. అయ్యో!! నన్నెవరు రక్షింపగలరు? విశ్వాసములేని నా దుష్ట
హృదయము నుండి నన్నెవరు విడిపించగలరు?" అని పశ్చాత్తాపపడి లోతైన రక్షణానుభవమును 1738 మే 24 వ తేదీన పొందెను. ఆ తరువాత ఎక్కువగా
ప్రార్ధనలో గడుపుచు, ఆత్మల రక్షణార్థమై భారము పొంది, సేవ చేయుచుండెను. ప్రార్థనలో అధిక సమయము గడుపుట వలన ఆయన సంపూర్ణముగా
రక్షించబడెను; సేవలో ఆశీర్వాదము ప్రారంభమాయెను. ప్రతి దినము ఉదయం నాలుగు గంటలకే లేచి ప్రార్థించుట మొదలు పెట్టెను. వీథులలోనికి వెళ్ళి ప్రసంగించుచుండగా అనేక వందల మంది పశ్చాత్తాపపడి ప్రభువువైపు తిరుగుచుండిరి. కుండపోతగా వర్షము కురియుచున్నను, లండన్ వీధులలో రెండు, మూడు గంటలసేపు ప్రసంగించుచున్నపుడు, ప్రజలు వర్షములో తడియుచున్నను, ఆసక్తితో దేవుని వాక్యమును వినుచుండిరి. పశ్చాత్తాపము, మారుమనస్సు,
పాపక్షమాపణ గురించి నొక్కి చెప్పే ఆయన బోధను ఇష్టపడని క్రైస్తవ దేవాలయములు ఆయనను ఆహ్వానించకపోయినను, జాన్ వెస్లీ గుఱ్ఱముపై ప్రయాణము చేయుచు, వీధులలో ప్రసంగించుచు బలమైన వర్తమానముల ద్వారా అనేక బండ
హృదయములను పగులగొట్టుచుండెను. జనులు పశ్చాత్తాపపడి పరివర్తన చెందుచుండిరి.
వెస్లీ చాలా కట్టుదిట్టములు, క్రమశిక్షణ కలిగినవాడు. వెస్లీ పరిచర్య అంతకంతకు విస్తరించి, ఇంగ్లాండు దేశములో ఉజ్జీవ జ్వాలలు రగులుకొనెను.
ఆయన సమోదరుడైన ఛార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీకి తోడుగా యుంటూ తన మధురమైన
సంగీతము ద్వారా హృదయాలను స్పందింపజేసె భావయుక్తమైన పాటలతో అనేకులను పశ్చాత్తాపములోనికి నడిపించుచుండెను.
"లోకమే నా సేవాస్థలము" అనుచు, అనేక స్థలములలో ప్రయాణము చేయుచు, అనేక పట్టణములలో, గ్రామములలో రాత్రనక, పగలనక ప్రసంగించు చుండెను. ఆయన ప్రసంగములు బాణములవలె మనుష్యుల హృదయములలో
దూరుచు, పశ్చాత్తాపమును కలిగించుచుండెడివి. ఆయన కూటములలో అనేకులు క్రిందపడి దొర్లుచు, వారి పాపములు ఒప్పుకొనుచు, కన్నీటితో ప్రార్థించుచు, విడుదల పొందెడివారు.
ఆయన చాలా కఠినుడుగాను, క్రమశిక్షణ కోరువాడుగాను ఉన్నప్పటికిని ఆయనలో ఉన్న సహనము, దీనత్వము అనేక ఆత్మలను సంపాదించుటకు సహాయపడెను. ఆయన ఇంగ్లాండులో మాత్రమేకాక, ఐర్లండు, అమెరికా, కెనడా
మొదలగు దేశములలో కూడా సేవ ప్రారంభించెను. మెథడిస్టు సంఘస్థాపకుడు
ఈయనే! ఈయన ప్రతి మైలు ప్రయాణము వెనుక, ప్రతి ప్రసంగము వెనుక ప్రార్ధన ఉండేది. ప్రసంగములోని ప్రతిమాట వెనుక కన్నీరు ఉండేది. అందువలననే కఠిన హృదయులు వీధి కూటములలో కూడా పశ్చాత్తాపపడి, కన్నీటితో సిలువను వెదకి
రక్షింపబడెడివారు. జాన్ వెస్లీ ధనాపేక్షకు ఎట్టి చోటివ్వక "డబ్బు - పెంట, పేడ, దానిని నేను వెదకను, ఆశించను; దాని కొరకు నేను ప్రయాసపడను"
అంటూండేవాడు. ఆలాగే తన జీవిత దినములలో దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టెను గాని, డబ్బు దాచుకొనుటకు ప్రయత్నించలేదు. అలాగే
ఆయన మరణించినప్పుడు ఆయన సొరుగులో కొన్ని చిల్లర డబ్బులు తప్ప ఆయన పేరున ఏ ఆస్తి లేకపోవుట కనుగొనిరి.
జాన్ వెస్లీ సంవత్సరమునకు 30 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లు ఖర్చు చేసుకొని, కష్టములో ఉన్నవారికి మిగిలిన 2 పౌండ్లు యిచ్చేవాడు. తద్వారా మరుసటి సంవత్సరము అతని ఆదాయము 60 పౌండ్లు అయినప్పుడు కూడా
28 పౌండ్లే ఖర్చు పెట్టుకొని; మిగిలినది దేవుని కొరకు, పేదల కొరకు వాడెను. మరుసటి సంవత్సరము 90 పౌండ్లు సంపాదించినను; 28 పౌండ్లు మాత్రమే
తన కొరకు వెచ్చించుకొని, మిగిలినది దేవుని నామములో పేదలకిచ్చెను. నాలుగవ
సంవత్సరము అతని ఆదాయము 120 పౌండ్లు అయినప్పటికిని తన ఖర్చుల కొరకు ఎప్పటివలె 28 పౌండ్లో ఉంచుకొని మిగిలినది దేవునికిచ్చెను. తన
ఆడంబరములకు వినియోగించుకొనుటకో, తన జీవిత స్థాయిని పెంచుకొనుటకో ప్రయాసపడక; తన సంపాదనతో దేవుని మహిమపరచెను. “వీలైనంత వరకు ఆదా చేయి, ఆదా చేసినదంతా దేవుని కోసం ఖర్చు పెట్టు" అనెడివాడు,
జాన్ వెస్లీ తన సేవలో 36 ప సంవత్సరము వరకు 2,250,000 మైళ్ళు గుఱ్ఱము పై పయనించి, 40,000 ప్రసంగములను చేసెను. అనేక సార్లు ఈయన
మీటింగులలో 20,000 జనముండేవారు. ఈయన తన సేవా జీవితం 40 వ సంవత్సరమున సేవలో ప్రయాణించిన దూరము సరాసరి లెక్క చొప్పున రోజుకు 20 మైళ్ళు సంవత్సరానికి 8000 మైళ్ళు. ఈయన సంవత్సరమునకు 5000 సార్లు ప్రసంగించెడివాడు. సువార్త సేవకై 30,000 డాలర్లు తన సొంత ధననిధిలో నుండి వాడెను. ఈయన పది భాషలు నేర్చుకొనెను. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ప్రార్ధించి 7 గంటలకల్లా ప్రసంగించటం మొదలు పెట్టేవాడు. “ప్రభువా! నీ కొరకు కాలిపోనీ గాని తుప్పుపట్టనివ్వవద్దు, నిష్ప్రయోజమైన జీవితము
జీవింపనీయవద్దు" అని మాటి మాటికి ప్రార్ధించెడివాడు. తన 83 వ యేట దినమునకు 15 గంటలకంటె ఎక్కువ వ్రాయలేకపోతినే అని చింతించెడి వాడట! తన 86 వ యేట దినమునకు రెండుసార్లకంటె ఎక్కువ ప్రసంగములు చేయలేకపోతినే అని సిగ్గు పడ్డాడట! తన 86 వ యేట ఉదయం 5.30 గంటల
వరకూ పడుకోవాలని ఆశకల్గుతుందని బాధపడి, తన డైరీలో వ్రాసుకున్నాడు.
చివరికి జాన్ వెస్లీ రష్యాలో సేవ చేస్తుండగా వచ్చిన తీవ్రమైన జ్వరము వలన 1791 మార్చి 2 వ తేదీన తన 88 వ సంవత్సరములో ప్రభువునందు నిద్రించెను. 'దేవుడు మనకు తోడుగా ఉన్నాడు' అనేవి ఈ కల్వరి యోధుని చివరి మాటలు.
No comments:
Post a Comment